అది మా డీఎన్‌ఏలోనే ఉంది- జో బైడెన్ సమక్షంలో ప్రధాని మోదీ
వాషింగ్టన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. వైట్ హౌస్‌లో జో బైడెన్- ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వైట్ హౌస్‌లో ఆయనకు కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం లభించింది. బైడెన్ దంపతులు మోదీని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
శ్వేతసౌధంలోని ఓవల్ కార్యాలయంలో వారిద్దరూ భేటీ అయ్యారు. పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ఈ సంవత్సరం జీ20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించుకున్న మోదీకి జో బైడెన్ ధన్యవాదాలు తెలియజేశారు. భారత్- అమెరికా అనేక రంగాల్లో సహాయ సహకారాలను ఇచ్చి పుచ్చుకుంటోన్నాయని, సముద్రం నుంచి అంతరిక్షం వరకు, పురాతన సంస్కృతి నుండి కృత్రిమ మేధస్సు వరకు ఈ పరస్పరం సహకరించుకుంటోన్నాయని అన్నారు.

ఈ భేటీ ముగిసిన అనంతరం మోదీ- జో బైడెన్ జాయింట్‌గా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదని, మరింత డైనమిక్‌గా ఉంటుందని జో బైడెన్ అన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన చర్యలను ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో రాజీపడబోనని బైడెన్ పేర్కొన్నారు.
అనంతరం మోదీ మాట్లాడారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో ఈ రోజుకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. ఇవ్వాళ తీసుకున్న చర్చలు, కీలక నిర్ణయాలు, ఈ రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త అధ్యాయాన్ని లిఖించిందని పేర్కొన్నారు. 2024లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు తమదేశ వ్యోమగాములను పంపించనున్నట్లు మోదీ తెలిపారు.

క్లీన్ ఎనర్జీ, వాతావరణ సంక్షోభం, క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు వంటి క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంపై కలిసి పని చేస్తామని మోదీ అన్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టే ఆర్టెమిస్ అకార్డ్‌లల్లో ఒప్పందం చేసుకోనున్నట్లు చెప్పారు. ఇది భారత అంతరిక్ష ప్రయోగాలను అత్యున్నత స్థానానికి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి భారత్- అమెరికా దేశాలు యావత్ ప్రపంచానికి దిక్సూచిగా మారాయని చెప్పారు.

ప్రజాస్వామ్యాన్ని అనుసరించడం తమ డీఎన్‌ఏలోనే ఉందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ రెండు దేశాల ఆర్థిక సంబంధాలు పుంజుకుంటున్నాయని, గత దశాబ్ద కాలంలో వాణిజ్యం దాదాపు రెండింతలు పెరిగి, 191 బిలియన్ డాలర్లకు చేరిందని అన్నారు. భారతీయ సంస్థలు సోలార్ తయారీలో రెండు బిలియన్లకు పైగా కొత్తగా పెట్టుబడులను ఆకర్షించినట్లు మోదీ అన్నారు. కొలరాడో, ఒహియోలో స్టీల్, సౌత్ కరోలినాలో ఆప్టిక్ ఫైబర్ వంటి ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయని వివరించారు.












Click it and Unblock the Notifications