వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హువావే-మెంగ్ వాన్జౌ: ఒక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చైనా-అమెరికా-కెనడా దౌత్య సంబంధాలను ఎలా మార్చిందంటే..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ మెంగ్

అది 2018 డిసెంబర్.

మెంగ్ వాన్జౌ ప్రయాణిస్తున్న విమానం వాంకోవర్‌లో ల్యాండయింది. ఆమె అక్కడ కాసేపు మాత్రమే ఉండాలనుకున్నారు.

కానీ దాదాపు మూడు సంవత్సరాల పాటు ఉండాల్సి వచ్చింది. సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత మెంగ్‌కు స్వేచ్ఛ లభించింది.

మెంగ్ వాన్జౌ... హువావే కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌. ఆమె హువావే కంపెనీ వ్యవస్థాపకుడి కూతురు కూడా.

ఆమెను అమెరికాకు అప్పగించాలన్న అభ్యర్థనను విరమించుకుంటున్నట్లు గత శుక్రవారం ప్రాసిక్యూటర్లు ప్రకటించారు. దీంతో ఎట్టకేలకు ఆమె ఆదివారం నాడు తన స్వదేశంలో అడుగుపెట్టారు.

మూడేళ్లుగా సాగిన ఈ న్యాయ పోరాటంలో, వాషింగ్టన్-బీజింగ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ కెనడా నలిగిపోయింది.

అయితే, ఈ కథలో 16 పేజీల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కేంద్ర బిందువుగా మారింది.

వాంకోవర్‌లో మెంగ్‌ను హౌజ్ అరెస్ట్ చేశారు.

వాంకోవర్‌లో ఆగడం నుంచి అరెస్ట్ వరకు..

హాంకాంగ్‌ నుంచి వచ్చిన విమానం కెనడాలోని వాంకోవర్‌లో ఆగింది. అందులో వచ్చిన మెంగ్‌ ఆ నగరంలో ఉన్న తన ఇంటికి వెళ్లి కొన్ని సామాన్లు తెచ్చుకోవాలనుకుంది. ఆ తర్వాత ఒక కార్పొరేట్ సమావేశానికి హాజరయ్యేందుకు మెక్సికోకు వెళ్లే విమానం ఎక్కాలని అనుకుంది.

కానీ కెనడా సరిహద్దు భద్రతా సిబ్బంది ఆమెను మూడు గంటల పాటు ప్రశ్నించారు. ఆమె ఫోన్ సీజ్ చేశారు. లగేజ్‌ తనిఖీ చేశారు.

ఈ సోదాలన్నీ పూర్తయిన తర్వాత ఆమెను కెనడాలోకి అడుగుపెట్టనిచ్చారు. కానీ సరిగ్గా అదే సమయంలో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (కెనడా కేంద్ర బలగాలు) రంగంలోకి దిగారు. ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను తమకు అప్పగించాలని అమెరికా విజ్ఞప్తి చేయడమే దానికి కారణం.

ఇరాన్‌ మీద విధించిన ఆంక్షల ఉల్లంఘనతో ముడిపడి ఉన్న మోసాలతో సహా పలు అభియోగాలపై ఆమె విచారణ ఎదుర్కోవాలని అమెరికా భావించింది. అయితే, ఈ ఆరోపణలను మెంగ్ ఖండించారు.

మెంగ్ లాయర్లు న్యాయపోరాటం చేశారు.

ఈ కేసులో కీలకంగా మారిన పవర్‌పాయింట్‌

2013 ఆగస్టు 22న హెచ్‌ఎస్‌బీసీ సమావేశంలో మెంగ్ ఈ పవర్‌పాయింట్‌ను ఉపయోగించారు. దీన్ని ఈ కేసులో ఆమెకు వ్యతిరేకంగా కీలక సాక్ష్యంగా చూశారు.

హాంకాంగ్‌కు చెందిన స్కైకామ్ సంస్థ ఇరాన్‌ మీద విధించిన ఆంక్షలను ఉల్లంఘించిందా లేదా అనే విషయంలో అనేక సందేహాలు తెరపైకి వచ్చాయని రాయిటర్స్ వార్తా సంస్థ ఆ తర్వాత పేర్కొంది.

స్కైకామ్ అనేది టెలికం పరికరాలను అమ్మే సంస్థ. అయితే, ఇది హువావే వ్యాపార భాగస్వామా? లేక ఆ కంపెనీ ముసుగులో హువావేనే ఇరాన్‌తో వ్యాపారం చేస్తోందా అన్నది ఇక్కడ అంతుచిక్కని విషయం.

అయితే, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్ సందర్భంగా హువావేకి, స్కైకామ్‌తో ఉన్న నిజమైన సంబంధాలపై సరైన సమాచారం ఇవ్వకుండా హెచ్‌ఎస్‌బీసీని మెంగ్ తప్పుదారి పట్టించారని అమెరికా ఆరోపిస్తోంది. దాంతో ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఉల్లంఘించే ప్రమాదాన్ని ఆమె హెచ్‌ఎస్‌బీసీకి కలిగించారని అంటోంది.

అయితే, కోర్టును అమెరికా తప్పుదారి పట్టించిందని ఆమె లాయర్లు వాదించారు. ముఖ్యంగా పవర్‌పాయింట్‌ విషయంలో.. ఇరువర్గాలకు చెందిన కీలకమైన సమాచారాన్ని అమెరికా వదిలేసిందని పేర్కొన్నారు. నిజానికి హువావే-స్కైకామ్ మధ్య సంబంధాలను దాచిపెట్టలేదని వాళ్లు అంటున్నారు.

