మోదీ దిద్దుబాటు- అమెరికా వస్తువులపై టారిఫ్ తగ్గింపు: భారత్‌తో వ్యాపారం కష్టం: ట్రంప్
Modi Trump meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. అధ్యక్షుడి అధికారిక నివాసం రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌లో ఈ సమావేశం ఏర్పాటైంది. 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే ఇద్దరు నేతల మధ్య ఈ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరంచుకుంది.
సందడిగా వైట్‌హౌస్..
భారత కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున సరిగ్గా 2:30 గంటలకు వైట్ హౌస్‌కు చేరుకున్నారు మోదీ. వైట్ హౌస్ సిబ్బంది ఆయనను సాదరంగా స్వాగతం పలికారు. ట్రంప్ ఎదురేగి ఆహ్వానం పలికారు. ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. మంత్రులను పరిచయం చేశారు ట్రంప్. విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో సహా ఇతర మంత్రులను పేరుపేరునా పరిచయం చేశారు.
బ్రిక్స్ టారిఫ్‌పై..
ఆ కొద్దిసేపటికి ఓవల్ ఆఫీస్ ఛాంబర్‌కు వెళ్లారు. అక్కడే ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలుకుని, భారత్‌పై ప్రతిపాదించిన ట్రేడ్- టారిఫ్ పెంపు అంశం వరకూ వారిద్దరూ చర్చించుకున్నారు.

ట్రేడ్, టారిఫ్..
అనంతరం జాయంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.. మోదీ, ట్రంప్. వివిధ అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇద్దరు నేతలు సమాధానాలను ఇచ్చారు. భారత్ సభ్యదేశంగా ఉన్న బ్రిక్స్‌పై అమెరికా 100 శాతం టారిఫ్ విధించదలిచిన నేపథ్యంలో- ఎక్కువగా ట్రేడ్- టారిఫ్‌పైనే ప్రశ్నోత్తరాలు సాగాయి.
2030 నాటికి..
ఈ సందర్భంగా మోదీ కీలక ప్రకటన చేశారు. 2030 నాటికి భారత్- అమెరికా మధ్య 500 బిలియన్ డాలర్ల మేర వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సాగించేలా ఒప్పందాలను కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు కొనసాగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యానికి అదనంగా 500 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
రెండు దేశాలకూ ప్రయోజనకారిగా..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు సహా అనేక రంగాల్లో అమెరికా- భారత్ కలిసి పని చేస్తాయని, ఇంధనం, సహజవాయు రంగాల్లో పరస్పరం బలంగా ఎదగడానికి ఇది దోహదపడుతుందని మోదీ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించన వాణిజ్య ఒప్పందాలపై అతి త్వరలోనే సంతకాలు చేస్తామనీ అన్నారు.
భారత్‌లో అమెరికా వస్తువులపై టారిఫ్ తగ్గింపు..
అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గిస్తున్నట్లు భారత్ ప్రకటించిందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసే లక్ష్యంతో ఈ రంగంలో నెలకొన్న అసమానతలను తొలగించే దిశగా చర్చలు సంతృప్తికరంగా సాగాయని వ్యాఖ్యానించారు. వాణిజ్య రంగంలో నెలకొన్న లోటును ఆయిల్ అండ్ గ్యాస్ అమ్మకాలతో భర్తీ చేయవచ్చని పేర్కొన్నారు.
మొదటి టర్మ్‌లోనే..
2016 2019 మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడిగా తన మొదటి పదవీకాలంలోనే భారత్‌కు విధించిన అధిక టారిఫ్ గురించి మోదీతో చర్చించానని, అప్పట్లో ఆ దేశం నుంచి ఎటువంటి రాయితీలు పొందలేకపోయానని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. తాజాగా ప్రతిపాదించిన కొత్త టారిఫ్ వ్యవస్థ ప్రకారం- భారత్ కొనసాగిస్తోన్న ట్యాక్సుల విధానానికి అనుగుణంగానే తాము కూడా టారిఫ్ వసూలు చేస్తామని చెప్పారు.
భారత్‌లో విక్రయించడం చాలా కష్టం
తమ దేశ ఉత్పత్తులను భారత్‌లో విక్రయించడం చాలా కష్టమని ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వాణిజ్యపరమైన అడ్డంకులు, అత్యధిక ట్యాక్సులు ఆ దేశంలో ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే- భారత్‌తో సమానంగా టారిఫ్ విధించే అవకాశాలు లేకపోలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications