మీకా అర్హత లేదు: భారత అక్రమ వలసదారులకు మోదీ భారీ షాక్- ట్రంప్ సాక్షిగా కీలక ప్రకటన
Modi Trump meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. అధ్యక్షుడి అధికారిక నివాసం రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌లో ఈ సమావేశం ఏర్పాటైంది. 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే ఇద్దరు నేతల మధ్య ఈ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
భేటీ అనంతరం మోదీ- ట్రంప్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం సహా వివిధ అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇద్దరు నేతలు సమాధానాలను ఇచ్చారు. భారత్ సభ్యదేశంగా ఉన్న బ్రిక్స్‌పై అమెరికా 100 శాతం టారిఫ్ విధించదలిచిన నేపథ్యంలో- ఎక్కువగా ట్రేడ్- టారిఫ్‌పైనే ప్రశ్నోత్తరాలు సాగాయి.

ఈ సందర్భంగా అమెరికాలో అక్రమంగా నివసిస్తోన్న భారత వలసదారుల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. అక్రమంగా, అనధికారికంగా ఎవరు కూడా ఏ దేశంలోనూ నివసించలేరని, వారికి ఆ అర్హత సైతం లేదని చెప్పారు. అలాంటి వారిని ఏ దేశం కూడా భరించదనీ స్పష్టం చేశారు. ఇది తమ విషయంలోనూ వర్తిస్తుందని అన్నారు.
అమెరికాలో నివసించే తమ దేశ అక్రమ వలసదారులను వెనక్కి పిలిపించుకుంటామని మోదీ తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తాము ముందు నుంచీ చెబుతూనే వస్తోన్నామని పేర్కొన్నారు. వెరిఫికేషన్ తరువాత నిజమైన భారత పౌరుడిని తాము స్వదేశానికి వెనక్కి పిలిపించుకుంటామని అన్నారు.
అక్రమ వలసదారుల్లో చాలామంది ఆర్డినరీ ఫ్యామిలీస్కు చెందిన వాళ్లని వ్యాఖ్యానించారు మోదీ. వారికి మాయమాటలు చెప్పి అమెరికాకు తరలించివుండొచ్చని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా వ్యవస్థ మొత్తాన్నీ తుడిచేయాల్సిన అవసరం ఉందని మోదీ ఘాటుగా చెప్పారు. ఈ విషయంలో అమెరికాకు పూర్తి సహకారాన్ని అందిస్తామని అన్నారు.
అక్రమ వలసదారులు, మానవ అక్రమ రవాణా ప్రభావం.. అమెరికాలో నివసించే భారతీయులపై పడకూడదని భావిస్తోన్నానని అన్నారు. రెండు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత మెరుగుపర్చడానికి మరిన్ని సానుకూల నిర్ణయాలను తీసుకుంటామని, ఈ క్రమంలో- త్వరలో లాస్ ఏంజిలిస్, బోస్టన్‌లల్లో కొత్తగా కాన్సులేట్లను తెరుస్తామని మోదీ ప్రకటించారు.












Click it and Unblock the Notifications