తుది దశకు చర్చలు.. ట్రంప్ నిర్ణయంపై ఉత్కంఠ.. అదే కానీ జరిగితే..!
భారత్- అమెరికా మధ్య జూన్ 26 నుంచి జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలు క్లైమాక్స్ కు చేరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ భారత్ పై తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. భారత్ పైన ట్రంప్ ప్రభుత్వం మూడు నెలల క్రితం 26 శాతం టారిఫ్ లు విధించింది. కానీ వాటిని 90 రోజులపాటు నిలిపివేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు చివరి దశకు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ తీసుకునే నిర్ణయంపై ఇరు దేశాల మధ్య ఉత్కంఠ నెలకొంది.
భారత్- అమెరికా మధ్య జూన్ 26 నుంచి సాగుతున్న వాణిజ్య చర్చలు చివరిదశకు చేరుకున్నాయి. జులై 9 లో ఇరు దేశాల మధ్య ఒప్పందం పై ప్రకటన రావాల్సి ఉండగా చర్చలు పూర్తి కాకపోవడంతో వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో జులై 31 లోపు ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు పూర్తవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. టారిఫ్ లను తగ్గించే విషయంలో అమెరికా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చర్చలు ఫలిస్తే ప్రస్తుతం ఉన్న 26 శాతం టారిఫ్ లు 20 శాతం కంటే దిగువకు తగ్గిపోతాయని భారత వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, లోహాల వంటి కీలక రంగాల్లో ఈ తగ్గింపు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్ కు మాత్రం ఇది ఒక ప్రత్యేకమైన అవకాశంగా మారనుంది.
మొదట జులై 9 లోపు వాణిజ్య ఒప్పందం పూర్తి చేసుకోవాలని ఇరు దేశాలు భావించాయి. కానీ అమెరికా కొత్త మెలికతో వాజిజ్య ఒప్పందాలకు డెడ్ లాక్ పడింది. వ్యవసాయం, డెయిరీ రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ట్రేడ్ ఒప్పందానికి బ్రేకులు పడ్డాయి. అగ్రికల్చర్, పాల ఉత్పత్తులపై భారత్ వెనక్కు తగ్గలేదని తేల్చి చెప్పడంతో ఇరు దేశాలు వాణిజ్య డీల్ కాస్త విరామం వచ్చింది. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అమెరికా సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత్ కు అమెరికా బిగ్ రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్ విషయంలో కొంత సానుకూలంగా ఉన్న ట్రంప్.. మిగతా దేశాలపై మాత్రం టారిఫ్ ల మోత మోగిస్తున్నారు. తాజగా యూరోపియన్ యూనియన్ (ఈయూ), మెక్సికోలపై 30 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. అంతేకాక ఆసియా దేశాలపైనా ట్రంప్ భారీగా టారిఫ్ లు పెంచేశారు. ఆసియా దేశాలకు ప్రకటించిన సుంకాల రేట్లలో వియత్నాం, ఫిలిప్పీన్స్ కు 20 శాతం, లావోస్, మయన్మార్ కు 40 శాతం వరకు ఉన్నాయి. బ్రెజిల్ కు ఏకంగా 50 శాతం వరకు సుంకాలు విధించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ కు 20 శాతం కంటే తక్కువ టారిఫ్ విధిస్తే ట్రంప్ భారత్ పై సానుకూలంగా వ్యవహరించినట్లే అని భావించవచ్చు.
ఇక 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) అనే నినాదంతో దూసుకెళ్లారు. అనంతరం రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ క్రమంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రపంచ దేశాలపై భారీ టారిఫ్ లు విధించడమే ఏకైక మార్గంగా ట్రంప్ భావిస్తున్నారు. ఇక వివిధ దేశాలపై విధించిన టారిఫ్ లు ఆగస్టు 1నుంచి అమల్లోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications