యువకులకు వలేసి.. 10 పెళ్లిళ్లు చేసుకున్న యువతి: కేసు నమోదు
టెహ్రాన్: పది మంది యువకులకు వలేసి.. వారితో వివాహం చేసుకుని మోసం చేసిన ఓ ఇరాన్ యువతి(20)పై కేసు నమోదైంది. ఈ ఘటన ఇరాన్ దేశంలో చోటు చేసుకుంది. గడిచిన రెండేళ్లలో ఆమె పది మందితో పది పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా వారికి విడాకులిచ్చి, వారి నుంచి అధిక మొత్తంలో కన్యాశుల్కం రాబట్టింది.
వివరాల్లోకి వెళితే.. ఇరాన్‌లో 1979 నుంచి షరియా చట్టం అమలులో ఉంది. దీని ప్రకారం వరుడు వధువు కన్యాశుల్కం ఇవ్వాలి. వివాహానంతరం వధువు ఎప్పుడు కోరితే అప్పుడు వరుడు దీనిని చెల్లించాలి. అయితే దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ యువతి పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆపై డబ్బులు కోరడం పరిపాటిగా పెట్టుకుంది.

ఇలా పది మందిని పెళ్ళిళ్లు చేసుకుని విడాకులు ఇచ్చింది. ఇరాన్‌లో విడాకులు తీసుకున్న మహిళ గుర్తింపు కార్డుపై పేరు మార్చుకోవాలంటే కన్య అని నిరూపించుకోవాల్సి ఉంది. దీనిలో భాగంగానే పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రతీసారి గుర్తింపు కార్డులో పేరు కోసం స్థానిక కార్యాలయానికి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు ఆమెపై కే నమోదు చేశారు.
కాగా, తనకు ఏమి తెలియదని, అమాయకురాలినని సదరు యువతి తెలిపింది. తాను చేసుకున్న వివాహాలన్నీ కూడా చట్టబద్ధమేనని పేర్కొంది. తన భర్తలందరూ వారి ఇష్ట పూర్వకంగానే తనను వివాహం చేసుకున్నారని, ఆ తర్వాత విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నట్లు చెప్పింది. కాగా, మోసానికి పాల్పడిన ఆ యువతిపై కోర్టులో క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications