పాక్, ఆఫ్గాన్ సరిహద్దుల్లో భీకర కాల్పులు..యుద్ధం దిశగా.. కారణం ఇదే!
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి నుండి ఆఫ్ఘనిస్తాన్ దళాలు సరిహద్దులోని పాకిస్తాన్ భద్రతా దళాల పోస్టులను టార్గెట్ చేసుకొని భీకర కాల్పులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం డ్యూరాండ్ రేఖ వెంబడి కునార్ నుండి హెల్మండ్ వరకు వివిధ సరిహద్దు ప్రాంతాలలో తీవ్ర ఘర్షణలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
పాక్ చర్యకు తాలిబన్ ప్రతిచర్య
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులలో వాతావరణం రణరంగంగా మారిందని, ఇది ఇలానే కొనసాగితే యుద్ధం తప్పదు అన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబూల్ పైన పాక్ వైమానిక దాడులకు ప్రయత్నం చేయడంతోనే నిన్న రాత్రి నుండి ఇరుదేశాల సరిహద్దులలో కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. కాబూల్ పైన పాకిస్తాన్ వైమానిక దాడులకు నిరసనగా ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ సైన్యం ప్రతీకార దాడులకు దిగింది.

దాడులపై ఆఫ్ఘనిస్తాన్ ప్రకటన
ఇక ఇదే విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ పాలకవర్గ మైన తాలిబన్ ప్రకటించింది. ఇరుదేశాల మధ్య సరిహద్దు ప్రాంతాలలో ఘర్షణ వాతావరణం ఉందని పాకిస్తాన్ భద్రతా దళాల అధికారులు సైతం అంగీకరించారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లో కాబూల్ లో రెండు పేలుళ్లు, అలాగే ఆగ్నేయ దిశలో మరొక బాంబు దాడి జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆ మరుసటి రోజు తాలిబన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులకు పాకిస్తాన్ బాధ్యులని పేర్కొంది.
పాక్ వర్సెస్ ఆఫ్గాన్.. ఘర్షణకు కారణం ఇదే
అంతేకాదు తమ పొరుగు దేశం దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ సైనిక ప్రతినిధి జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ ను పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాల స్థావరంగా ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడడానికి తీసుకోవలసిన చర్యలు తాము తీసుకుంటామని పేర్కొన్నారు.
ఆరుగురు పాక్ సైనికులు మృతి.. ఇద్దరిని పట్టుకున్న ఆఫ్గాన్ సైన్యం
ఈ దాడుల ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం ఆరుగురు పాకిస్తాన్ సైనికులు, ఆఫ్ఘనిస్తాన్ సైన్యం దాడులలో మరణించినట్టు, మరో ఇద్దరిని ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఇలాగే కొనసాగితే యుద్ధం తప్పదని అభిప్రాయం వ్యక్తమవుతుంది.












Click it and Unblock the Notifications