సాక్షాత్ FBI చీఫ్ కే దిక్కులేదు- ఇరాన్ హ్యాకర్ల పంజా
అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టట్లేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.
ఈ పరిస్థితుల మధ్య ఇరాన్ హ్యాకర్లు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యురో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ కష్ పటేల్ కుభారీ షాక్ ఇచ్చారు. ఆయన వ్యక్తిగత ఇమెయిల్, ఇన్‌బాక్స్‌ను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ హ్యాకింగ్ గ్రూప్ ప్రకటించింది. ఈ సైబర్ దాడిలో భాగంగా వారు ఆయనకు సంబంధించిన కొన్ని ఈమెయిళ్లు, ఫొటోలు, వ్యక్తిగత వివరాలతో కూడిన రెజ్యూమెను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు కూడా. ఈ మొత్తం అంశం రాయిటర్స్ వార్తా సంస్థ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది.

దీనికి తామే బాధ్యత వహిస్తోన్నట్లు ఇరాన్ కు చెందిన హందాలా హ్యాక్ టీమ్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను ఈ హ్యకర్స్ టీమ్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ చర్యకు పూర్తి బాధ్యత తమదేనని వెల్లడించింది. దీనిని ఒక "అత్యంత ప్రముఖ సైబర్ చొరబాటు"గా ఆ టీమ్ సభ్యులు స్పష్టంగా అభివర్ణించారు. కష్ పటేల్ ఇప్పుడు విజయవంతంగా హ్యాక్ అయిన బాధితుల జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు.. అని హ్యాకర్లు పేర్కొన్నారు.
లీక్ అయిన ఈమెయిళ్లు, ఇతర డాక్యుమెంట్ల ప్రామాణికత గానీ, అందులో ఉండే వివరాలన గానీను రాయిటర్స్ తక్షణమే ధృవీకరించలేకపోయింది. అయినప్పటికీ వార్తా సంస్థ పరిశీలించిన మెటీరియల్ నమూనాలో 2010 నుండి 2019 వరకు కాష్ పటేల్ కు చెందిన వ్యక్తిగత, వృత్తిపరమైన ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నట్లు తన కథనంలో ప్రచురించింది.
ఈ ఘటనపై అమెరికా న్యాయ మంత్రిత్వ శాఖలోని ఓ అధికారి స్పందించినట్లు రాయిటర్స్ తెలిపింది. కష్ పటేల్ ఈమెయిళ్లు నిజంగానే లీక్ అయినట్లు ధృవీకరించారు. ఈ సైబర్ ఉల్లంఘన పూర్తి స్థాయిని లేదా దాని సున్నితత్వాన్ని గురించి అదనపు వివరాలు మాత్రం అందుబాటులో లేవని పేర్కొన్నట్లు రాయిటర్ వివరించింది. హ్యాకింగ్ సమాచారంపై ఎఫ్బీఐ ఇంకా స్పందించలేదు. దీనిపై ఓ పూర్తిస్థాయి నివేదిక వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications