కరోనా సోకిన వ్యక్తితో కరచాలనం: క్వారంటైన్లోకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ధనిక పేద తేడా లేకుండా కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే పలు దేశ ప్రధానులు, మంత్రులు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా కరోనా సోకిన వ్యక్తిని కలవడంతో క్వారంటైన్లోకి వెళ్లారు.
పాకిస్థాన్ దేశంలో ప్రముఖ చారిటీ గ్రూప్‌లలో ఒకటైన ఈధీ ఫౌండేషన్ హెడ్ ఫైజల్
ఈధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే, కరోనావైరస్ రిలీఫ్ ఫండ్ కింద రూ. కోటి చెక్కు ఇచ్చేందుకు గతవారం ఫైజల్.. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కలిశారు. లాహోర్ నుంచి ఇస్లామబాద్ వచ్చి ఇమ్రాన్ ఖాన్‌కు ఆ చెక్కును స్వయంగా అందించారు.
చెక్కు అందజేస్తూ ఫొటో కూడా దిగారు.

కాగా, ఫైజల్ ఈధీకి కరోనా సోకడంతో ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఫైజల్ ఈధీకి దగ్గరగా మెలిగిన వారందరికీ కరోనా పరీక్షలు జరుగుతున్నాయని ఈధీ కుమారుడు సాద్ తెలిపారు. ఈధీ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పాకిస్థాన్ లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కరోనా సోకిన వారికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఈధీకి కూడా కరోనా సోకిందని ఫౌండేషన్ తెలిపింది.
ఈధీకి కరోనా సోకిన నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేగాక, కొన్ని రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని పాకిస్థాన్ లో కొవిడ్ కేసులను పర్యవేక్షిస్తున్న డాక్టర్ ఫైసల్ సుల్తాన్ ప్రధానికి స్పష్టం చేశారు.
కరోనా టెస్ట్ చేయించుకోవాలా? వద్దా? అనేది ప్రధాని ఇష్టమని ఆయన చెప్పారు. కాగా, ఓవైపు కరోనా వ్యాపిస్తుంటే.. దేశంలో రంజాన్ వేడుకలు జరుపుకోవచ్చంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే ఆదేశాలు జారీచేయడం గమనార్హం. పాకిస్థాన్ లో ఇప్పటి వరకు 9214 కరోనా కేసులు నమోదవగా, 192 మంది చనిపోయారు.












Click it and Unblock the Notifications