వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CIA: అమెరికా గూఢచార సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా భారతీయ అమెరికన్ నంద్ మూల్‌చందనీ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

అమెరికా గూఢచార సంస్థ 'సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ' (సీఐఏ) డైరెక్టర్ విలియం జె బర్న్స్, భారతీయ సంతతికి చెందిన నంద్ మూల్‌చందనీని ఏజెన్సీకి తొలి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా నియమించారు.

ఈ నిఘా సంస్థ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, నంద్ మూల్‌చందనీకి ప్రైవేట్, ప్రభుత్వ శాఖలలో 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉందని పేర్కొంది.

సిలికాన్ వ్యాలీతోనూ, అమెరికా రక్షణ శాఖలోనూ పనిచేశారు నంద్ మూల్‌చందనీ. సీఐఏలో చేరడానికి ముందు, ఆయన రక్షణ మంత్రిత్వ శాఖలోని జాయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

నంద్ మూల్‌చందానీ అనేక విజయవంతమైన స్టార్టప్‌లను రూపొందించారు. ఆబ్లిక్స్, డిటర్మినా, ఓపెన్‌డీఎన్ఎస్, స్కేల్ ఎక్స్‌ట్రీమ్‌ సంస్థలకు సహ వ్యవస్థాపకుడు, సీఈఓ కూడా.

నంద్ మూల్‌చందానీ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన దిల్లీలోని బ్లూబెల్స్ స్కూల్ ఇంటర్నేషనల్‌లో చదువుకున్నారు. 1987లో ఈ స్కూల్లో 12వ తరగతి పూర్తి చేసిన తరువాత నంద్ మూల్‌చందానీ బీఏ చదివేందుకు అమెరికా వెళ్లారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్‌లో డిగ్రీ పొందారు.

2018లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్, తరువాత హార్వర్డ్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు.

ప్రస్తుతం సీఐఏలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

అమెరికాలో సీఐఏని ఫ్రంట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ (మొదటి రక్షణ శ్రేణి)గా పరిగణిస్తారు.

ఇంతకీ సీఐఏ ఎలా పనిచేస్తుంది? దీని గురించి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చర్చలు జరుగుతాయి? దీని ప్రాముఖ్యం ఏంటి?

CIA

సీఐఏ ఎప్పుడు ప్రారంభమైంది? ఎలా పనిచేస్తుంది?

అమెరికాలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని 1947లో స్థాపించారు. ఇది ఒక ప్రభుత్వ సంస్థ.

ప్రపంచ సమస్యలపై సమాచారం సేకరిస్తూ, వివిధ దేశాలపై గూఢచర్యం చేస్తుందీ సంస్థ. ఈ సమాచారాన్ని అమెరికా అధ్యక్షుడు, జాతీయ భద్రతా మండలి సహా ఇతర సంస్థలతో పంచుకుంటుంది. ఆ దేశ జాతీయ భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ నిఘా సంస్థ అందించే సమాచారం తోడ్పడుతుంది.

ఉగ్రవాదంపై పోరు, అణ్వాయుధ, సంప్రదాయేతర ఆయుధాల విస్తరణను నిరోధించడం, విదేశీ గూఢచర్యం నుంచి స్వదేశాన్ని రక్షించడం, ఇతర దేశాలపై గూఢచర్యం వంటి వాటిపై సమాచారం సేకరిస్తుంది సీఐఏ.

దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఉంది. ప్రస్తుతం విలియం జే బర్న్స్ దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సీఐఏ డైరెక్టర్‌ను అమెరికా అధ్యక్షుడు ఎన్నుకుంటారు. అయితే, అధ్యక్షుడి నిర్ణయాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది. సీఐఏ డైరెక్టర్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌కి రిపోర్ట్ చేస్తారు.

సీఐఏ బడ్జెట్ ఎంత?

అమెరికాలో జాతీయ గూఢచర్యం, నిఘా కార్యక్రమాలకు వార్షిక బడ్జెట్ కేటాయిస్తారు. దీన్ని అమెరికాలోని 16 విభిన్న నిఘా సంస్థలు కలిసి ఖర్చు చేశాయి. వీటిలో సీఐఏ ఒకటి. ఏ సంస్థకు ఎంత డబ్బు కేటాయించారన్న విషయం మాత్రం బయటకు పొక్కదు.

2020 సంవత్సరంలో, నేషనల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాముల కోసం మొత్తం 62.7 బిలియన్ డాలర్ల (రూ. 4,81,322 కోట్లు) బడ్జెట్ కేటాయించారు.

అయితే, ఈ బడ్జెట్‌లో మిలటరీ గూఢచర్య కార్యక్రమాలను చేర్చరు. వాటికి వేరే బడ్జెట్ ఉంటుంది. అది సంవత్సరానికి 20 బిలియన్ డాలర్ల (రూ. 1,53,463 కోట్లు) కన్నా ఎక్కువ ఉంటుంది.

అమెరికా నేషనల్ నేషనల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ బడ్జెట్ కంటే తక్కువ జీడీపీ ఉన్న దేశాలు 100కు పైనే ఉంటాయి.

2013లో అమెరికన్ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ ఎడ్వర్డ్ స్నోడెన్‌ను ఉటంకిస్తూ అమెరికా ఇంటెలిజెన్స్ బడ్జెట్ గురించి అనేక వాదనలు చేసింది. 2013లో ఈ బడ్జెట్ 52.6 బిలియన్ డాలర్లు (రూ. 4,03,647 కోట్లు). ఇందులో, ఒక్క సీఐఏ సంస్థే దాదాపు 96,000 కోట్ల రూపాయలకు సమానమైన ఖర్చు చేస్తుందని ఆ వార్తాపత్రిక పేర్కొంది.

సీఐఏ, మనుషులపై గూఢచర్యం కోసం సుమారు అయిదు బిలియన్ డాలర్లు లేదా 30 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది. ఇందులో దాదాపు రూ.440 కోట్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తమ గూఢచారులకు నకిలీ గుర్తింపులు ఇవ్వడానికే ఖర్చు చేస్తున్నదని పత్రిక పేర్కొంది.

సీఐఏ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలు

2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన ఉగ్రవాద దాడిని ప్రపంచం ఎప్పటికీ మరచిపోలేదు. ఈ దాడిలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.

ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అల్ ఖైదా చేసిన ఈ దాడి తరువాత, దాని చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ ఆచూకీని సీఐఏ కనుగొంది. ఆ తరువాత, 2011 మే 2న అమెరికా ఒక ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి లాడెన్‌ను చంపింది.

అల్ ఖైదా హెడ్ ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకోవడం నుంచి ఆ దేశ ప్రభుత్వాన్ని పడగొట్టడం వరకు సీఐఏ ముఖ్య పాత్ర పోషించింది.

CIA

ఇరాన్‌లో తిరుగుబాటు

1953లో ఇరాన్ తిరుగుబాటులో తమ పాత్ర ఉందని సీఐఏ అధికారికంగా అంగీకరించింది. ఈ తిరుగుబాటులో అప్పటి ఇరాన్ ప్రధానమంత్రి మహమ్మద్ ముసద్దిక్ పదవీచ్యుతులయ్యారు.

దస్తావేజుల ప్రకారం, తిరుగుబాటు సన్నాహాల్లో భాగంగా సీఐఏ.. ఇరాన్, అమెరికా మీడియాల్లో ముసద్దిక్ వ్యతిరేక వార్తలను ప్రచురించడం ప్రారంభించింది. ఈ తిరుగుబాటు షా మొహమ్మద్ రెజా పహ్లావి పాలనను బలపరిచింది. అప్పట్లో పహ్లావి ఇరాన్ బయట నుంచి ముసద్దిక్‌తో అధికారం కోసం పోరాటం చేశారు.

తిరుగుబాటు తరువాత ఆయన ఇరాన్‌కు తిరిగి వచ్చారు. అమెరికా మితప్రక్షంలో భాగమయ్యారు.

అసలు సద్దాం హుస్సేన్‌ను గుర్తించింది కూడా సీఐఏ సంస్థే

2003లో ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను అమెరికా బంధించినప్పుడు, ఆయన అసలు సద్దాం హుస్సేనా కాదా అనే అనుమానాలు రేకెత్తాయి. అప్పట్లో చాలా మంది నకిలీ సద్దాం హుస్సేన్‌లు ఉన్నారని ప్రచారం జరిగింది.

ఈ విషయాన్ని ధృవపరచుకోవడానికి అమెరికా, ఆ బాధ్యతను సీఐఏకు అప్పగించింది. ఆ సమయంలో నిక్సన్ ఇరాక్‌లో ఉన్నారు. సద్దాం హుస్సేన్‌తో కొంతసేపు మాట్లాడి ఆయనే అసలైన సద్దాం హుస్సేన్ అని ధృవీకరించారు.

2011లో సీఐఏ నుంచి తప్పుకున్నారు నిక్సన్. సద్దాం అసలు రూపాన్ని పసిగట్టడంలో తనకు ఎలాంటి సందేహాలు ఎదురవ్వలేదని ఆయన పేర్కొన్నారు.

సద్దాం హుస్సేన్‌

ఇంటెలిజెన్స్ మిషన్‌లో పావురాలు

సందేశాలను చేరవేయడానికి పావురాలను ఉపయోగించడం ఎన్నో వేల ఏళ్ల నుంచీ ఉంది. అయితే, తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధంలో వాటిని గూఢచర్య కార్యకలాపాల్లో వినియోగించారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రపంచానికి అంతగా తెలియని శాఖ ఎంఐ 14 (డీ), గూఢచర్య పావురాల సర్వీసు కూడా ప్రారంభించింది.

ఆ తరువాత, ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సీఐఏ పావురాలకు గూఢచర్య కార్యకలాపాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. పావురాలకు రహస్యంగా ఫొటోలు తీయడంలో శిక్షణ ఇచ్చి సోవియట్ యూనియన్‌లోని కొన్ని ప్రాంతాలకు పంపారు.

ఆపరేషన్ 'టకానా' సమయంలో ఈ పనులకు ఇతర జంతువులను కూడా ఉపయోగించారు. 40 గ్రాముల బరువున్న వస్తువును ఒక భవనం కిటికీపై పెట్టేందుకు సీఐఏ ఒక కాకికి శిక్షణ ఇచ్చినట్లు డాక్యుమెంట్లలో ఉంది.

1960ల నాటి దస్తావేజులను పరిశీలిస్తే, ఇతర దేశాల్లోని ఓడరేవులపై నిఘా పెట్టేందుకు డాల్ఫిన్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. పశ్చిమ ఫ్లోరిడాలో శత్రు నౌకలపై దాడి చేసేందుకు డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చారు.

అలాగే, సముద్రంలో అణు జలాంతర్గాములను గుర్తించడం లేదా రేడియోధార్మిక ఆయుధాలను గుర్తించడం డాల్ఫిన్లకు నేర్పించారు.

1967 నుంచి సీఐఏ ఒక మూడు కార్యక్రమాలపై 6, 00,000 డాలర్ల (రూ. 4.5 కోట్లు ) కంటే కంటే ఎక్కువ ఖర్చు చేస్తోంది. ఇందులో డాల్ఫిన్లు, పక్షులు, కుక్కలు, పిల్లులను కూడా వినియోగిస్తున్నారు.

ఖైదీలతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు

అమెరికా మాజీ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో సీఐఏపై, ఖైదీలతో అసభ్యంగా ప్రవర్తించిందనే ఆరోపణలు వచ్చాయి.

ఖైదీలను విచారించడానికి చీకటికోట్టును ఉపయోగిస్తుందని అమెరికా సెనేట్ ఒక నివేదికలో పేర్కొంది. ఖైదీలను చల్లటి నీళ్లల్లో ముంచడం, తల గోడకేసి కొట్టడం లాంటి పద్ధతులు అవలంబిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

సీఐఏ కార్యకలాపాలను పరిశోధించడానికి 2009లో ఒక దర్యాప్తు నిర్వహించారు. ఈ దర్యాప్తు ఆధారంగా అమెరికా సెనేట్ పై నివేదికను తయారుచేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Indo American Nand Mool Chandani appointed as CIA
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X