United Nations: ఆ హత్యల వెనుక షేక్ హసీనా ప్రభుత్వం హస్తం.. ఐక్యరాజ్యసమితి తీవ్ర వ్యాఖ్యలు
United Nations: గత సంవత్సరం బంగ్లాదేశ్ లో జరిగిన హింసాత్మక నిరసనల సందర్భంగా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు జరిగాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. బంగ్లాదేశ్ లో జరిగిన హింసాత్మక నిరసనలకు మాజీ ప్రధాని షేక్ హసీనానే బాధ్యురాలిగా ఐక్యరాజ్యసమితి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బంగ్లాదేశ్ మాజీ ప్రభుత్వం గత సంవత్సరం క్రమబద్ధమైన దాడులు, హత్యలు చేసిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. అవి మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలుగా అభివర్ణించింది. ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం నిరసనలను అణచివేసిందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది.
1,400 మంది మృతి
2024 జులై, ఆగస్టు 15 మధ్య బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటనలపై జరిపిన దర్యాప్తు ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం.. దాదాపు 1,400 మంది నిరసనకారులు కాల్చి చంపబడ్డారని.. వారిలో 12 నుంచి 13 శాతం మంది పిల్లలు ఉన్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. హత్యలు, హింస, ఇతర అమానవీయ చర్యలను మాజీ ప్రభుత్వం చేసినట్లు తెలిపింది. బంగ్లాదేశ్ భద్రతా, నిఘా సేవలు, షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ సభ్యులు నిరసనకారులపై దాడులకు పాల్పడినట్లు కూడా దర్యాప్తులో తేలింది. షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఎలాగైనా అధికారంలో ఉంచడమే వారి లక్ష్యమని వెల్లడైంది. భద్రతా దళాలు షేక్ హసీనా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయని, నిరసనలను అణిచివేయడానికి హింసాత్మక చర్యలను ఉపయోగించాయని కూడా నివేదిక వెల్లడించింది. ఇందులో మహిళలపై లైంగిక హింస, పిల్లలపై దారుణాలు కూడా ఉన్నాయి.

నిరసనలు కాస్త.. హింసాత్మక ఉద్యమంగా మారి..
గత సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ లో భారీ నిరసనలు చెలరేగాయి. అది త్వరలోనే హింసాత్మక ఉద్యమంగా మారింది. ఈ నిరసనలు షేక్ హసీనా ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తే ప్రచారంగా మారాయి. చివరకు షేక్ హసీనా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. నిరసనకారులు ఆమె ఇంటిని తగలబెట్టారు. అదే సమయంలో ఆమె తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజిబుర్ రెహమాన్ విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం పాలన బాధ్యతలను చేపడుతోంది.
నిరాయుధులైన ప్రజలను కాల్చి చంపారు..
బంగ్లాదేశ్ భద్రతా సంస్థల కాల్పుల్లో మరణించిన వారిలో ఎక్కువ మంది ఉన్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. ఈ హింసలో 834 మంది మరణించారని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అంచనా వేసింది. కానీ 1400 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. భద్రతా దళాలు ఉద్దేశపూర్వకంగా నిరాయుధులైన ప్రజలను కాల్చి చంపాయని లేదా వికలాంగులను చేశాయని నివేదిక తెలిపింది. నిరసనల్లో పాల్గొనకుండా నిరోధించడానికి మహిళలపై అత్యాచారం చేస్తామని బెదిరించారని కూడా దర్యాప్తు తేలింది. భారీ నిరసనల నేపథ్యంలో అధికారాన్ని కాపాడుకోవడానికి మాజీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో రూపొందించిన వ్యూహం ఈ క్రూరమైన హింసాకాండ అంటూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం చీఫ్ వోల్కర్ టర్క్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications