వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇథియోపియా: ప్రజలంతా ఆయుధాలు పట్టుకోవాలని ఈ దేశం ఎందుకు కోరుతోంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నిరాశ్రయులైన టిగ్రే ప్రజలు

గత కొన్నేళ్లుగా ఇథియోపియా.. అక్కడి ఆర్థికాభివృద్ధి, ప్రజాస్వామ్య సంస్కరణల కారణంగా వార్తల్లో నిలిచింది. కానీ, ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న టిగ్రే సంక్షోభం పరిస్థితిని మార్చింది.

ఇథియోపియా ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటి.

ఉత్తర టిగ్రే ప్రాంతంలో ఏడాది పాటు కొనసాగిన పోరాటం తర్వాత ఇథియోపియా మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

ఈ సంక్షోభంలో కొన్ని వేల మంది మరణించారు, కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు, వేలాది మంది కరవులో కొట్టుమిట్టాడుతున్నారని సహాయ సంస్థలు చెబుతున్నాయి.

ఇటీవల రాజధాని ఆడిస్ అబాబాకు 400 కిలోమీటర్ల దూరంలోనున్న రెండు నగరాలను టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్(టీపీఎల్ఎఫ్) స్వాధీనం చేసుకుందని వచ్చిన వార్తల నేపథ్యంలో ఇథియోపియా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రజలంతా ఆయుధాలు అందుకోవాలని కోరింది.

ఈ పరిస్థితి ఇథియోపియాతో పాటు పొరుగు దేశాల భవిష్యత్తుపైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.

ఈ పరిస్థితి నెలకొనడానికి కారణాలేంటి, ప్రస్తుతం అక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం.

భోజనం కోసం క్యూలో నిల్చున్న పిల్లలు

టిగ్రేలో పోరాటం ఎంత దారుణంగా ఉంది?

2020, నవంబరు 4న ఇథియోపియాలో యుద్ధం మొదలయింది.

ఇథియోపియా ప్రధాన మంత్రి అబీ అహ్మద్ టిగ్రేలో ప్రాంతీయ సేనలకు వ్యతిరేకంగా దాడులు చేపట్టాలని ఆదేశించడంతో యుద్ధం మొదలైంది. ఆయన 2019 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కూడా.

తొలుత ప్రభుత్వ సేనలు తిరుగుబాటుదారులను అణచివేశాయి. కానీ, టిగ్రే పోరాటదారులు కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో జూన్ నుంచి పరిస్థితుల్లో మార్పు రావడం మొదలయింది.

వారు ఆడిస్ ఆబాబాకు దగ్గరగా వస్తున్నట్లు సమాచారం ఉంది. కేంద్ర ప్రభుత్వం టిగ్రేలో మీడియాను పూర్తిగా నిషేధించి బ్లాక్ అవుట్ ప్రకటించింది.

కానీ, ఈ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 70 లక్షల మంది ప్రజలకు ఆహారంతో పాటు ఇతర సహాయ అవసరాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఇందులో కనీసం 4,00,000 మంది కరవుతో సతమతమవుతున్నట్లు చెప్పింది. కానీ, ఈ వాదనను ఇథియోపియా ప్రభుత్వం ఖండిస్తోంది.

అన్ని వర్గాల వారూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడి, మూకుమ్మడి హత్యలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి.

శరణార్థులు, నిరాశ్రయులను చట్ట వ్యతిరేకంగా ఉరి తీయడం, హింస, అత్యాచారాలు జరిగిన కొన్ని ఘటనలను పొందుపరిచినట్లు

ఇథియోపియా హ్యూమన్ రైట్స్ కమీషన్ (ఈహెచ్‌ఆర్‌సి) యూఎన్ హ్యూమన్‌రైట్స్ ఆఫీస్ నవంబరు 3న సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

ఈ మానవ హక్కుల ఉల్లంఘన చర్యలు యుద్ధ నేరాలతో సమానం అని ఈ నివేదిక పేర్కొంది. అయితే, ప్రభుత్వం, టీపీఎల్‌ఎఫ్ కూడా ఈ నివేదికను విమర్శించాయి.

సుడాన్‌లో శరణార్థ శిబిరంలో శరణార్ధులకు వినోదాన్ని పంచుతున్న టిగ్రే సంగీతకారుడు

ప్రస్తుతం ఏం జరుగుతోంది?

టిగ్రేలో ఉద్రిక్తతలు తలెత్తడం కొత్త విషయమేమీ కాదు. ఇక్కడ 50-70 లక్షల మంది జనాభా నివాసం ఉంటారు.

