• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

’నా భర్త దేవుడు అనుకున్నా...కానీ ఆయన నన్ను రేప్ చేశాడు‘

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఈజిప్టులోని చాలా ప్రాంతాల్లో హింసాత్మక సెక్స్ ఎక్కువగా ఉంటుందని పరిశీలనలో తేలింది.

లైంగిక వేధింపుల అంశంలో ఈజిప్టు మహిళలు నిశ్శబ్ధపు గోడలను బద్దలు కొడుతున్నారు. సామాజికంగా, మతపరంగా అత్యంత నిషిద్ధ అంశమైన వైవాహిక అత్యాచారానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.

గమనిక: ఈ ఆర్టికల్‌లో లైంగిక హింసకు సంబంధించిన విషయాలు ఉంటాయి.

34 ఏళ్ల సఫా, తన పెళ్లిరోజు రాత్రి భర్త చేతిలో అత్యాచారానికి గురయ్యారు. ఆ హింసలో ఆమెకు గజ్జల్లో, మణికట్టు పై, నోటి మీదా గాయాలయ్యాయి.

'నేను నెలసరిలో ఉన్నాను. ఆ రోజు సెక్స్‌‌లో పాల్గొనేందుకు అనువుగా లేను. కానీ నేను శారీరక కలయిను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నానని నా భర్త భావించారు. అందుకే నన్ను కొట్టి చేతుల్ని కట్టేశారు. నోటిని గట్టిగా అధిమిపట్టి అత్యాచారానికి పాల్పడ్డారు' అని సఫా వాపోయారు.

అయినప్పటికీ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సఫా నిరాకరించారు. సమాజ కట్టుబాట్లకు భయపడి ఆమె నిశ్శబ్ధంగా ఉండిపోయారు. పితృస్వామ్య సమాజంలో బాధితులను నిందించే సంస్కృతి సాధారణం. అందులో మహిళలు బాధితులైతే ఇక చెప్పనక్కర్లేదు.

కానీ, ఏప్రిల్ నెలలో టెలివిజన్‌లో ప్రసారమైన 'న్యూటన్స్ క్రీడిల్’ సిరీస్‌ సమాజంలో కీలక మార్పుకు కారణమైంది. ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్‌లో ఈ సిరీస్ ప్రసారమైంది. ఇందులో ఒక సీన్‌ లో భర్త తన భార్య పై బలాత్కారం చేసే సన్నివేశాన్నిచూపించారు.

ఆ ఎపిసోడ్ ఈజిప్టులో చాలా మంది మహిళలకు తమ జీవితంలో జరిగిన చేదు జ్ఞాప‌కాల‌ను గుర్తుకు తెచ్చింది. వారి అనుభవాలను సామాజిక మాధ్యమాలలో పంచుకునేందుకు కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చింది.

కొన్ని వారాల్లోనే లైంగిక హింస తాలూకు వందలాది అనుభవాలు సాక్ష్యాలతో సహా ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చాయి. ఫేస్‌బుక్ పేజీ స్పీక్అప్‌లో 700 మందికి పైగా తమ అనుభవాలు అప్‌లోడ్ చేశారు.

వీరిలో 27 ఏళ్ల సనా కూడా ఒకరు.

''మా వివాహం జరిగి ఏడాదైంది. నేను గర్భవతిని. త్వరలోనే ప్రసవించబోతున్నాను. అప్పటి వరకు ఆయన బాగానే ఉన్నారు. కానీ ఒక చిన్న విషయంలో మా మధ్య గొడవ జరిగింది. ప్రతీకారం తీర్చుకునేందుకు నాపై ఎగబడి అత్యాచారం చేశారు. దీంతో గర్భస్రావమైంది' అని సనా ఫేస్‌బుక్ పేజీలో తన సందేశాన్ని పంచుకున్నారు.

ఆ తర్వాత సనా విడాకుల కోసం ఒంటరి పోరాటం చేసి భర్త నుంచి విడిపోయారు. కానీ, ఇప్పటికీ తాను కోల్పోయిన బిడ్డ గురించి ఆమె చింతిస్తూనే ఉన్నారు.

ఈజిప్టులోని చాలా ప్రాంతాల్లో హింసాత్మక సెక్స్ ప్రబలంగా ఉంది. ముఖ్యంగా తొలిరాత్రి ఈ బలాత్కారం మరింత ఎక్కువగా ఉంటుంది.

ప్రముఖ గాయకుడి మాజీ భార్య తన వైవాహిక జీవిత అత్యాచార కథను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది. కన్నీళ్లతో తన దీనస్థితిని వివరిస్తోన్న ఆమె వీడియో వైరల్ అయి వార్తల్లో ముఖ్యాంశంగా నిలిచింది.

తన భర్త వైఖరిని నేరంగా పరిగణించేలా న్యాయ వ్యవస్థలో మార్పులు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్ వేదికగానే దీనిపై స్పందించిన ఆమె భర్త, ఈ ఆరోపణలన్నీ అబద్ధమంటూ ఖండించారు.

వైవాహిక అత్యాచారం, లైంగిక వేధింపులు, బలవంతపు లైంగిక చర్యలకు సంబంధించి ఈజిప్టులో ఏటా వేలాది కేసులు నమోదవుతున్నాయి

ఏటా వేలాది కేసులు

వైవాహిక అత్యాచారం, లైంగిక వేధింపులు, బలవంతపు లైంగిక చర్యలకు సంబంధించి ప్రతీ ఏటా సగటున 6,500 కేసులు నమోదు అవుతున్నాయని జాతీయ మహిళా మండలి (ఎన్‌సీడబ్ల్యూ) పేర్కొంది. 2015 జనవరిలో ఎన్‌సీడబ్ల్యూ ఈ అధ్యయనాన్ని ప్రచురించింది.

'ఈజిప్టులో వైవాహిక అత్యాచారం సాధారణ సంస్కృతిగానే పరిగణిస్తారు. వివాహ బంధం ఏర్పడ్డాక శారీరక సుఖానికి భార్య రోజులో 24 గంటలు అందుబాటులో ఉండాలని అక్కడి వారు నమ్ముతారు' అని లాయర్, ఉమెన్ సెంటర్ ఫర్ గైడెన్స్ అండ్ లీగల్ అవేర్‌నెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెడా డాన్‌బౌకీ పేర్కొన్నారు.

అక్కడి కొన్ని మతాచారాలు, సాధారణ నమ్మకాల ప్రకారం, భర్తతో లైంగిక సంబంధానికి భార్య నిరాకరిస్తే ఆమె పాపం చేసినట్లేనని, రాత్రంతా ఆమెను దేవదూతలు శపిస్తారని ప్రజలు విశ్వసిస్తున్నట్లు రెడా వెల్లడించారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈజిప్షియన్ ఇస్లామిక్ సలహా సంస్థ దాల్ అల్ ఇఫ్తా ముందుకొచ్చారు. ఈ సంస్థ మతపరమైన శాసనాలు జారీ చేస్తుంది. భర్త శారీరక సుఖం కోసం భార్యను హింసిస్తే...అతనిపై ఫిర్యాదు చేసి కోర్టుకు వెళ్లి శిక్షించే హక్కు భార్యకు ఉందని ఆ సంస్థ చెప్పారు.

అయినప్పటికీ ఉమెన్స్ సెంటర్ ఫర్ గైడెన్స్ అండ్ లీగల్ అవేర్‌నెస్ గత రెండేళ్లలో 200 వైవాహిక అత్యాచార కేసులను 'ఫస్ట్ నైట్ ఫియర్' పేరుతో నమోదు చేసినట్లు రెడా డాన్‌బౌకీ వివరించారు.

షరియా చట్టాలకు విరుద్ధంగా ఎలాంటి శిక్షలు విధించలేని విధంగా కొన్ని చట్టాలు ఈజిప్టులో ఉన్నాయి.

నిరూపణ కష్టమే

వైవాహిక అత్యాచారాన్ని ఈజిప్టు చట్టాలు నేరంగా పరిగణించవు. కోర్టుల్లో కూడా ఈ అంశాన్ని నేరంగా రుజువు చేయడం కష్టమే. కోర్టు వరకు వెళ్లే చాలా కేసులు కూడా ఈజిప్టు శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 60 కారణంగా శిక్ష నుంచి తప్పించుకుంటాయి.

షరియా (ఇస్లామిక్ చట్టం) నిర్దేశించిన హక్కును పొందడం కోసం చేసే ఏ పనికి కూడా శిక్షాస్మృతి వర్తించదని ఈ ఆర్టికల్ 60 చెబుతోంది.

''శరీరాన్ని పరీక్షించి గాయాలను గుర్తించడం...నోటిచుట్టూ, మణికట్టుపై ఏర్పడ్డ గాయాల ఆధారంగా వైవాహిక అత్యాచారాన్ని రుజువు చేయవచ్చు'' అని డాన్‌బౌకీ అంటున్నారు.

సంప్రదాయిక విలువలు ఆధిపత్యం చూపించే ఈజిప్టులో మార్పు అనేది చాలా నెమ్మదిగా కనబడుతుంది. కానీ అక్కడ అత్యాచార బాధితుల గొంతులు బయటకు వినిపించడం ప్రారంభమైంది.

వ్యక్తుల గుర్తింపును, గోప్యతను కాపాడటం కోసం ఆర్టికల్‌లో సఫా, సనాల నిజమైన పేర్లను మార్చి రాశాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
I thought my husband was God, but he raped me
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X