Guinness Record: ఆక్సిజన్ లేని ఎత్తులో ఆగని అడుగులు
మానాలి నుంచి లేహ్ వరకు.. అంటే హిమాలయాల గుండెల్లోని అత్యంత ప్రమాదకరమైన మార్గం. ఈ మార్గాన్ని ఆపకుండా, అలసటకు లొంగకుండా దాటి పరుగెత్తింది ఒక భారతీయ మహిళ. దాదాపు 480 కిలోమీటర్లు, ఐదు హిమాలయ కనుమలు, ప్రాణాలు పరీక్షించే పరిస్థితులు... ఎత్తు పెరిగేకొద్దీ ఆక్సిజన్ స్థాయిలు వేగంగా పడిపోవడం వల్ల ఊపిరితిత్తులు, కండరాలపై తీవ్ర ఒత్తిడి... అనేక ప్రాంతాల్లో తక్షణ సహాయం లభించని పరిస్థితులు.. కానీ నాన్‌స్టాప్‌గా ఈ పరుగు పూర్తి చేయడం చాలామందికి ఊహకందని విషయం. ఈ విజయం కేవలం వేగానికి సంబంధించినది కాకుండా, మానసిక నియంత్రణకు ప్రతీకగా నిలిచింది. వీటన్నింటిని ఎదుర్కొని ఆమె నెలకొల్పిన ఘనతకు ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ముద్ర పడింది.
మానాలి నుంచి లేహ్ వరకు హిమాలయాల గుండెల్లోని అత్యంత ప్రమాదకరమైన మార్గాన్ని ఆపకుండా దాటి పరుగెత్తి భారతీయ అల్ట్రా-డిస్టెన్స్ రన్నర్ సూఫియా సూఫీ అరుదైన ఘనత సాధించారు. ప్రాణాలను పరీక్షించే వాతావరణ పరిస్థితుల మధ్య దాదాపు 480 కిలోమీటర్ల సవాలును ఆమె విజయవంతంగా పూర్తి చేసి గిన్నిస్ ప్రపంచ రికార్డుల గుర్తింపును పొందారు. ఈ విజయం భారత క్రీడా చరిత్రలో మరో గొప్ప అధ్యాయంగా నిలిచింది.

మానాలి-లేహ్ పరుగు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రన్నింగ్ మార్గాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఐదు హిమాలయ కనుమలను దాటుతూ సాగే ఈ మార్గంలో ఆక్సిజన్ తీవ్రంగా తగ్గిపోవడం, అకస్మాత్తుగా మారే వాతావరణం, గడ్డకట్టే రాత్రులు, ఎడతెగని ఎత్తు ఎక్కడం వంటి సవాళ్లు ఎదురవుతాయి. మొత్తం ఎత్తు పెరుగుదల 8,500 మీటర్లకు పైగా ఉండటం ఈ మార్గాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తుంది.
100 గంటల బెంచ్‌మార్క్‌ను బ్రేక్..
ఈ సవాలును సూఫియా సూఫీ 98 గంటల 27 నిమిషాల్లో పూర్తి చేసి, ఇప్పటివరకు ఉన్న 100 గంటల బెంచ్‌మార్క్‌ను అధిగమించారు. నిరంతర పరుగు, సరైన వేగ నియంత్రణ, మానసిక స్థైర్యం, శారీరక ఓర్పు కలిసినప్పుడే ఇలాంటి ఘనత సాధ్యమవుతుందని ఆమె ప్రదర్శన స్పష్టంగా చాటిచెప్పింది.
తన గిన్నిస్ ప్రపంచ రికార్డు ధృవీకరణ పత్రం ఆలస్యంగా అందిన విషయాన్ని సూఫియా సోషల్ మీడియాలో సరదాగా పంచుకున్నారు. డెలివరీ ఛానెల్స్, ఇండియన్ కస్టమ్స్ కారణంగా సర్టిఫికెట్ ఆలస్యమైందని పేర్కొంటూ, ఈ ఘడియ తనకు గర్వం, కృతజ్ఞత, ఉపశమనాన్ని కలిగించిందని తెలిపారు. ఈ ప్రయాణంలో తనను నమ్మి మద్దతిచ్చిన సిబ్బంది, స్పాన్సర్లు, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
తొలి అద్భుతం కాదు..
ఇది సూఫియా సాధించిన తొలి అద్భుతం కాదు. ఆమె ఇప్పటికే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అత్యంత వేగంగా పరుగెత్తిన మహిళగా గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. అలాగే 6,000 కిలోమీటర్లకు పైగా ఉన్న గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రన్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసి, భారత అల్ట్రా-రన్నింగ్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
ఒకప్పుడు క్యాబిన్ సిబ్బందిగా పనిచేసిన సూఫియా, ఫిట్‌నెస్ కోసం మొదలుపెట్టిన పరుగు క్రమంగా జీవిత లక్ష్యంగా మారింది. నిరంతర కృషి, పట్టుదలతో ఆమె భారతదేశంలోని అత్యంత దృఢమైన అల్ట్రా-రన్నర్‌లలో ఒకరిగా నిలిచారు. ఆమె కథ అనేకమంది యువతకు స్ఫూర్తినిస్తూ, మానవ సామర్థ్యానికి కొత్త నిర్వచనం ఇస్తోంది.
మానాలి-లేహ్ పరుగు అధికారికంగా గిన్నిస్ రికార్డుగా గుర్తింపు పొందిన నేపథ్యంలో, సూఫియా సూఫీ విజయం కేవలం వ్యక్తిగత ఘనతగా కాకుండా భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తోంది. పట్టుదల ఉంటే భౌతిక పరిమితులను కూడా అధిగమించవచ్చని ఆమె విజయగాథ మరోసారి నిరూపించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications