Israel-Hamas: గాజా కాల్పుల విరమణ ఒప్పందం.. మరో ముగ్గురు బందీలు విడుదల
Israel-Hamas గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్ శనివారం ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. హమాస్ వారిని రెడ్ క్రాస్ ఏజెన్సీకి అప్పగించింది. ఆ ఏజెన్సీ వారిని ఇజ్రాయెల్ కు తీసుకెళ్లింది. విడుదలైన బందీలలో అలెగ్జాండర్ ట్రోఫనోవ్ (29 ఏళ్ల రష్యన్-ఇజ్రాయెల్), యైర్ హార్న్ (46 ఏళ్ల అర్జెంటీనా-ఇజ్రాయెల్), సాగుయ్ డెకెల్-చెన్ (36 ఏళ్ల అమెరికన్-ఇజ్రాయెల్) ఉన్నారు.ఈ ముగ్గురికి బదులుగా ఇజ్రాయెల్ 369 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. హమాస్ అదుపులో మొత్తం 76 మంది ఇజ్రాయెల్ బందీలు ఉండగా.. వారిలో ముగ్గురు బందీలను విడుదల చేసిన తర్వాత 73 మంది బందీలు అలాగే ఉన్నారు.
ఇప్పటివరకు 21 మంది విడుదల
ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో హమాస్, ఇజ్రాయెల్ ల మధ్య గాజా కాల్పుల విరమణ ఒప్పందం గత నెలలో అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగో హమాస్ తమ మద్ద బందీగా ఉన్న 94 మంది బందీల్లో 33 మంది బందీలను విడుదల చేయనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనాకు చెందిన వారికి జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విముక్తి కల్పించనుంది. జనవరి 19న ప్రారంభమైన ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా.. హమాస్ 21 బందీలను విడుదల చేయగా.. ఇజ్రాయెల్ 766 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. గడువుల ప్రకారం ఖైదీల మార్పిడితో సహా ఒప్పందాన్ని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని హమాస్ తెలిపింది.

బందీలను విడుదల చేయబోమని బెదిరించిన హమాస్
సోమవారం రోజున హమాస్ శనివారం నాడు బందీలను విడుదల చేయబోమని ప్రకటించింది. ఈ క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందంపై పలు ప్రశ్నలు తలెత్తాయి. గాజాకు సహాయం చేయకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటోందని పాలస్తీనా సంస్థలు ఆరోపించాయి. అయితే ఇజ్రాయెల్ దానిని ఖండించింది. హమాస్ ప్రకటన తర్వాత శనివారం నాటికి గాజాలో బందీలుగా ఉన్న వారిని విడుదల చేయడంలో హమాస్ విఫలమైతే గందరగోళం ఏర్పడుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు హమాస్ శనివారం మధ్యాహ్నం నాటికి గాజాలోని బందీలను విడుదల చేయకపోతే ఇజ్రాయెల్ తిరిగి తీవ్ర పోరాటాన్నిప్రారంభిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా హెచ్చరికలు జారీ చేశారు.
హమాస్ దాడి తర్వాతే యుద్ధం ప్రారంభం
2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసి, 251 మంది బందీలను పట్టుకుని, దాదాపు 1200 మందిని చంపిన తర్వాత యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 48,239 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలోని మూడింట రెండు వంతుల భవనాలు దెబ్బతిన్నాయని లేదా ధ్వంసమయ్యాయని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.












Click it and Unblock the Notifications