ఇంకా ఏం మిగిలిందని: మయన్మార్ మళ్లీ వణికింది- రిక్టర్ స్కేల్‌పై..!!
Myanman earthquake 2025: భారత్‌కు పొరుగునే ఉన్న మయన్మార్, థాయ్‌లాండ్‌లల్లో సంభవించిన భూకంపం మిగిల్చిన ప్రాణ, ఆస్తినష్టం అంతా ఇంతా కాదు. నిమిషాల వ్యవధిలో సంభవించిన పెను భూకంపాలు ఈ రెండు దేశాలను కుదిపిపడేశాయి. కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి.
ఈ ప్రకృతి విపత్తు బారిన పడి 1,600 మందికిపైగా దుర్మరణం పాలయ్యారు. మరో 3,000 మందికి పైగా ఆచూకీ తెలియరావట్లేదు. వారంతా కూడా భవనాల శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తోన్నారు. ఈ భూకంపాల ధాటికి మయన్మార్, థాయ్‌లాండ్‌లల్లో అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. పలువురు వాటి శిథిలాల కింద చిక్కుకున్నారు.

సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భవనాల శిథిలాలను తొలగిస్తోన్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగొచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. ప్రకృతి విపత్తు బారిన పడిన ఈ రెండు దేశాలకు ప్రపంచవ్యాప్తంగా ఆపన్న హస్తం అందుతోంది. భారత్ సహా అనేక దేశాలు తమవంతు సహాయాన్ని అందిస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య ఇప్పుడు తాజాగా మయన్మార్‌లోనే మళ్లీ భూమి ప్రకోపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా రికార్డయింది. మూడు రోజుల కిందట పెను భూకంపం సంభవించిన మాండలే పరిసరాల్లోనే తాజా ప్రకంపనలు కూడా చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మూడు రోజుల వ్యవధిలో భూకంపం సంభవించడం ఇది నాలుగోసారి. అన్ని సార్లు కూడా భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4కు పైగానే రికార్డయింది. అంత కంటే తక్కువ స్థాయిలో భూమి 14 సార్లు ప్రకంపించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్ వెల్లడించింది.
ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు. రోడ్ల మీదే కాలం గడుపుతున్నారు. తాజా భూకంపం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. భూమి తరచూ కంపిస్తోండటంతో రెస్క్యూ దళాలు తమ సహాయక చర్యలను నిలిపివేయాల్సి వస్తోంది.












Click it and Unblock the Notifications