యుద్ధ చరిత్రలో నిలిచిపోయే సాహసం! ఇరాన్ పర్వతాల్లో 'డెడ్లీ' ఆపరేషన్
అమెరికా ప్రత్యేక ఆపరేషన్ల చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన మిషన్ ఒకటి ఇరాన్ గడ్డపై విజయవంతంగా ముగిసింది. శత్రు భూభాగంలో కూలిపోయిన ఎఫ్-15ఈ ( F-15E) యుద్ధ విమాన సిబ్బందిని, ఇరాన్ సైన్యం ముందే ప్రాణాలతో బయటకు తీసుకురావడంలో అమెరికా దళాలు విజయం సాధించాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వైట్‌హౌస్ సిట్యుయేషన్ రూమ్ నుంచి మానిటర్ ఈ ఆపరేషన్, ఆధునిక యుద్ధ తంత్రానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ వారం ఇరాన్ కాల్పుల ధాటికి అమెరికా యుద్ధ విమానం కూలిపోవడంతో ఇద్దరు సిబ్బంది పారాచూట్ల సహాయంతో కిందకు దూకారు. ఒక పైలట్‌ను గంటల వ్యవధిలోనే రక్షించినప్పటికీ, వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్ (WSO) మాత్రం కఠినమైన పర్వత ప్రాంతంలో చిక్కుకుపోయాడు. గాయపడిన స్థితిలో, కనీస వనరులతో ఉన్న ఆయనను పట్టుకోవడానికి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) వేట మొదలుపెట్టాయి. అయితే, ఆఫీసర్ తన వద్ద ఉన్న బీకన్ పరికరం ద్వారా అమెరికా కమాండ్ సెంటర్‌కు నిరంతరం సమాచారం పంపుతూ, 'సెరె' (SERE) శిక్షణతో శత్రువులకు చిక్కకుండా రెండు రోజుల పాటు ఏకాంతంగా పోరాడాడు.

కాలంతో పోటీ.. US నిప్పుల వర్షం!
అమెరికా రెస్క్యూ టీమ్స్ - ఇరాన్ సెర్చ్ పార్టీలు ఒకేసారి ఆఫీసర్ ఉన్న ప్రాంతం వైపు దూసుకురావడంతో అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ కాన్వాయ్‌లు అతన్ని చేరుకోకుండా అమెరికా విమానాలు ఆ ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించాయి. వందలాది ప్రత్యేక దళాలు, డజన్ల కొద్దీ హెలికాప్టర్లు ఈ గాలింపులో పాల్గొన్నాయి. రెస్క్యూ టీమ్‌కు కవర్‌గా వచ్చిన ఒక ఏ-10 (A-10) విమానం దెబ్బతిని కువైట్‌లో కూలిపోయినా, పైలట్ సురక్షితంగా బయటపడటం ఈ మిషన్ తీవ్రతకు అద్దం పడుతోంది.
సీఐఏ 'మైండ్ గేమ్'.. ట్రంప్ నిర్ణయం!
కేవలం ఆయుధ బలంతోనే కాకుండా, మైండ్ గేమ్‌తో కూడా అమెరికా ఈ యుద్ధంలో గెలిచింది. సీఐఏ (CIA) వ్యూహాత్మకంగా ఇరాన్ లోపల తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసింది. పైలట్‌ను అప్పటికే అమెరికా తరలించేసిందని నమ్మించి ఇరాన్ బలగాలను గందరగోళానికి గురిచేసింది. ఈలోపు రీపర్ డ్రోన్లు శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ రక్షణ కవచంలా నిలిచాయి. చివరకు ప్రత్యేక దళాలు అతన్ని చేరుకుని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగాయి.
వైఫల్యాలను దాటి సాధించిన విజయం!
ఈ ఆపరేషన్‌లో లాజిస్టికల్ ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ఒక మారుమూల స్థావరం వద్ద రెండు రవాణా విమానాలు చిక్కుకుపోగా, అవి శత్రువుల చేతికి చిక్కకుండా ఉండేందుకు అమెరికా దళాలే వాటిని ధ్వంసం చేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో సిబ్బందిని తరలించారు. ఏప్రిల్ 3న మొదలైన ఈ హై-రిస్క్ ఆపరేషన్ విజయవంతం కావడంతో అమెరికా సైనిక వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. "ఇది మా ప్రత్యేక దళాల పట్టుదలకు, సాంకేతికతకు దక్కిన అరుదైన విజయం" అని రక్షణ శాఖాధికారులు కొనియాడారు.












Click it and Unblock the Notifications