పుతిన్ అంటే నాటోకు భయం: ఉక్రెయిన్ రివర్స్ అటాక్: రష్యాతో రాజీ యత్నాలు: ఏ ఫార్మట్‌లోనైనా
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆరంభమైన భీకర యుద్ధం.. రోజులు గడుస్తున్న కొద్దీ తీవ్ర రూపాన్ని దాల్చుతోంది. కిందటి నెల 24వ తేదీన మొదలైన యుద్ధం తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. దాదాపు అన్ని రీజియన్లపైనా పట్టు బిగించింది. తమ దేశ సరిహద్దులకు సమీపంలో ఉన్న అన్ని నగరాలనూ ఆధీనంలోకి తెచ్చుకుంది. మరోవైపు- రష్యా సైనిక బలగాలను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది. యూరోపియన్ యూనియన్, నాటో సభ్య దేశాల సహకారాన్ని తీసుకుంటోంది.

ఏ ఫార్మట్ అయినా..
ఎన్ని రోజులైనా యుద్ధాన్ని కొనసాగించడానికి రష్యా సంసిద్ధంగా ఉన్న నేపథ్యంలో- దీన్ని నిలిపివేయడానికి ఉక్రెయిన్ ఓ అడుగు ముందుకు వేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ముఖాముఖి చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ పునరుద్ఘాటించారు. మరోసారి చర్చల ప్రస్తావనను తీసుకొచ్చారు. చర్చల ద్వారా మాత్రమే యుద్ధానికి స్వస్తి పలకవచ్చని అన్నారు. దీనికోసం పుతిన్‌తో ఏ ఫార్మట్‌లో అయినా సమావేశం కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

చర్చల ప్రస్తావన రెండోసారి..
ఈ మేరకు జెలెన్‌స్కీ- ఉక్రెయిన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ సస్ప్లిన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. పుతిన్‌తో చర్చల ప్రస్తావనను జెలెన్‌స్కీ తీసుకుని రావడం వరుసగా ఇది రెండోసారి. రెండు రోజుల కిందటే చర్చలకు సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్చలు గనక ఫలించకపోతే- మూడో ప్రపంచ యుద్ధం తప్పదనీ చెప్పుకొచ్చారు. పుతిన్‌తో చర్చల కోసం రెండు సంవత్సరాల నుంచీ ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యానించారు. చర్చలకు ప్రత్యామ్నాయం మరొకటి లేదని, అవి సఫలమైతేనే గానీ యుద్ధం ముగియదని అన్నారు.

నాటో పైనా విమర్శలు..
నాటో సభ్య దేశాలపైనా జెలెన్‌స్కీ అసహనాన్ని వ్యక్తం చేశారు. తమకు సభ్యత్వాన్ని కల్పించే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోందంటూ ఎద్దేవా చేశారు. వ్లాదిమిర్ పుతిన్ అంటే నాటో దేశాలు కూడా భయపడుతున్నాయని చురకలు అంటించారు. తమకు సభ్యత్వం ఇవ్వాలా? వద్దా అనే విషయంపై నాటో దేశాలు తేల్చుకోలేకపోవడానికి ఈ భయమే కారణమని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. పుతిన్ అంటే భయం వల్లే తాము ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని బహిరంగంగా తేల్చి వేయాలని డిమాండ్ చేశారు.

నాటోలో సభ్యత్వం లేకుండా..
నాటోలో సభ్యత్వం లేకపోయినా సభ్య దేశాలు తమకు సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తున్నాయని, ఇది ఎంతకాలం పాటు కొనసాగుతుందో తనకు తెలియదని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. రష్యా ఇస్తోన్న అల్టిమేటంలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమనీ స్పష్టం చేశారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్ ప్రజలు బలి అవుతున్నారని, ఈ పరిస్థితుల్లో వాటిని ఎలా అంగీకరించగలుగుతామని ప్రశ్నించారు. వాటికి బదులుగా తమ చర్చల ప్రతిపాదనలను రష్యా అంగీకరించాలని సూచించారు.

అమెరికా జోక్యం..
మరోవంక- రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో అగ్గి రాజేసినట్టే కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాకు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టే విషయంలో అగ్రరాజ్యం అమెరికా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఈ నెల 25వ తేదీన పోలాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. రణక్షేత్రంగా మారిన ఈ ఉక్రెయిన్ పొరుగుదేశంలో మకాం వేయనున్నారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల అత్యున్నత స్థాయి భేటీలో పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications