దేవయాని ఇష్యూపై అమెరికా: తీసుకొస్తా..సల్మాన్ ప్రతిజ్ఞ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత దౌత్యాధికారిణి దేవయాని కోబ్రాగేడ్ ఇష్యూపై అగ్ర రాజ్యం అమెరికా తగ్గింది. దేవయానిని నిబంధనల మేరకే అరెస్టు చేశామని అయినా దీనిని పునఃసమీక్షించుకుంటామని అమెరికా తెలిపింది. ఈ అంశం రెండు దేశాల మధ్య ప్రతికుల ప్రభావం చూపాలని కోరుకోవడం లేదని పేర్కొంది.
ఇది చాలా సున్నితమైన అంశమని, తాము భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. భారత్‌లోని అమెరికా దౌత్యాధికారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో అమెరికా తగ్గింది. కాగా, అమెరికాలో చేతికి సంకెళ్లు వేయడం, చెక్ చేయడం సాధారణమేనని అమెరికా మానవ హక్కుల సంఘం పేర్కొంది.

బాధాకరం: ప్రధాని
భారత్ దౌత్యాధికారిణి దేవయాని పట్ల అమెరికా తీరు చాలా బాధాకరమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. దేవయాని అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. మనమంతా ఒకే వాయిస్‌తో ఉండాలన్నారు. ఈ ఘటన తెలియగానే వెంటనే కేంద్రం స్పందించిందన్నారు. దేవయానిపై అమెరికా తీరును ఖుర్షీద్ ఖండించారు. అరెస్టైన దేవయానిని తాను వెనక్కి తీసుకు రాకుంటే మళ్లీ పార్లమెంటుకు రానని ప్రతిజ్ఞ చేశారు. ఆమెను వెనక్కి రప్పించి ఆమె గౌరవాన్ని కాపాడుతామన్నారు. అలా చేయకుంటే తాను సభలో అడుగు పెట్టనన్నారు.
రాజ్యసభలో...
దేవయాని పట్ల అమెరికా వ్యవహరించిన తీరును రాజ్యసభలో అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అరుణ్ జైట్లీ అన్నారు. కేంద్రం ఈ అంశంపై ఆలస్యంగా స్పందించిందని బిఎస్పీ అధినేత్రి, యుపి మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. దేవయాని దళిత మహిళ అయినందునే కేంద్రం ఆలస్యంగా స్పందించిందని ఆరోపించారు.
సరికాదు: చంద్రబాబు
దేవయాని పట్ల అమెరికా వ్యవహరించిన తీరు సరికాదని హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేవయాని పట్ల పద్ధతిగానే వ్యహరించామని అమెరికా రక్షణ శాఖ చెప్పడాన్ని ఖండించారు. భారత్‌కు తక్షణమే అమెరికా క్షమాపణ చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడాలని కాంగ్రెసు కోరుకుంటోందన్నారు.












Click it and Unblock the Notifications