దేవయాని ఇష్యూపై దెబ్బకి దెబ్బ, క్షమాపణ చెప్పేవరకు
న్యూఢిల్లీ: భారత దౌత్యాధికారి దేవయాని పట్ల అమెరికా ప్రభుత్వ వైఖరిని బిజెపి తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అమెరికా వైఖరిని సిగ్గుమాలిన, హేయమైన చర్యగా అభివర్ణించారు. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, ధీటైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అమెరికా దౌత్యాధికారుల్లో పలువురు స్వలింగ సంపర్కులు ఉన్నారని, తాజాగా సుప్రీం తీర్పు నేపథ్యంలో వీరిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని మాజీ విదేశాంగ మంత్రి యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా స్పందిస్తూ.. అమెరికా వైఖరిపై భారత్ కఠినంగా వ్యవహరించాలని కోరారు.

భారత్‌లో అమెరికా దౌత్యాధికారులకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలను ఉపసంహరించుకుంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమర్థించారు. అమెరికాలో భారత్ దౌత్యాధికారికి అవమానం జరిగిన తర్వాత కూడా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అమెరికా బృందంతో సమావేశమవ్వడంపై జెడి(యు) ఎంపి కెసి త్యాగి తప్పుబట్టారు.
దేవయాని పట్ల అమానుషంగా, పాశవికంగా ప్రవర్తించడంపై తీవ్రంగా మండిపడిన భారత ప్రభుత్వం, దెబ్బకు దెబ్బ అన్న రీతిలో స్పందించిన విషయం తెలిసిందే. దేశంలోని అమెరికా దౌత్యవేత్తలను గుర్తింపు కార్డులు అన్నీ సమర్పించాలని ఆదేశించింది. దేశ పర్యటనలో వున్న అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల బృందాన్ని కలుసుకోవడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే నిరాకరించారు.
మద్యంతో పాటుగా అమెరికా దౌత్యకార్యాలయం జరిపే అన్ని దిగుమతులకు క్లియరెన్సులను సైతం ప్రభుత్వం నిలిపివేసింది. అంతేకాకుండా న్యాయమార్గ్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను సైతం తొలగించాలని ఆదేశించింది. అయితే పోలీసు పికెట్ మాత్రం కొనసాగుతుంది.
మరోవైపు రాజకీయ పార్టీలు సైతం భారత మహిళా దౌత్యవేత్తపట్ల అమెరికా ప్రవర్తించిన తీరుపై మండిపడుతూ, అమెరికా బేషరతుగా క్షమాపణ చెప్పేవరకూ దానికి తీసిపోని విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి. అంతేకాకుండా మన దేశంలోని అమెరికా స్కూళ్లలోని టీచర్లందరి వీసాల వివరాలను, స్కూళ్లలో, దౌత్య సిబ్బంది ఇళ్లలో పనిచేస్తున్న భారతీయుల వేతనాలు, బ్యాంకు అకౌంట్ల వివరాలనూ అందజేయాలని ఆదేశించింది.
న్యూయార్క్‌లో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పని చేస్తున్న దేవయాని కోబ్రాగడేను గతవారం అమెరికా పోలీసులు అరెస్టు చేసి చేతులకు బేడీలు వేయడమేకాక, ఆమె వస్త్రాలు తీసివేసి సోదాలు జరిపినట్టు వార్తలు రావడం తెలిసిందే. దేవయాని పట్ల అమెరికా పోలీసు అధికారులు ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.
దేవయాని కోబ్రాగడే పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలని, అమెరికా బేషరతుగా క్షమాపణ చెప్పే దాకా మరిన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ అన్నారు. ఈ విషయంలో అమెరికా అధికారులకు గుణపాఠం చెప్పేవిధంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications