వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: కరోనావైరస్ మొదటి వేవ్‌లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న నర్సులు ఇప్పుడెలా ఉన్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనా వైరస్

కోవిడ్-19 పై పోరాటంలో ప్రపంచ వ్యాప్తంగా నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు. కానీ, దానివల్ల వారు శారీరకంగా, మానసికంగా ఎంతో నష్టపోయారు.

మహమ్మారి మొదటిసారి విరుచుకుపడినప్పుడు ఇటలీలోని కొందరు నర్సులు, వైద్య సిబ్బందితో బీబీసీ మాట్లాడింది. అప్పుడు వారు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. గత ఏడాది వారికెన్నో గాయాలను మిగిల్చింది. వాళ్లు ఇప్పుడెలా ఉన్నారు? అప్పటి గాయాల నుంచి బైటపడటానికి వారు ఏం చేశారు? అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా బీబీసీ మళ్లీ వారితో మాట్లాడి అందిస్తున్న ప్రత్యేక కథనం.

'చూసిన ప్రతి దృశ్యాన్ని చిత్రీకరించాను''

''నేను తిరిగి మామూలు జీవితంలోకి వస్తానని అనుకోలేదు'' అన్నారు పాలో మిరాండా. ఆయన క్రిమోనాలోని ఓ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో పని చేశారు.

ఐసీయూలో హెల్త్ కేర్ వర్కర్ల దారుణ స్థితిగతులను ఆయన తన కెమెరాలో బంధించారు.

మొదటి వేవ్‌ తర్వాతి పరిణామాలను తన స్నేహితులు ఎలా ఎదుర్కొంటున్నారో మిరండా తన ఫొటోల ద్వారా చూపించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని, ప్రజలు మమ్మల్ని హీరోలుగా చూడటం మానేశారని ఆయన చెప్పుకొచ్చారు.

''మేం ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నామో మరిచిపోలేం. ఇది త్వరలో చరిత్ర అవుతుంది'' అని అప్పట్లో బీబీసీతో అన్నారాయన.

''ఇప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితులు లేవు. మేం మరుగున పడిపోయాం'' అని ఆయన చెప్పారు.

మొదటి వేవ్ తర్వాత ఆయనలో వచ్చిన ప్రధానమైన మార్పు తండ్రి కావడం. '' మా పాప పేరు విక్టోరియా. విక్టరీకి సింబల్‌గా ఆ పేరు పెట్టుకున్నాం.అత్యంత దారుణమైన పరిస్థితు నడుమ ఆమె ఆశా కిరణంలా జన్మించింది'' అన్నారు మిరాండా.

గత ఏడాది అనుభవించిన ఇబ్బందుల కారణంగా తాము పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్‌డి)లో ఉన్నానని మిరాండా వెల్లడించారు. ఇలాంటి సమయంలోనే పిల్లల్ని కనడం మంచిదని ఆయన మిత్రులు చాలామంది సూచించారట.

ఒక పక్క మృత్యువుతో పోరాడుతూ మేమంతా ఎన్నో బాధలు అనుభవించామని మిరాండా అన్నారు.

''నేను నా బాధ నుంచి విముక్తం కావడంలో నా కూతురు ఎంతో సాయపడింది. నా పాప చూపులు, నవ్వులు...అద్భుతంగా ఉంటాయి. ఎంత బాధనైనా మరచిపోయేలా చేస్తాయి'' అన్నారాయన.

కరోనా వైరస్

'ఇది నా విజయం'

2020 ఫిబ్రవరి నాటికి ఇటలీ కరోనా మహమ్మారికి కేంద్ర బిందువుగా మారింది. కరోనా తీవ్రతకు ఇటలీ ఆరోగ్య వ్యవస్థ కూడా కుప్పకూలింది.

ఆ సమయంలో మార్టీనా బెండెట్టి టస్కానీలోని ఓ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ నర్స్‌గా పని చేస్తున్నారు. తాను ఇలాంటి పరిస్థితుల్లో నర్సుగా సేవలందిస్తానని ఊహించలేదని ఆమె అన్నారు.

కరోనా తర్వాత ఈ ఉద్యోగం ఒక అద్భుతంగా భావించానని, కానీ, ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చని ఆమె అన్నారు. ''నేను అంతకు ముందు ఓ పదేళ్ల పిల్లలాగా చాలా సరదాగా ఉండేదాన్ని. కానీ, ఇప్పుడు నాలో ఆ మనిషి లేదు'' అన్నారామె.

తన మనసుకు తోచిన భావాలన్నింటినీ ఆమె పేపర్ మీద పెట్టారు. విధుల నుంచి ఇంటికెళ్లిన తర్వాత పడుకోబోయే ముందు తనలో ఆ రోజు కలిగిన భావాలన్నిటినీ రాశారు. త్వరలో దాన్ని ఈ-బుక్ రూపంలో తీసుకురావాలని ఆమె భావిస్తున్నారు.

కోవిడ్ అనేది ఒకటి ఉంటుందని ఒప్పుకోని వారిని చాలామందిని చూశానని, వారికి సేవలందించడం చాలా కష్టమని, వారిలో కొందరు చనిపోయారని కూడా ఆమె తెలిపారు.

''నా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స తీసుకుంటూ, మాస్కులు పెట్టుకోవద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని చూశాను. నర్సులను, డాక్టర్లను అబద్ధాల కోరులుగా విమర్శించే వారు'' అని గుర్తు చేసుకున్నారామె.

కొన్నిసార్లు వాళ్ల మనసులు మార్చడానికి ప్రయత్నించానని మార్టీనా వెల్లడించారు.

''కోవిడ్ అస్తిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఓ పేషెంట్ తరచూ నాతో వాదించేవారు. తర్వాత ఆయన డిశ్ఛార్జ్ అయి వెళ్లాక, తనతో చేసిన వాదనలన్నింటికీ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇది నేను సాధించిన విజయం'' అన్నారామె.

కరోనా వైరస్

'నాకిన్నాళ్లు ఈ శక్తి ఉందని తెలియలేదు.'

తాము సేవలు చేస్తున్న రోగులను రోజూ పలకరించడం, క్షేమసమాచారాలు కనుక్కోవడం కారణంగా నర్సులలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్‌డీ), అలసట తక్కువ స్థాయిలలో ఉన్నాయని ఎంగేజ్‌మైండ్స్ హబ్ రిసెర్చ్ సెంటర్ ఇటలీలోని నర్సులపై జరిపిన అధ్యయనంలో తేల్చింది.

"రోగులను, వారి బంధువులను భారంగా పరిగణించేవారిలో అత్యవసర సమయాల్లో స్పందించే గుణం తక్కువగా ఉంటుందని" అధ్యయన కర్తల్లో ఒకరైన డాక్టర్ సెరెనా బోరెల్లో తెలిపారు.

కరోనా వైరస్

"రోగులతో మాట్లాడేందుకు సమయం వెచ్చిస్తూ, వారి బాధ్యతలు, బాధలు, సంతోషాలు పంచుకుంటూ మానవతా దృక్పథంతో స్పందించేవారికి అదొక బరువులా అనిపించదు. రోగులకు సేవలు చేయడం సులభమవుతుంది" అని అన్నారు.

కొందరు ఆరోగ్య కార్యకర్తలపై జరిపిన పరిశోధనలో 90% మంది కరోనా సమయంలో తమ ఉద్యోగాలను వదిలేయాలని గానీ, బదిలీ చేయించుకోవాలని గానీ కోరుకోలేదని చెప్పారు.

అంతేకాకుండా, రోగులకు సేవలు అందించడంలో గొప్ప గర్వం, సంతృప్తి కలిగాయని వారు తెలిపారు. కేర్ హోం డాక్టర్ ఎలిసా నానినో కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

"నేను సరైన ఉద్యోగంలో ఉన్నానని ఈ మహమ్మారి నాకు తెలియజెప్పింది. నాలో ఇంత శక్తి ఇందని నాకే తెలీదు. రోగులు చనిపోతుంటే ఏడ్చాను. కానీ, మరెంతోమంది మంది రోగుల ప్రాణాలు కాపాడగలిగాను. ఆ భావన వెలకట్టలేనిది" అని ఎలిసా చెప్పారు.

విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి వెళ్లాక కూడా అదే ధ్యాస ఉండేదని, వంట చేయడం కొంత ఉపశమనాన్ని కలిగించేదని ఎలిసా చెప్పారు.

తాము కాపాడలేక పోయిన వారి గురించి అపరాధ భావం ఉంచుకో వద్దని ఆరోగ్య కార్యకర్తలకు ఆమె సలహా ఇస్తున్నారు.

"మహమ్మారి సమయంలో మీ దగ్గరకు వచ్చిన వాళ్లందరినీ కాపాడడం అసాధ్యం. మీరు శాయశక్తులా కృషి చేయండి. కానీ ఇంటికి వెళిపోయిన తరువాత ఆ బాధ మిమ్మల్ని వెంటాడకుండా చూసుకోండి."

తన కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ తన బాధను పంచుకోలేకపోయానని మార్టినా అన్నారు. తన మానసికావస్థ వాళ్లకు అర్థం కాలేదని, ఆ సమయంలో తన సహోద్యోగులే అండగా నిలిచారని ఆమె చెప్పారు.

"ఈ సంక్షోభంలో పనిచేస్తున్న నర్సులందరికీ నాదొక్కటే సలహా...అందరూ కలిసి ఒక బృందంగా పనిచేయండి. మీరు బాధపడుతున్నప్పుడు దాన్ని దాచేయడం అనేది ఏ రకంగానూ ఉపయోగపడదు.

దానివల్ల మీ సమయం మరింత వృథా అవుతుంది. మీరొక్కరే బాధను జయించాలి అనుకోకండి. మీ సహోద్యోగులతో మాట్లాడండి. బహుశా వాళ్లు, మీరు ఒకే పడవలో ప్రయాణిస్తూ ఉండవచ్చు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, బాధలు పంచుకోవడం వలన మీరంతా దాని నుంచి బయటపడవచ్చు" అని మార్టినా అంటున్నారు.

కరోనా వైరస్

'మానసిక శాంతి'

కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది డాక్టర్లు, నర్సులు పీటీఎస్‌డీకి గురయ్యే అవకాశం ఉందని, దాని వలన నెలలు, సంవత్సరాల తరబడి బాధ పడాల్సి రావొచ్చని డాక్టర్ బారెల్లో ఆందోళన వ్యక్తం చేశారు.

"జరిగినదాని గురించి తలుచుకుని, ఆలోచిస్తే మీకు చాలా బాధగా అనిపించవచ్చు. నిస్సత్తువ ఆవరిస్తుంది. ప్రపంచం ముందుకు వెళిపోతుంటుంది. ఇంతవరకూ జరిగినదాని భారమంతా మీ మీద పడుతుంది. అది మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది" అని బారెల్లో అన్నారు.

ఆస్పత్రుల్లో నర్సులకు మానసిక బలన్ని చేకూర్చేలా థెరపీలు అందించాలని ఆమె అంటున్నారు.

మహమ్మారి కారణంగా దూరమైపోయిన వారి వ్యక్తిగత జీవితాలను పునరుద్ధరించుకునే అవకాశం కలిగించాలని.. కుటుంబ సభ్యులతో గడపడం, స్పోర్ట్స్ , తమ అభిరుచులను పెంపొందించుకోవడంలాంటివి చేసే అవకాశం కల్పించాలని బారెల్లో అభిప్రాయపడ్డారు.

మార్టినా ఇదే చేయాలనుకుంటున్నారు.

"నా భర్తతో కలిసి పర్వతాల్లో సంచరించాలని ప్లాన్ చేస్తున్నా. ప్రకృతి ఒడిలో, అందరికీ దూరంగా, ప్రశాంతంగా ఉండే చోటుకి వెళ్లి రావాలి" అని ఆమె అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
International Nurses' Day: How many nurses are there now who have suffered in the covid first wave
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X