విదేశీ మహిళలపై గ్యాంగ్ రేప్.. పాక్ ఉప ప్రధాని బంధువు అరెస్ట్..!
పాకిస్థాన్ లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. లాహోర్ లో విదేశీ మహిళలపై గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగమంత్రి ఇషాక్ దార్ సమీప బంధువు అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మొహమ్మద్ రజా దార్, హసన్ రజా, సికందర్ ఖాన్, సాజిద్ అలీగా గుర్తించారు. లాహోర్ కోర్టు నిందితుల్ని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశించింది. ఈ కేసులో ఐదో నిందితుడు పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ ఘటనపై పాకిస్థాన్ సెనేటర్ ఫైసల్ వావ్ డా కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఉప ప్రధాని బంధువును పంజాబ్ ప్రభుత్వం కాపాడుతోందని కీలక ఆరోపణలు చేశారు. నెథర్లాండ్స్ కు చెందిన ఓ మహిళ అలాగే వెనిజులాకు చెందిన మరో మహిళను దుండగులు జూన్ 29 న కిడ్నాప్ చేసి లాహోర్ తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
గతేడాది సింగపూర్ లో ప్రధాన నిందితుడు మహ్మద్ రజా దార్ తో ఈ మహిళలకు పరిచయం ఏర్పడింది. వీరంతా క్రిప్టో కరెన్సీ వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో బిజినెస్ డీల్ లో భాగంగా వీరిని మహ్మద్ రజా పాకిస్థాన్ కు ఆహ్వానించాడు. ఈ మేరకు వారికి బిజినెస్ టికెట్స్ కూడా బుక్ చేశాడు. అతని మాటలు నమ్మిన మహిళలు లాహోర్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో దిగారు. అయితే వారిని ఎయిర్ పోర్ట్ లోనే కిడ్నాప్ చేసి లాహోర్ లోని రహస్య గృహానికి తరలించి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

ప్రాణాలతో బయటపడాలంటే భారీ మొత్తంలో నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆ దుండగులు. అయితే ఎట్టకేలకు అందులోని ఓ మహిళ తన తండ్రికి ఫోన్ కాల్ చేయడంతో అతను లాహోర్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఆ రహస్య గృహంపై దాడి చేసి మహిళలను రక్షించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడుగా ఉన్న మహ్మద్ రజాతోపాటు మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications