Iran Vs Israel: ఇజ్రాయెల్ పై భీకర దాడులకు ప్లాన్ ! ఇరాన్ హింట్- అమెరికా అలర్ట్..!
హమాస్ అగ్ర నేతలను వరుసగా హతమారుస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్న ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో ఉద్రిక్తలను రాజేస్తోంది. ఇజ్రాయెల్ తీరుపై మండిపడుతున్న అరబ్ దేశాలు తాము నేరుగా కాకుండా పరోక్షంగా మద్దతిస్తున్న తీవ్రవాద గ్రూపులతో ఆ దేశంపై భీకర దాడులు చేయించేందుకు సిద్దమవుతున్నాయి. దీంతో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. ఈ మేరకు అమెరికా సాయం కూడా కోరింది. దీంతో అగ్రరాజ్యం కూడా దాడుల్ని తిప్పికొట్టేందుకు సిద్దమవుతోంది.
ఇజ్రాయెల్ పై గతేడాది హమాస్ దాడులతో మొదలైన ఉద్రిక్తల పర్వం ఇప్పుడు పరాకాష్టకు చేరబోతోంది. హమాస్ పై దాడుల సాకుతో పాలస్తీనా భూభాగాల్లోకి చొరబడి భారీ ఎత్తున అమాయక ప్రజల్ని హతమార్చిన ఇజ్రాయెల్ తీరుపై ఐరాస సహా అరబ్ దేశాలన్నీ ఆగ్రహంగా ఉన్నాయి. ఇప్పటికే అరబ్ దేశాల మద్దతున్న హమాస్, హౌతీ రెబెల్స్, హెజ్బొల్లా గ్రూపులు ఇజ్రాయెల్ పై రాకెట్లు ప్రయోగిస్తూనే ఉన్నాయి. మధ్యలో ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై పరిమితంగా మిసైళ్లను ప్రయోగించింది.

అయితే తాజాగా హమాస్ అగ్రనేతలైన మిలటరీ కమాండర్ మొహమ్మద్ డెయిఫ్ ను గాజాలోనే హతమార్చిన ఇజ్రాయెల్ దళాలు, పొలిటికల్ ఛీఫ్ ఇస్మాయిల్ హనియేను ఇరాన్ లోకి చొరబడి మరీ అక్కడి రివల్యూషనరీ గార్డ్స్ సాయంతోనే చంపేశాయి. దీనిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఆ తర్వాత హెజ్బోల్లా కమాండర్ ఫౌద్ షుక్ర్ ను సైతం ఇజ్రాయెల్ చంపేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సంగతి తేల్చేయాలని నిర్ణయించిన ఇరాన్ సహా అరబ్ దేశాలు తాము నేరుగా ఎంట్రీ ఇవ్వకుండా తీవ్రవాద గ్రూపుల్ని రంగంలోకి దించుతున్నాయి.
ఇజ్రాయెల్ పై ఈసారి లోతైన దాడులకు హెజ్బొల్లా సిద్దమవుతున్నట్లు తమకు సమాచారం ఉందని ఇరాన్ ఇవాళ ప్రకటించింది. ఈ దాడులు మిలటరీ స్థావరాలకు పరిమితం కాకుండా ఇజ్రాయెల్ లో సామాన్యులను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో ఇజ్రాయెల్ పై భీకర దాడులు తప్పేలా లేవు. ఈ నేపథ్యంలోనే భారత్ సహా ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ లో ఉన్న తమ పౌరుల్ని అలర్ట్ చేయడంతో పాటు ఆ దేశానికి విమానాల రాకపోకల్ని రద్దు చేస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ పై దాడుల్ని తిప్పికొట్టేందుకు అమెరికా సిద్దమవుతోంది. దీంతో పశ్చిమాసియా అగ్నిగోళంగా మారనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications