భారత్- పాక్ యుద్ధాన్ని ఆపింది ఆయనే: పాక్ ఆర్మీ చీఫ్ తో భేటీ నాకు దక్కిన అరుదైన గౌరవం
Donald Trump- Asmi Munir Lunch meeting: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ పై పరోక్షంగా తన అక్కసును వెళ్లగక్కారు. పాకిస్తాన్ కూ స్నేహహస్తాన్ని అందించారు. భారత్- పాకిస్తాన్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానంటూ చెప్పుకొంటూ వస్తోన్న ఆయన ఈ సారి మరో అడుగు ముందుకేశారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి వెనుక ప్రధాన సూత్రధారిగా విమర్శలను ఎదుర్కొంటోన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ తో సమావేశం కావడం తనకు దక్కిన గౌరవమని వ్యాఖ్యానించారు. అసీమ్ మునీర్ తో కలిసి వైట్ హౌస్ లో లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడొకరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను వైట్ హౌస్ లో ఏకాంతంగా ఆతిథ్యాన్ని ఇవ్వడం ఇదే మొదటిసారి.

ఈ భేటీ తరువాత డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అసీమ్ మునీర్ తో భేటీ కావడం గౌరవంగా భావిస్తున్నానని తేల్చి చెప్పారు. భారత్- పాకిస్తాన్ రెండూ తనకు సమానమేనని, ఈ రెండు దేశాల మధ్య అణు యుద్ధాన్ని నిలిపివేశానని ట్రంప్ పునరుద్ఘాటించారు. తన మాటకు విలువ ఇచ్చి భారత్ తో యుద్ధాన్ని ఆపినందుకు అసీమ్ మునీర్ కు కృతజ్ఞతలు తెలుపుకొంటోన్నానని అన్నారు.
భారత్- పాక్ మధ్య యుద్ధం కొనసాగితే సంభవించబోయే విపరీణామాల గురించి అసీమ్ మునీర్ వివరించానని, తన వాదనలతో ఆయన ఏకీభవించాడని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపినందుకు వైట్ హౌస్ కు పిలిపించానని వివరించారు. పాకిస్తాన్ తో యుద్ధాన్ని కొనసాగించనందుకు భారత్ కు కూడా థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు.
జీ7 సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ.. అది సాధ్యపడలేదని ట్రంప్ గుర్తు చేశారు. భారత్- పాకిస్తాన్ లతో ఓ ట్రేడ్ డీల్ ను కుదర్చడానికి కసరత్తు చేస్తోన్నానని ట్రంప్ తెలిపారు. భారత్- పాక్ అధినేతలిద్దరూ చాలా స్మార్ట్ గా ఆలోచిస్తారని కితాబిచ్చారు.
సమయస్ఫూర్తితో వ్యవహరించి.. తమ రెండు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణను అణు యుద్ధంగా మారకుండా నివారించుకోగలిగారని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్- పాక్ రెండూ అణ్వాయుధాలు గల అతిపెద్ద దేశాలని ట్రంప్ చెప్పారు.
పాకిస్తాన్ వైపు నుండి భారత్ తో యుద్ధాన్ని నివారించడంలో అసీమ్ మునీర్ కీలక పాత్ర పోషించాడని, ఎంతో ముందు జాగ్రత్తగా ఆయన ఈ ఎత్తు వేయగలిగాడని ట్రంప్ ప్రశంసించారు. త్వరలోనే ప్రధాని మోదీని కలుసుకునే అవకాశం వస్తుందని భావిస్తున్నట్లు ట్రంప్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంపైనా ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ తో పాకిస్తాన్ కు సత్సంబంధాలు ఉన్నాయని, బయట కనిపించినిదానికంటే కూడా మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడికి దిగడాన్ని పాకిస్తాన్ స్వాగతించట్లేదని, అలాగని ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా వెళ్లదలచుకోలేదని అన్నారు.












Click it and Unblock the Notifications