భారత్.. వణుకుతోంది: నిర్ణయాల్లో అస్థిరత: పెదవి విప్పిన జో బైడెన్
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో అగ్గి రాజేసినట్టే కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాకు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టే విషయంలో అగ్రరాజ్యం అమెరికా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఈ నెల 25వ తేదీన పోలాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. రణక్షేత్రంగా మారిన ఈ ఉక్రెయిన్ పొరుగుదేశంలో మకాం వేయనున్నారు.
Recommended Video


రష్యా దూకుడును అడ్డుకోవడానికి..
అనంతరం బైడెన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల అత్యున్నత స్థాయి భేటీలో పాల్గొంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ యుద్ధం మాత్రం తీవ్రతరమౌతూనే వస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పట్లాగే విరుచుకుపడుతోంది. దాదాపు అన్ని రీజియన్లపైనా పట్టు బిగించింది. తమ దేశ సరిహద్దులకు సమీపంలో ఉన్న అన్ని నగరాలనూ ఆధీనంలోకి తెచ్చుకుంది. రష్యా సైనిక బలగాలను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది.

నాటో సభ్య దేశంలో బైడెన్..
తనకు మద్దతుగా నిలిచిన దేశాల నుంచి అందుతోన్న ఆయుద్ధ సంపత్తి, సైనిక సహకారంతో రష్యా దూకుడును నిలువరించే ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ పరిణామాల మధ్య పోలాండ్‌లో బైడెన్ మకాం వేయడం- ఉక్రెయిన్‌కు మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగించినట్టవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. నాటోలో సభ్యత్వం ఉన్న దేశం.. పోలాండ్. మొదటి నుంచీ రష్యాను వ్యతిరేకిస్తోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు అండగా నిలిచింది.

భారత నిర్ణయాల్లో అస్థిరత్వం..
ప్రపంచదేశాల మద్దతును కూడా గట్టే విషయంపై వాణిజ్యవేత్తల సదస్సులో జో బైడెన్ మాట్లాడారు. రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాల తరహాలో భారత్.. రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయలేకపోతోందని, వణుకుతోందని అన్నారు. రష్యా వ్యతిరేక కూటమిలో భారత్‌ను మినహాయించినట్టేనని పేర్కొన్నారు. స్థిరమైన నిర్ణయాలు, అభిప్రాయాలు భారత్‌లో కనిపించట్లేదని చెప్పారు.

క్వాడ్ సభ్య దేశాల్లో..
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా.. క్వాడ్‌లో సభ్యత్వం గల దేశాలు. ఇందులో భారత్ మినహాయిస్తే- మిగిలిన రెండూ రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్నాయి. జపాన్, ఆస్ట్రేలియా ఇదివరకే రష్యాపై ఆంక్షలను విధించాయి. ఈ యుద్ధంలో రష్యా వైఖరిని తప్పు పట్టాయి. ఇక మిగిలింది- భారత్. రష్యాతో సుదీర్ఘకాలంగా బలమైన స్నేహ సంబంధాలను కలిగివున్న భారత్.. రష్యాతో వైరం ఏ మాత్రం కోరుకోవట్లేదు. అలాగనీ- యుద్ధాన్ని గానీ, ఈ విషయంలో రష్యాను గానీ సమర్థించట్లేదు. తటస్థంగా ఉంటోంది.

తప్పు పట్టిన జో బైడెన్..
క్వాడ్‌లో సభ్యత్వం ఉన్న దేశాలు రష్యా వ్యతిరేక కూటమిలో చేరడం.. భారత్ ఇందుకు అంగీకరించకపోవడాన్ని జో బైడెన్ బాహటంగా తప్పుపట్టారు. రష్యా నుంచి క్రూడాయిల్‌ను కొనడాన్ని కూడా పరోక్షంగా వ్యతిరేకించారు. భారత వైఖరిపై ఆయన స్పందించడం ఇదే తొలిసారి. క్వాడ్‌లో ఉన్న దేశాల్లో భారత్‌ను మినహాయించినట్టేనని వ్యాఖ్యానించారు. రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరించడంలో జపాన్ తమ అంచనాలకు అనుగుణంగా, బలంగా పని చేస్తోందని చెప్పారు. ఆస్ట్రేలియా ఇప్పటికే పలు ఆంక్షలను విధించిందని గుర్తు చేశారు.

నాటో చీలిపోతుందంటూ..
తమకు ఎదురుతిరిగే విషయంలో నాటో చీలిపోతుందంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలను కూడా జో బైడెన్ తప్పు పట్టారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా నాటో సభ్య దేశాలు ఐక్యంగా ఉన్నాయని చెప్పారు. ఉమ్మడిగా రష్యాను వ్యతిరేకిస్తోన్నాయని తేల్చిచెప్పారు. నాటో చీలిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఐక్యంగా రష్యాను ఎదుర్కొంటున్నాయని, యుద్ధాన్ని ఆపేంత వరకూ ఇది కొనసాగుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications