ఐక్యరాజ్య సమితి ఎమర్జెన్సీ భేటీలో భారత్ వైఖరి ఇదే: ఉక్రెయిన్ వైపే.. మానవతా దృక్పథంతో
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర రూపాన్ని దాల్చిన యుద్ధాన్ని నివారించడానికి ఏకంగా ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి ఇదివరకే పలుమార్లు అత్యవసరంగా సమావేశమైంది. శాశ్వత, సభ్య దేశాలు తమ గళాన్ని వినిపించాయి. వాదనలను వినిపించాయి. ఆయా దేశాలన్నీ రష్యాను తప్పు పట్టాయి. ఆర్థిక పరకమైన ఆంక్షలను విధించాల్సి ఉంటుందని తీర్మానించాయి. ఐక్యరాజ్య సమితి అత్యవసరంగా సమావేశం కావాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.

భద్రత మండలి విజ్ఞప్తి మేరకు..
భద్రత మండలి విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమితి అత్యవసరంగా భేటీ కావడానికి భద్రత మండలిలోని మెజారిటీ శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలు అంగీకరించాల్సి ఉంటుంది. ఓటింగ్ ద్వారా తమ అంగీకారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. దీనికోసం ఓటింగ్‌ను నిర్వహించాయి. 15 దేశాలు ఓటింగ్‌లో పాల్గొన్నాయి. సమితి అత్యవసర సమావేశానికి అనుకూలంగా 11 ఓట్లు పోల్ అయ్యాయి.

సంయమనం పాటించాలంటూ..
మూడు దేశాలు- భారత్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. తటస్థంగా వ్యవహరించాయి. సమితి అత్యవసర భేటీ కావాలన్న తీర్మానానికి వ్యతిరకంగా రష్యా ఓటు వేసింది. మెజారిటీ సభ్య దేశాల నిర్ణయానికి అనుకూలంగా ఐక్యరాజ్య సమితి ఎమర్జెన్సీ సెషన్ ఏర్పాటైంది. ఈ అత్యున్నత వేదిక మీదుగా ఉక్రెయిన్, రష్యా రాయబారులు తమ వాదనలు, డిమాండ్లను వినిపించారు. సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెర్రస్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు.

భారత్ వాదన ఇదీ..
ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశంలో భారత్.. తన వైఖరిని స్పష్టం చేసింది. ఐరాసలో భారత శాశ్వత సభ్యుడు టీఎస్ తిరుమూర్తి- ఈ భేటీలో మాట్లాడారు. ఉక్రెయిన్ పట్ల తాము మానవతా దృక్పథంతో వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఉక్రెయిన్ పౌరులకు అవసరమైన సహాయ, సహకారాలను అందజేస్తామని తేల్చి చెప్పింది. మెడిసిన్ వంటి అత్యవసర వస్తువులను తక్షణమే సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

పౌరుల భధ్రత పట్ల ఆందోళన..
యుద్ధ వాతావరణంలో కొనసాగుతున్న ఉక్రెయిన్ ప్రజల భద్రత పట్ల తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామని టీఎస్ తిరుమూర్తి అన్నారు. ప్రత్యేకించి మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వారికి మానవతా దృక్పథం కింద అత్యవసర సహాయాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వ్యాఖ్యానించారు. హింసను తక్షణమే నిలిపివేయాలని కోరుతున్నట్లు తిరుమూర్తి తెలిపారు.

చర్చలు, దౌత్యనీతి ద్వారానే..
రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న పరిస్థితులు ఎవరికీ శ్రేయస్కరం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నారని తిరుమూర్తి చెప్పారు. చర్చలు, దౌత్యనీతి ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఐక్యరాజ్య సమితి మార్గదర్శకాలు, అంతర్జాతీయ చట్టాలను సభ్య దేశాలు అనుసరించాలని కోరుతున్నామని అన్నారు. ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

భారతీయుల తరలింపు ముమ్మరం..
ఉక్రెయిన్‌లో భారత పౌరుల తరలింపుపై ప్రస్తుతం తాము దృష్టి సారించామని, దీనికోసం నలుగురు కేంద్రమంత్రులను తమ ప్రభుత్వం ప్రత్యేక రాయబారులుగా నియమించిందని తిరుమూర్తి చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో ఉక్రెయిన్ పొరుగు దేశాలన్నీ భారత్‌కు అండగా నిలిచాయని, తమ దేశ విద్యార్థులు, పౌరులను తరలించడానికి అనుకూల పరిస్థితులను కల్పించాయని అన్నారు. యుద్ధానికి దిగడం, దాన్ని కొనసాగించడం సమర్థనీయం కాదని, ముఖాముఖి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.












Click it and Unblock the Notifications