కరోనా డేంజర్ బెల్స్: ఒకరోజులో 50 వేలకు పైగా కేసులు.. ఎక్కడ అంటే
కరోనా కేసులు విదేశాల్లో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చైనా మళ్లీ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇటు జర్మనీలో వేగంగా వైరస్ వ్యాపిస్తోంది. అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కొత్త పాజిటివ్ కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 50 వేలకు పైగా కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త కేసులు 50,196కు చేరగా.. వరుసగా నాలగో రోజు పెరిగాయి. అక్టోబర్ మధ్య నుంచి కరోనా మరణాలు, కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. జర్మనీలో 50 వేల కరోనా కేసులు దాటడం ఇదే తొలిసారి. దేశంలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌గా తేలిన కేసుల సంఖ్య 4.89 మిలియన్లకు చేరింది. కరోనా మరణాల సంఖ్య 97 వేలకు చేరినట్లు రాబర్ట్ కోచ్ ఇన్సిటిట్యూట్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఎమర్జెన్సీ విధించం..
కరోనా ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని ఛాన్సలర్ ఏంజిలా మెర్కల్ అన్నారు. కరోనా ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నా.. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించే ఆలోచన లేదని ప్రభుత్వం తెలిపింది. సాక్సోనీ, బవేరియా, బెర్లిన్ వంటి పలు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ ఇప్పటికీ తీసుకోని వారికోసం కొత్త కరోనా ఆంక్షలను అమలు చేస్తున్నారు. కరోనా టీకా వేయించుకోని వారిని బార్లు, రెస్టారెంట్లు, స్పోర్ట్స్ హాల్స్‌కు అనుమతించరాదని జర్మన్ ప్రభుత్వం ఆదేశించింది. జర్మనీలో కరోనా వ్యాక్సినేషన్ రేటు 67 శాతం మాత్రమే నమోదు అయింది. కరోనా కేసుల పెరిగిపోతున్న నేపథ్యంలో అత్యవసరంగా ఆస్పత్రులను నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

చెప్పలేం
ఇటు భారతదేశం విషయానికి వస్తే వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.

హై టెన్షన్
ప్రస్తుతం కరోనా కేసులు కాస్త తక్కువగానే వస్తున్నాయి. నిపుణులు మాత్రం జనవరిలో థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి మళ్లీ వేసవి ఎలా ఉంటుందోననే ఆందోళన ఉంది. కానీ ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎక్కడో.. ఎవరో కొందరు తీసుకోలేదు. దాదాపుగా చాలా మంది రెండు డోసులు కూడా తీసుకున్నారు. అంతా వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా దరి చేరదని విశ్వసించవచ్చు.












Click it and Unblock the Notifications