వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులకు ఒలింపిక్స్ కారణమా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఒలింపిక్ స్టేడియం

ఒలింపిక్ క్రీడల వేదిక జపాన్‌లో గురువారం కోవిడ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదయింది.

దీంతో ఒలింపిక్ బబుల్‌లో ఆందోళన పెరుగుతోంది.

అల్పాహారం గదిలోకి తీసుకెళ్లేందుకు ఆహార పదార్థాలను చూస్తుండగా హోటల్ క్లర్క్ నా దగ్గరకు వచ్చి "భోజనం దగ్గర నెమ్మదిగా మాట్లాడండి" అని చెప్పారు.

టోక్యోలో అమలులో ఉన్న కోవిడ్ నిబంధనల కారణంగా జపాన్‌లో 14 రోజులుండి, రోజువారీ పీసీఆర్ పరీక్షలు పూర్తయ్యేవరకు విలేఖరులెవరూ రెస్టారెంట్‌లో కూర్చుని తినడానికి అనుమతి లేదు.

నేను మాస్కు వేసుకున్నప్పటికీ, బఫె దగ్గర నా గొంతు వినపడడం పట్ల అక్కడున్న సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకవైపు కోవిడ్ సమయంలో ఒలింపిక్స్ నిర్వహిస్తూ, మరోవైపు పెరుగుతున్న కేసులను నియంత్రిస్తూ, సురక్షితంగా ఉండటానికి జపాన్ ప్రజలు ఎంత సంఘర్షణ పడుతున్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

టోక్యో

టోక్యోలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలులో లేదు

ఒలింపిక్స్ వేదికగా ఉన్న టోక్యో.. మహమ్మారి మొదలయినప్పటి నుంచి నాలుగవ దశ అత్యవసర పరిస్థితిలో ఉంది. అయితే లాక్‌డౌన్ పూర్తిగా అమలులో లేదు.

ఉదాహరణకు రాత్రి 8 గంటల తర్వాత రెస్టారెంట్లలో మద్యం సెర్వ్ చేయకూడదు. కానీ ఇది తప్పనిసరి కాదు.

నిబంధనల అమలును స్వచ్చందంగా పాటించాలనే ఆదేశాల పట్ల చాలా మంది స్థానికులు అలిసిపోయి ఉన్నారు.

కానీ కోవిడ్ సమయంలో క్రీడలు నిర్వహించడం ప్రజలను అయోమయానికి గురి చేసింది.

మైనిచి సిన్బున్ పత్రిక కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

క్రీడల నిర్వహణతో ముందుకు వెళ్లడంతో ఇన్ఫెక్షన్ నివారణ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోనక్కరలేదనే అభిప్రాయంలోకి ప్రజలను తోసేసింది.

జపాన్‌లో గురువారం తొలిసారిగా 10,000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

జులై 1న ఒలింపిక్ సిబ్బంది టోక్యోలో అడుగు పెట్టినప్పుడు జపాన్‌లో రోజువారీ కేసులు 700 కంటే తక్కువగా ఉన్నాయి.

"కోవిడ్ మొదలయినప్పటి నుంచి చూస్తే ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. ఈ స్థితి పట్ల ప్రజలకు అర్థమయ్యే రీతిలో అత్యవసర సందేశాన్ని ఇవ్వవలసి ఉంది" అని ప్రభుత్వ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధిపతి డాక్టర్ షిగేరు ఓమి హౌస్ ఆఫ్ కౌన్సిలర్స్ క్యాబినెట్ కమిటీకి చెప్పారు.

"ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరగడానికి చాలా కారణాలుంటాయి. ప్రజలు కరోనావైరస్‌తో అలిసిపోయి ఉన్నారు. ఒకవైపు డెల్టా వేరియంట్ భయం నెలకొనగా, మరోవైపు ఒలింపిక్స్ జరుగుతున్నాయి" అని అన్నారు.

"అయితే ఈ అత్యవసర పరిస్థితిని మాత్రం సమాజం సరైన రీతిలో అర్థం చేసుకోకపోవడమే అతి పెద్ద సంక్షోభం. ఇదే పరిస్థితి కొనసాగితే, మహమ్మారి మరింత దారుణంగా మారుతుంది" అని అన్నారు.

టోక్యో

"వార్తలు వింటుంటే, భయంగా ఉంటోంది"

జపాన్ గెలుచుకుంటున్న పతకాల సంఖ్య పెరుగుతోంది. కానీ పెరుగుతున్న కోవిడ్ కేసులు జపనీయులను క్రీడలను ఆస్వాదించకుండా చేస్తున్నాయి.

ఒలింపిక్ క్రీడా వేదికకు దగ్గరలో ఉన్న చిన్న పార్కులో ప్రజలు ఫోటోలు తీసుకోవడానికి రావచ్చు. కానీ క్రీడలను ఆస్వాదించడం కష్టంగా ఉంటోందని, నేషనల్ స్టేడియం అవతల ఉన్న ఒక పార్క్‌లో ఫోటోలు తీసుకుంటున్న యషిమిటో యూకో అన్నారు.

"మాకు వేడుక చేసుకోవాలని ఉంది. కానీ కోవిడ్ వార్తలు వినేసరికి మాకు ఆందోళనగా ఉంటోంది" అని అన్నారు.

ఒలింపిక్ సిబ్బంది, క్రీడాకారులు, విలేఖరులు నివసిస్తున్న ఒలింపిక్ బబుల్‌లో మాత్రం కేసులు అదుపులోనే ఉన్నాయి.

ఇక్కడ వైరస్‌ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు, ఒలింపిక్ నిర్వాహకులు రూపొందించిన "ప్లే బుక్"లో నియమాలను ఇక్కడుండే అందరూ కచ్చితంగా పాటించాలి.

ఈ నిబంధనలను పాటిస్తానని చెప్పే తీర్మానంపై విలేఖరులు సంతకం చేయాలి లేదా వారి గుర్తింపును రద్దు చేస్తారు.

అలాగే క్రీడాకారులందరూ తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, శిక్షణ తీసుకుంటున్నప్పుడు, పోటీ పడుతున్నప్పుడు తప్ప మిగిలిన అన్ని సమయాల్లో మాస్క్ వేసుకోవాలి.

ఒలింపిక్స్ కోసం జపాన్ వెళుతున్న వారందరూ జీపీఎస్ ద్వారా వ్యక్తుల కదలికలను, వారు కలిసిన వ్యక్తుల వివరాలను తెలియచేసే యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

అలాగే రోజువారీ ఆరోగ్య నివేదికను కూడా సమర్పించాలి.

కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిన వారితో దగ్గరగా మెలిగిన వారు కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లాలి.

ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ సోకిన యూఎస్ పోల్ వాల్టర్ స్యామ్ కెండ్రిక్స్‌తో దగ్గరగా మెలిగిన ఆస్ట్రేలియా ట్రాక్, ఫీల్డ్ టీం అందరూ తమ తమ గదుల్లో ఐసోలేషన్‌లోనే ఉన్నారు.

ఒలింపిక్ క్రీడలతో సంబంధం ఉన్న మరో 16 మందికి కోవిడ్ సోకినట్లు ఒలింపిక్ కమిటీ తెలిపింది. దీంతో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 174కు చేరుకుంది.

టోక్యో

అయితే, జపాన్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులకు ఒలింపిక్స్ కారణమనే భావన ఉంది. అలాగే ఒలింపిక్ బబుల్‌లో విధించిన ప్లే బుక్ నిబంధనలను సరిగ్గా పాటించడం లేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

"ఇప్పటికే క్రీడలు మొదలయిపోవడంతో నిబంధనలను పాటించడం పట్ల క్రీడాకారులు, ఇతరులు అవలంబిస్తున్న వైఖరి అందరికీ కనిపిస్తోంది" అని మైనిచి షిమ్బున్ కథనంలో పేర్కొంది.

పోటీ వేదికల దగ్గర క్రీడాకారులు ఒకరినొకరు హత్తుకోవడం, కొన్నిచోట్ల కొంత మంది క్రీడాకారులను ఉత్సాహపరించేందుకు మాస్కులను పూర్తిగా తొలగించడం లాంటి పనులను చేస్తున్నారని కూడా పత్రిక తన కథనంలో తెలిపింది.

అయితే, టోక్యోలో కేసులు పెరగడానికి ఒలింపిక్ క్రీడలు కారణం కాదని ఒలింపిక్ కమిటీ ప్రతినిధి మార్క్ ఆడమ్స్ అన్నారు.

"ప్రపంచంలోనే ఎక్కడా లేనంతగా పరీక్షలు నిర్వహించిన సిబ్బంది ఇక్కడ ఉన్నారు. అలాగే అథ్లెట్స్ విలేజ్‌లో అత్యంత కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు ఉన్నాయి" అని ఆయన అన్నారు.

"నిజానికి ఇక్కడ అందరూ మరో సమాంతర ప్రపంచంలో నివసిస్తున్నారు. ఇక్కడేమైనా సమస్యలు తలెత్తితే, మేము వాటిని చూసుకుంటాం. నాకు తెలిసినంత వరకూ క్రీడాకారుల నుంచి గానీ, ఒలింపిక్ సిబ్బంది నుంచి గాని, ఒక్క ఇన్ఫెక్షన్ కూడా స్థానికులకు సోకలేదు" అని అన్నారు.

"క్రీడాకారుల్లో కూడా తీవ్రమైన కోవిడ్ లక్షణాలు ఎవరికీ కనిపించలేదు" అని అన్నారు.

టోక్యో పోడియం

"మరే దేశమూ మా కంటే మెరుగ్గా నిర్వహించలేదు"

బబుల్‌లో ఉన్న క్రీడాకారులెవరూ ఇక్కడ అమలు చేసిన నిబంధనల పట్ల ఫిర్యాదులు చేయలేదు.

"ఈ కొత్త కోవిడ్ ప్రపంచానికి అలవాటు పడిపోయాం. మహమ్మారి సమయంలో నిర్వహించే అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు ఈ కొత్త బబుల్ విధానం ఒక తప్పనిసరి విషయంగా మారింది" అని ఈక్వెడార్ సిబ్బందితో వచ్చిన వైద్యుడు పాబ్లో సార్మియెంటో అన్నారు.

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జపాన్ నిర్వాహకులు అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. వాళ్ల ప్రణాళికలన్నీ మార్చుకున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని జాగ్రత్తగా చూడటం ప్రశంసించదగ్గ విషయం" అని ఆయన అన్నారు.

ఇలాంటి అభిప్రాయాన్నే ఇతరులు కూడా వ్యక్తం చేశారు.

ఇంత కంటే మెరుగ్గా మరే దేశమూ చేయగలిగి ఉండేది కాదు. మేమీ విషయంలో జపాన్‌కు కృతజ్ఞుతలు చెబుతున్నాం అని కాంస్య పతకాన్ని గెలుచుకున్న అర్జెంటీనా రగ్బీ బృందంలో సభ్యుడు సాంటియాగో ఆల్వరేజ్ అన్నారు.

టోక్యో కోవిడ్

"ఇంట్లోనే ఉండి టీవీ చూడండి"

కేసులను అదుపులో ఉంచడానికి ప్రతిరోజూ పీసీఆర్ పరీక్షలు, పరిసరాలను శానిటైజ్ చేయడం లాంటి అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నారనే విషయంలో ఎటువంటి సందేహమూ లేదు. ఖాళీగా ఉన్న స్టేడియంలలో కూడా అందరినీ మాస్కులు ధరించమని, భౌతిక దూరం పాటించమని పదే పదే చెబుతున్నారు.

పతకాలు గెలుచుకున్న క్రీడాకారులు పోడియం మీద నిల్చుని ఉండగా, ఆయా దేశాల జాతీయ గీతాలను ప్లే చేసినప్పుడు 30 సెకండ్ల పాటు ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే మాస్కులను తొలగించడానికి ఒలింపిక్ కమిటీ అనుమతిస్తోంది.

రోజులు గడుస్తున్న కొలదీ హోటల్ దగ్గర విలేఖరులు ఉండటాన్ని సాధారణంగా చూస్తున్నారు. కాపలా ఉండే గార్డులు కూడా మాతో కాస్త స్నేహభావంతో మెలుగుతున్నారు.

కానీ, నియమాలను ఉల్లంఘించేందుకు మాత్రం ఎవరికీ అనుమతి లేదు. పరిస్థితిని గుర్తు చేస్తూ నియమాలను పాటించమని మర్యాదగా, కచ్చితంగా చెబుతున్నారు. జపాన్‌లో 26 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయింది.

అయితే ముందు ముందు పరిస్థితులు విషమించవచ్చనే భయాన్ని టోక్యో మెడికల్ అసోసియేషన్ వైస్ చైర్మన్ టోరు కకుటా వ్యక్తం చేశారు. ఊహించిన దాని కంటే, ప్రస్తుతం హాస్పిటల్ బెడ్స్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉందని అన్నారు. ఆక్సిజన్ అవసరమైన రోగుల సంఖ్య పెరిగిందని చెప్పారు.

ఇంట్లోనే ఉండి టీవీలో ఒలింపిక్స్‌ను చూడమని జపాన్ ప్రధాని మంగళవారం విజ్ఞప్తి చేశారు.

అదనపు రిపోర్టింగ్: ఎడ్డీ డువాన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Is the Olympics to be blamed for the growing number of Covid cases in Japan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X