పాకిస్థాన్, అమెరికాకు ఒకేసారి వార్నింగ్ ఇచ్చిన భారత్..!
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో భాగంగా భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత్ తమపై దాడి చేస్తే సగం ప్రపంచాన్ని ధ్వంసం చేస్తామని.. అలాగే సింధూ నదిపై భారత్ నిర్మిస్తున్న నూతన బ్రిడ్జ్ ను 10 మిసైళ్లతో కూల్చేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే అణ్వాయుధ బెదిరింపులకూ పాల్పడ్డారు. అయితే అసిమ్ మునీర్ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ అణ్వాయుధాలు కలిగిన ఓ బాధ్యతారాహిత్యమైన దేశం అని పేర్కొంది. పాకిస్థాన్ ను మిలిటరీ ఆధీనం లో ఉందని తెలిపింది. అణ్వాయుధాలు శత్రు దేశం చేతుల్లోకి వెళ్లిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
భారత్ పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన తర్వాత పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అమెరికా, పాకిస్థాన్ ల మధ్య బంధం బలపడినట్లు స్పష్టం అవుతోంది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే అసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ ఏర్పాటు చేసిన విందులో అసిమ్ మునీర్ పాల్గొన్నారు. ఆ తర్వాత తాజాగా మరోసారి అమెరికాలో పర్యటించారు. యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా పదవీవిరమణ కార్యక్రమంలో మునీర్ పాల్గొన్నారు.
అయితే ఈ పర్యటనలో అమెరికా ప్రోత్సాహంతో భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ మౌలిక వసతులను ధ్వంసం చేస్తామని, నీటి సరఫరాను అడ్డుకుంటామని అలాగే అణు బెదిరింపులకు సైతం పాల్పడ్డారు. అయితే అసిమ్ మునీర్ వ్యాఖ్యలకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు భారత్ తలొగ్గదని స్పష్టం చేసింది. తమ దేశ భద్రత కోసం అవసరమైన అన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. అమెరికా గడ్డపై భారత్ పై పాకిస్థాన్ బెదిరింపులకు పాల్పడడాన్ని ఖండించింది. అంతేకాక పాకిస్థాన్ లోని టెర్రరిజం సమస్యను, ప్రజాస్వామ్యం ఫెయిల్ అంశాన్ని, ప్రభుత్వం మిలిటరీ చేతుల్లోకి పోయిన అంశాన్ని ప్రస్తావించింది భారత్.

తాజాగా అమెరికాలో ఏర్పాటు చేసిన బ్లాక్ టై డిన్నర్ లో పాల్గొన్న అసిమ్ మునీర్.. భారత్ తో భవిష్యత్తులో మీకు యుద్ధం ముప్పు పొంచి ఉందా..? అని ఓ వార్తా సంస్థ ప్రశ్నకు.. తమ దేశానికి ముప్పు ఎదురైతే సగం ప్రపంచాన్ని ధ్వంసం చేస్తామని తెలిపారు. అలాగే పాకిస్థాన్ కు నీరు వెళ్లకుండా సింధూ నది జలాలను భారత్ నిలిపివేయడంపై అసిమ్ మునీర్ మండిపడ్డారు. సింధూ నదిపై భారత్ కొత్తగా ఓ డ్యామ్ కడుతోందని.. ఆ డ్యామ్ పూర్తయ్యేంత వరకు వేచి చూస్తామని.. పూర్తయ్యాక 10 మిసైల్స్ తో దాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో భారత్ స్పందించింది.












Click it and Unblock the Notifications