ఇథియోపియా జనాభా 15 కోట్లు ఉంటుందని అంచనా .

జాతుల ప్రాతిపదికన ఇథియోపియాలో 10 ప్రాంతీయ రాష్ట్రాలుంటాయి. ఈ ప్రాంతాలన్నీ స్వయం ప్రతిపత్తి కలిగి , కేంద్ర సంస్థలతో అనుబంధం కలిగి ఉంటాయి. టిగ్రే ప్రాంత ప్రజలు దేశంలోనే మూడో పెద్ద జాతి సమూహాలకు చెందినవారు.

ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత నెలకొని ఉంది. 1974లో సోషలిస్ట్ తిరుగుబాటు తర్వాత ఇథియోపియా ఆఖరు చక్రవర్తి హైలీ సెలాసీ పాలన అంతమైనప్పటి నుంచీ కొనసాగిన సుదీర్ఘమైన మిలిటరీ పాలన , పౌర యుద్ధం వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

టిగ్రే 1983 నుంచి కరవుకు కేంద్రంగా మారింది. దీంతో, కనీసం 10లక్షల మంది మరణించారు. 20 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

Graphic showing the different ethnicities in Ethiopia

కొన్ని దశాబ్దాల పాటు సుస్థిరత నెలకొన్న తర్వాత టిగ్రే ప్రాంతీయ పాలక సేనలు, కేంద్ర ప్రభుత్వం మధ్య తిరిగి పోరాటం మొదలయింది.

కానీ, ఈ పోరాటం ఇథియోపియాలో ఉన్న ఇతర జాతి సమూహాల్లో కూడా చీలికలను తెచ్చింది. దేశంలో ఉన్న 10 ప్రాంతాల్లో నాలుగు ప్రాంతాల ప్రభుత్వాలు టిగ్రే సేనలతో పోరాడేందుకు సమాయత్తం కావాలని ప్రజలకు పిలుపునిచ్చినట్లు ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ ఫనా టీవీ రిపోర్ట్ చేసింది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒరోమో లిబరేషన్ ఆర్మీ (ఓఎల్‌ఏ) టిగ్రే తిరుగుబాటుదారులతో అధికారికంగా జత కలుస్తున్నట్లు ఆగస్టులో ప్రకటించింది.

ఒరోమో కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోంది.

టిగ్రే సేనలు

పోరాటం ఎందుకు ?

పారా మిలిటరీ సంస్థ టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (టీపీఎల్‌ఎఫ్) 1991లో ప్రభుత్వాన్ని కూలగొట్టిన బలగాలతో చేతులు కలిపింది.

ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటూ టీపీఎల్‌ఎఫ్ దేశ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించింది.

టీపీఎల్‌ఎఫ్ 2019 వరకు ఇథియోపియా రాజకీయాల్లో ప్రభావవంతంగా ఉంది. ఇథియోపియా ప్రధాని అహ్మద్ కొత్త పార్టీని స్థాపించినప్పుడు టీపీఎల్‌ఎఫ్ ప్రభుత్వంలో చేరేందుకు తిరస్కరించింది.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణను వాయిదా వేసినప్పటికీ కూడా ఈ సంస్థ టిగ్రేలో అహ్మద్ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తూ గత ఏడాది సెప్టెంబరులో ఎన్నికలు కూడా నిర్వహించింది.

ఎన్నికలు జరిగిన రెండు నెలల తర్వాత టీపీఎల్‌ఎఫ్ సేనలు స్థానిక ఇథియోపియా సైనిక స్థావరాలపై దాడి చేశారు.

దీనికి స్పందనగా, కేంద్ర ప్రభుత్వం టిగ్రేపై భారీ సైనిక దాడి జరపాలని ఆదేశించింది.

టిగ్రే రాజధాని మెకెల్‌లో జరిగిన వైమానిక దాడులకు తామే కారణమని ఇథియోపియా ప్రభుత్వం అక్టోబరు 18న అంగీకరించింది.

టిగ్రే శరణార్థులు

టిగ్రే సంక్షోభం తూర్పు ఆఫ్రికాలో సుసుస్థిరతను దెబ్బ తీస్తోందా?

టిగ్రే సంక్షోభం కేవలం ఇథియోపియాపై మాత్రమే కాకుండా ఆ దేశ సరిహద్దులు దాటి ప్రయాణించింది. కొన్ని వేల మంది శరణార్థులు సుడాన్‌లోకి ప్రవేశించారు.

పొరుగున ఉన్న ఎరిత్రియా సేనలు కూడా టీపీఎల్‌ఎఫ్ తిరుగుబాటుదారులపై దాడులు చేసి, హింసకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి.

