డొనాల్డ్ ట్రంఫ్ సంచలనం: భారతీయులపై ఎందుకంత కసి?
హూస్టన్: రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్ధిగా ముందు వరుసలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మరోమారు సంచలన వ్యాఖ్య చేశారు. హ్యూస్టన్‌లో నిర్వహించిన ఇంటర్యూలో పాల్గొన్న ఆయన వలస విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే... అమెరికాలోని అక్రమ వలసదారులంతా వెనక్కి వెళ్లాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రత్యేకించి అమెరికాలోని భారతీయులపై కూడా ఆయన ప్రస్తావించారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన 3 లక్షల మంది భారతీయులు సహా 1.10 కోట్ల మంది విదేశీయులు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్లి పోవాలన్నారు. అమెరికాలోకి మళ్లీ తిరిగి సుదీర్ఘమైన చట్టబద్ధ ప్రక్రియ ద్వారా రావాలన్నారు.
వారిలోనూ ఉత్తమమైన కొందరికే తిరిగి వచ్చేందుకు అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా గత జూన్‌లో బరిలోకి దిగిన ఆయన చైనా, జపాన్, మెక్సికో, వియత్నాం వాసులు అమెరికన్ల ఉద్యోగాల్ని కొల్లగొడుతున్నారని ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించారు.

తాజా వ్యాఖ్యలతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల్లో కొంత ఆందోళన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు హెచ్-1బి వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతుందంటూ అమెరికా సెనేటర్లు శుక్రవారం గళమెత్తారు. హెచ్-1బి వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్న సంస్ధలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు.
అమెరికన్ల స్థానంలో భారత్ సహా పలు విదేశాల నుంచి తక్కువ వేతనాలకు ఉద్యోగులను నియమించుకునేందుకు హెచ్-1బిని పలు సంస్ధలు వక్రమార్గంలో ఉపయోగించుకుంటున్నాయని, ఇలా చేయడం ద్వారా అమెరికన్లు ఉపాధి కోల్పోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాలో నిపుణులైన ఉద్యోగుల కొరత ఏ మాత్రం లేదని, అయినప్పటికీ పలు సంస్ధలు గత కొన్నేళ్లుగా స్థానిక ఉద్యోగుల స్థానంలో విదేశీయులను నియమించుకుంటున్నాయని వలసలు, జాతీయ ప్రయోజనాల అంశంపై ఏర్పడిన సెనేటర్ల సబ్ కమిటీ ఛైర్మన్ జెఫ్ సెషన్స్ వెల్లడించారు. వీసా కార్యక్రమాలు స్థానిక ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించేలా ఉండాలని సెనేటర్ల బృందం సూచించింది.












Click it and Unblock the Notifications