e-Visa Services: కెనడియన్లకు ఇ-వీసా సేవలను తిరిగి ప్రారంభించిన భారత్..!
దాదాపు రెండు నెలల విరామం తర్వాత కెనడియన్ పౌరుల కోసం భారతదేశం ఇ-వీసా సేవలను తిరిగి ప్రారంభించినట్లు సమాచారం. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో ఖలిస్థానీ అనుకూల వ్యక్తి హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వాఖ్యలతో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే వీసాల జారీని సెప్టెంబర్ 21న తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే అక్టోబర్‌లో పర్యాటక, ఉపాధి, విద్యార్థి, చలనచిత్రం, మిషనరీ, జర్నలిస్టు వీసాలు మినహాయించి, కెనడియన్ పౌరులకు కొన్ని కేటగిరీల్లో వీసా సేవలను భారతదేశం తిరిగి ప్రారంభించింది.
కెనడా పౌరులకు ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసా కేటగిరీల్లో సేవలను పునరుద్ధరించారు. తాజాగా ఈ-వీసా సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం జీ20 దేశాధినేతల వర్చువల్ సదస్సు జరగనుంది. ఈ భేటీలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా పాల్గొంటరా లేదా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆయన సమావేశంలో పాల్గొంటారని ఒట్టవా స్పష్టతనిచ్చింది.

వర్చువల్ G20 లీడర్స్ సమ్మిట్‌లో కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో పాల్గొనడానికి కొన్ని గంటల ముందు భారత్ ఇ వీసాలను పునరుద్దరించారు.ట్రూడో హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారతీయ ఏజెంట్లకు, నిజ్జర్ హత్యకు మధ్య సంభావ్య సంబంధం గురించి "విశ్వసనీయమైన ఆరోపణలు" ఉన్నాయని పేర్కొన్నారు.
దీనిని న్యూ ఢిల్లీ "అసంబద్ధం" "ప్రేరేపితమైనది" అని కొట్టిపారేసింది. ఈ హత్యలో భారత్ ప్రమేయంపై కెనడా ప్రధాని ఇంకా ఎలాంటి ఆధారాలు అందించలేదు. నవంబర్ 12న, ట్రూడో నిజ్జర్ హత్యలో భారతదేశ ప్రమేయం ఉందన్న తన ఆరోపణను పునరుద్ఘాటించారు. కెనడా ఆరోపణపై దర్యాప్తును భారత్ తోసిపుచ్చడం లేదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత వారం చెప్పారు.












Click it and Unblock the Notifications