కుదిపేసిన భారీ భూకంపం
Pakistan earthquake 2025: ఇటీవలి కాలంలో భారత ఉపఖండంలో భూకంపాలు సర్వసాధారణం అయ్యాయి. పొరుగునే ఉన్న మయన్మార్, థాయ్‌లాండ్‌లల్లో సంభవించిన భూకంపం మిగిల్చిన ప్రాణ, ఆస్తినష్టం అంతా ఇంతా కాదు. నిమిషాల వ్యవధిలో సంభవించిన పెను భూకంపాలు ఈ రెండు దేశాలను కుదిపిపడేశాయి. కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి.
ఈ ప్రకృతి విపత్తు బారిన పడి 3,645 మంది వరకు దుర్మరణం పాలయ్యారు. 5,017 మంది గాయపడ్డారు. అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. పలువురు వాటి శిథిలాల కింద చిక్కుకుని కన్నుమూశారు. భవనాల శిథిలాలను తొలగిస్తోన్న కొద్దీ మృతదేహాలు బయటపడ్డాయి.

ఇప్పుడు తాజాగా పొరుగుదేశం పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. ఇది షాల్లో ఎర్త్‌క్వెక్. సాధారణం కంటే అత్యంత ప్రమాదకరంగా భావిస్తుంటారు భూగర్భ శాస్త్రవేత్తలు. ఇప్పటివరకు దీనివల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియరాలేదు. పలు నివాసాలు బీటలు వారినట్లు సమాచారం అందుతోంది. కొన్ని చోట్ల పాక్షికంగా కూలిపోయినట్లు చెబుతున్నారు.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా రికార్డయింది. ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. పంజాబ్, ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో అట్టోక్, ఛక్వాల్, మియావాలీ, షాబ్ ఎ ఖాదర్ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించింది.
భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు. ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ భూకంప తీవ్రత భారత్‌లోనూ కనిపించింది. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్, జమ్మూ కాశ్మీర్‌లల్లో ప్రకంపనలు రికార్డయ్యాయి. భౌగోళికంగా- క్రియాశీలక భూకంప ప్రాంతం పాకిస్తాన్. యురేషియన్- ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల పరిధిలోకి వస్తుందీ దేశం. దీని పరిధిలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.
బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, కొన్ని గిరిజన ప్రాంతాలు.. యురేషియన్ ప్లేట్ దక్షిణ అంచున ఉన్నాయి. సింధ్, పంజాబ్ ప్రావిన్స్‌తో పాటు మనదేశంలోని జమ్మూ కాశ్మీర్.. ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్స్ పరిధిలో ఉంటాయి. ఫలితంగా ఈ రీజియన్‌లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయని సెస్మాలజీ సెంటర్ తెలిపింది.












Click it and Unblock the Notifications