పాకిస్తాన్‌లో మళ్లీ అలజడి..!!
Pakistan earthquake 2025: పాకిస్తాన్‌లో వరుస భూకంపాలు చోటుచేసుకుంటోన్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు రెండుసార్లు భూమి ప్రకంపించింది. ఈ నెల 5వ తేదీన ఖైబర్ ఫఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో భూమి ప్రకంపించగా.. ఇప్పుడు తాజాగా సెంట్రల్ పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది.
దీనివల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియరాలేదు. పలు నివాసాలు బీటలు వారినట్లు సమాచారం అందుతోంది. కొన్ని చోట్ల పాక్షికంగా కూలిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా రికార్డయింది. ఈ మధ్యాహ్నం సరిగ్గా 1:26 నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. 21.12 నార్త్ అక్షాంశం, 67.26 తూర్పు రేఖాంశం పరిధిలోకి వచ్చే క్వెట్టా, లర్ఖానా మధ్య గల భక్తియార్‌బాద్- డేరామురాద్ జమాలి ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది.
ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించినట్లు సెస్మాలజీ సెంటర్ తెలిపింది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు.
ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. క్వెట్టా, లర్ఖానాల్లోనూ భూకంప తీవ్రత కనిపించింది. పలు చోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి.
భౌగోళికంగా- క్రియాశీలక భూకంప ప్రాంతం పాకిస్తాన్. యురేషియన్- ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల పరిధిలోకి వస్తుందీ దేశం. దీని పరిధిలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ నెలలో రెండోసారి అక్కడ భూమి ప్రకంపించిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, కొన్ని గిరిజన ప్రాంతాలు.. యురేషియన్ ప్లేట్ దక్షిణ అంచున ఉన్నాయి. సింధ్, పంజాబ్ ప్రావిన్స్‌తో పాటు మనదేశంలోని జమ్మూ కాశ్మీర్.. ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్స్ పరిధిలో ఉంటాయి. ఫలితంగా ఈ రీజియన్‌లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయని సెస్మాలజీ సెంటర్ తెలిపింది.












Click it and Unblock the Notifications