మెంగ్ కేసును కెనడాతో పాటు ప్రపంచ దేశాలు జాగ్రత్తగా గమనించాయి.

న్యాయపోరాటం మొదలుపెట్టిన మెంగ్ లాయర్లు

అమెరికా చేసిన అప్పగింత విజ్ఞప్తిపై మెంగ్ లాయర్లు అన్నివైపుల నుంచి దాడి మొదలుపెట్టారు.

అమెరికాలో ఆమెపై మోపిన నేరం కెనడాలో నేరం కాదని చెప్పే మొదటి ప్రయత్నం విఫలమైంది. (దానిపై అపీల్ చేసుకునే అవకాశం ఉంటుంది)

ఇక మరో సవాల్.. ఈ కేసు చుట్టూ ఉన్న రాజకీయాలు.

చైనాతో వాణిజ్య చర్చల్లో బేరసారాలకు ఈ కేసును ఉపయోగించుకునేందుకు సిద్ధమన్న అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను బట్టి చూస్తే కావాలని ఈ కేసు పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోందని మెంగ్ తరఫు లాయర్లు వాదించారు.

ఇక మరో విషయం.. వాంకోవర్ విమానాశ్రయంలో ఆమె పట్ల ప్రవర్తించిన తీరు. ఆమెను ట్రీట్ చేసిన విధానంలో వేధింపులు ఉన్నాయని ఆమె లాయర్లు చెప్పారు.

ఆమె అరెస్ట్ సందర్భంగా అమెరికా పాత్ర ఏంటో తెలుసుకునేందుకు కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్‌కు చెందిన కొన్ని డాక్యుమెంట్లను బయటపెట్టాలని వాళ్లు పోరాడారు. అయితే, డాక్యుమెంట్లు బయటపెట్టాలన్న వాళ్ల విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు.

ఈ కేసు ముగియడానికి ఐదు నుంచి పదేళ్లు పట్టొచ్చని కొందరు అంచనా వేశారు.

గత నెల మెంగ్ కోర్టుకు హాజరయ్యారు. ఆమెను అమెరికాకు పంపించాలా వద్దా అనే విషయంలో న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విన్నారు. ఈ కేసు విషయంలో అమెరికా-చైనా దౌత్యవేత్తల మధ్య కూడా చాలా చర్చ జరిగింది.

మరోపక్క ఆమెను విడిపించడానికి హువావే ప్రతినిధులు కూడా అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను వాయిదా వేసే ఒప్పందానికి వచ్చామని గత శుక్రవారం అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. అంటే వచ్చే ఏడాది చివరి వరకు ఆమెపై దర్యాప్తును అమెరికా నిలిపేస్తుంది. కోర్టు పెట్టిన షరతులకు ఆమె అంగీకరిస్తే చివరికి కేసు ఉపసంహరించుకుంటారు.

ఇది జరిగిన కొన్ని గంటలకే చైనాకు వెళ్లే విమానంలో ఆమె వాంకోవర్ నుంచి బయలుదేరిపోయారు.

ఆదివారం చైనా చేరుకున్న మెంగ్

భౌగోళిక రాజకీయ పరిణామాలు

ఈ కేసు తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.

ఒక అత్యున్నత వ్యాపార ప్రతినిధిని అరెస్ట్ చేయడం చైనాకు ఆగ్రహం తెప్పించింది.

హెచ్‌ఎస్‌బీసీని ఇరకాటంలోకి నెట్టింది. ఈ కేసు రాజకీయ ప్రేరేపితం అని చెబుతున్నందున అమెరికా అధికారులకు ఈ బ్యాంక్‌ ఎంతవరకు సహరించిందంటూ చైనా మీడియా ప్రశ్నించింది.

హాంకాంగ్‌పై తన విధానంతో ఈ బ్యాంక్ ఇదివరకే పశ్చిమ దేశాలు, చైనా మధ్య ఇరుక్కుపోయింది.

అమెరికా నుంచి విజప్తి వస్తే ఏ ఏ దేశాల వ్యాపార ప్రతినిధులనైనా అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్నలను కూడా ఈ కేసు తెరపైకి తెచ్చింది.

HSBC

బేరసారాలకు తమను వాడుకుంటారేమోనని చైనా నిర్బంధంలో ఉన్న పాశ్చాత్య దేశాల వ్యాపారవేత్తలు, పర్యటకులు ఆందోళన చెందేలా చేసింది ఈ కేసు.

మెంగ్‌ను అరెస్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత కెనడాకు చెందిన మాజీ దౌత్యవేత్త మైఖేల్ కోవ్రిగ్, మరొక వ్యాపారవేత్త మైఖేల్ స్పావోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై గూఢచర్యం అభియోగాలు మోపారు.

ఇందులో తన ప్రమేయం లేదని చైనా చెప్పింది. కానీ మెంగ్ అరెస్ట్‌కు ప్రతీకారంగానే ఈ చర్య తీసుకున్నారని అందరూ భావించారు.

గత నెలలో ఒక చైనా కోర్టు వ్యాపారవేత్త స్పావోర్‌కు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

మెంగ్‌ అప్పగింత ప్రొసీడింగ్స్‌ను కెనడా జడ్జి ముగించిన కొన్ని గంటల్లోనే చైనా కూడా ఇద్దరు వ్యక్తులను విడుదల చేసిందని, వాళ్లు స్వదేశానికి తిరిగి వెళ్తున్నారన్న విషయం బయటికి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Huawei-Meng Wanzhou: A PowerPoint presentation on how China-US-Canada diplomatic relations have changed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X