అయితే, టిగ్రేలో వారి ప్రస్తుత పరిస్థితి పై స్పష్టత లేదు. కానీ, ఎరిత్రియా సేనలు ఇథియోపియాలోనే ఉంటూ పోరాటంలో పాల్గొంటున్నాయని సహాయక సంస్థల సిబ్బంది రాయిటర్స్‌కు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం టిగ్రే పై అధిక దృష్టిని కేంద్రీకరించడంతో, అల్‌ షబాబ్ మిలిటంట్లకు వ్యతిరేకంగా సోమాలియా ప్రభుత్వానికి అందించే సహకారం బలహీనపడే అవకాశం ఉంది.

టిగ్రే సంక్షోభం ఇథియోపియాను బలహీనపరిచే అవకాశం ఉందని, దీంతో ప్రాంతీయ పరిణామాలను దెబ్బ తీయవచ్చని 'హార్న్ ఆఫ్ ఆఫ్రికా’కు చెందిన విశ్లేషకుడు రషీద్ అబ్దీ అభిప్రాయపడ్డారు.

ఉదాహరణకు, విభిన్న జాతుల సమాహారమైన దేశంలో ఈ తిరుగుబాటు ఇతర జాతుల వారిని కూడా ప్రభావితం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు ప్రోత్సహించవచ్చు.

"హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతానికంతటికీ ఇథియోపియా సుస్థిరత ముఖ్యమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ హెచ్చరించారు.

అన్ని వర్గాల వారితో కలిసి జాతీయ స్థాయిలో చర్చ నిర్వహించడం ద్వారా ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకుని దేశంలో శాంతి సుస్థిరతలకు పునాది వేయాలని ఆయన గతంలో కోరారు.

ఇథియోపియాతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల సుస్థిరతకు కూడా ప్రమాదం పొంచి ఉందని యూఎన్ ప్రతినిధి నవంబరు 02న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ దేశంలో నెలకొన్న ఘర్షణలకు వెంటనే అంతం పలికి టిగ్రే, అంహారా, అఫర్ ప్రాంతాల్లో ప్రజలకు సహాయం అందించేందుకు నిర్బంధనలు లేని ప్రవేశం ఇవ్వాలని కోరింది.

ఇథియోపియా ప్రధాన మంత్రి అబీ అహ్మద్

అంతర్జాతీయ సమాజం ఏమంటోంది?

టిగ్రే పోరాటదారులకు అమెరికా హెచ్చరిక పంపింది. ఆడిస్ ఆబాబాను స్వాధీనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేసింది.

"టీపీఎల్‌ఎఫ్ అడిస్‌ను స్వాధీనం చేసుకోవడం గాని, లేదా అబాబా వైపు కదలడాన్ని గాని మేం వ్యతిరేకిస్తున్నాం" అని హార్న్ ఆఫ్ ఆఫ్రికాకు యూఎస్ ప్రత్యేక రాయబారిగా ఉన్న జెఫ్రీ ఫెల్ట్‌మన్ చెప్పారు.

ఆ దేశంలో నెలకొన్న పోరాటం కారణంగా ఇథియోపియాను ఒక ముఖ్యమైన వాణిజ్య ఒప్పందం నుంచి తొలగిస్తున్నట్లు నవంబరు 2న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

ఇథియోపియాతో పాటు తిరుగుబాటుతో సతమతమవుతున్న గినియా, మాలి దేశాలనూ ఆఫ్రికన్ గ్రోత్ అండ్ ఆపర్‌ట్యూనిటీ యాక్ట్ నుంచి తొలగించారు. ఆ దేశ ప్రధాని అహ్మద్‌కు పలు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఈ చర్యను చేపట్టారు.

అంతర్జాతీయంగా గుర్తించిన మానవ హక్కులను దారుణంగా ఉల్లఘించడంతో ఇథియోపియా ఈ ఒప్పందానికి అర్హతను జనవరి 1 నుంచి కోల్పోతున్నట్లు బైడెన్ కాంగ్రెస్‌కు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ఆ దేశ వ్యవహారాల్లో దౌత్యపరమైన జోక్యాన్ని ఇథియోపియా తిరస్కరిస్తూ వస్తోంది. ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని చెబుతూ తమని తాము సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. తమ దేశంలో సమస్యలను తాము పరిష్కరించుకోగలమని చెబుతోంది.

దేశంలో సంక్షోభం మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా అబీ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వ శత్రువులను రక్తంతో పాతి పెడతామని నవంబరు 3న ప్రతిజ్ఞ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ethiopia: Why does this country want all people to take up arms
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X