క్రూయిజ్ షిప్ ఘటనలో మరో ఇద్దరికి హంటా వైరస్ పాజిటివ్
నెదర్లాండ్స్‌కు చెందిన 'MV హోండియస్' అనే క్రూయిజ్ షిప్‌లో ప్రాణాంతక 'హంటా వైరస్' కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నౌక ప్రస్తుతం స్పెయిన్‌లోని టెనెరిఫే తీరంలో ఉంది. నౌకలోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా నౌకలో ముగ్గురు మరణించారు. మరో ఐదుగురికి ఇన్ఫెక్షన్ సోకింది. అయితే తాజాగా మరో ఇద్దరు ఈ హంటా వైరస్ బారిన పడినట్లు స్పష్టం అవుతోంది. 'MV హోండియస్' నౌకలో ప్రయాణించిన ఇద్దరు ప్రయాణికులు ఒకరు ఫ్రెంచ్, మరొకరు అమెరికన్ లకు ప్రాణాంతక హంటా వైరస్ నిర్థారణ అయినట్లు తేలింది.
ఆదివారం పారిస్ కు తరలించిన ఐదుగురు ప్రయాణికుల్లో ఫ్రెంచ్ మహిళ ఒకరు. విమాన ప్రయాణంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం. మరోవైపు నెబ్రాస్కాకు తరలించిన 17 మంది అమెరికన్ల బృందంలో ఒకరికి పాజిటివ్ అని తేలింది. అయితే అతనికి ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. కానీ మరో వ్యక్తికి మాత్రం స్వల్ప వైరస్ లక్షణాలు ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
ఇక నౌకలోని అమెరికన్లను నెబ్రాస్కా మెడికల్ సెంటర్ కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. గతంలో ఎబోలా, కొవిడ్ రోగులకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బయోకంటైన్ మెంట్ ఇక్కడ ఉంది. ప్రయాణ సమయంలో ఈ నౌకలో 20 దేశాలకు చెందిన 140 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. వీరందరికీ 72 గంటల ఆస్పత్రి పర్యవేక్షణ ఆ తర్వాత 45 రోజుల వరకు హోమ్ క్వారంటైన్ అవసరం అని వైద్యులు నిర్ధారించారు.

హంటా వైరస్ ఆండీస్ రకానికి చెందినది. సాధారణంగా ఈ వైరస్ ఎలుకల నుంచి వ్యాప్తి చెందుతుంది. కానీ ఈ రకం వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉందని వైద్యులు నిర్థారించారు. మరోవైపు ఇదే వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ట్రెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ.. ఇది కొవిడ్ వైరస్ అంత ప్రాణాంతకం కాదని తేల్చారు. దీనివల్ల ప్రజలకు ముప్పు తక్కువేనని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications