ఇరాన్ సంక్షోభంలో బిగ్ ట్విస్ట్..! ఆగిన నిరసనలు, ట్రంప్ యూటర్న్..!
ఇరాన్ లో కొంతకాలంగా అక్కడి సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆర్ధిక ఆస్ధిరతతో పాటు ఇతరత్రా కారణాలతో ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్ వ్యాప్తంగా జనం రోడ్లపైకి వచ్చారు. ఇదే అదనుగా ఎప్పుడో 90వ దశకంలో దేశం విడిచి పారిపోయిన షాల వారసుడు పహ్లావీ ఎక్కడో లండన్ లో ఉంటూ నిరసనల్ని ఎగదోశారు. ఇదే క్రమంలో ఖమేనీపై ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా రంగంలోకి దిగారు. ఇక అమెరికా ఇరాన్ పై యుద్దానికి దిగడమే ఆలస్యం అన్నట్లు పరిస్ధితి మారిపోయింది. దీంతో భారత్ కూడా ఇవాళ్టి నుంచి తమ పౌరుల్ని ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు సిద్ధమైంది.
కానీ ఉన్నట్లుండి పరిస్ధితి మారిపోయింది. అటు ఇరాన్ లో గత వారం రోజులుగా ఉధృతంగా పోరాటాలు చేస్తున్న నిరసనకారులు సడన్ గా వెనక్కి తగ్గారు. ఇది చూసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వెనక్కి తగ్గారు. నిత్యం ఇరాన్ పై విమర్శలకు దిగుతూ యుద్ధ హెచ్చరికలు చేస్తున్న ట్రంప్ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. దీంతో తెరవెనుక ఏం జరిగిందన్న చర్చ మొదలైంది. ఇదే వాతావరణం కొనసాగితే త్వరలోనే యుద్ద మేఘాలు తొలగిపోవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.

ఇలా ఇరాన్ లో నిరసనకారులు, ట్రంప్ కూడా వెనక్కి తగ్గడం వెనుక ప్రధాన కారణం గల్ఫ్ దేశాల దౌత్యమేనని తెలుస్తోంది.
ఇరాన్ లో నిరసనల్ని సాకుగా చూపిస్తూ ఆ దేశంపై దాడికి దిగేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలకు గల్ఫ్ దేశాలైన ఈజిప్ట్, ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్ అడ్డుకట్ట వేశాయి. ట్రంప్‌ను ఇరాన్‌పై దాడి ప్రయత్నాలు విరమించుకోవాలని కోరాయి. అమెరికా దాడికి దిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం పడుతుందని ఆందోళనలు వ్యక్తం చేశాయి.

అదే సమయంలో మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులకు దిగడం మంచిది కాదని ఖమేనీకి స్పష్టం చేశాయి. దీంతో పాటు ఇరాన్ లో అంతర్గత పోరు వల్ల శత్రువుకు అవకాశం ఇవ్వొద్దంటూ నిరసనకారుల్ని సైతం ఒప్పించాయి. దీంతో వారు కూడా ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు. ఇన్నాళ్లూ ఇరాన్ ప్రభుత్వం తమపై ఉక్కుపాదం మోపుతున్నా వెనక్కి తగ్గని నిరసనకారులు ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఎంటరై దౌత్యం చేయడంతో ఆందోళనలు విరమించుకున్నారు. దీంతో పశ్చిమాసియా ఊపిరిపీల్చుకుంటోంది.












Click it and Unblock the Notifications