వారిది రక్తదాహం: కాబుల్ మారణహోమం వెనుక ఐసిస్-కే: భయానక ఉగ్రవాద సంస్థ కథేంటీ?
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న మారణహోమం అన్ని దేశాలను ఉలిక్కి పడేలా చేసింది. భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్-ఖొరాసన్ ప్రావిన్స్ (ISIS-K) ఈ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో కాబుల్‌లో సంభవించిన మరో బాంబుదాడిలో 60 మది మరణించారు. ఈ రెండు ఉదంతాలకు తామే బాధ్యులమంటూ ఐసిస్-కే ప్రకటించుకుంది.

మళ్లీ ఉగ్రవాదుల అడ్డాగా..
ఇన్నాళ్లూ అమెరికా, నాటో బలగాల చేతుల్లో ఒకింత సురక్షితంగా ఉంటూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన అతి కొద్దిరోజుల్లోనే ఈ దాడులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ ఉగ్రవాదుల అడ్డాగా మారిందనడానికి తాజాగా చోటు చేసుకున్న జంట పేలుళ్లు నిలువెత్తు ఉదాహరణలుగా నిలిచాయి. అదే సమయంలో దాడి జరిపేలా తాలిబన్లు వారికి సహకరించి ఉండొచ్చనే వార్తలు సైతం వెలువడ్డాయి. ప్రపంచ దేశాలకు- ప్రత్యేకించి అగ్రరాజ్యం అమెరికాకు ఓ హెచ్చరిక చేయడానికే ఈ మారణహోమానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఐసిస్-కే కథేంటీ?
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్.. ఇదివరకు ఇరాక్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకుని భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించిన సంస్థ. భారత్‌లో పలు రాష్ట్రాల్లో ఐసిస్ ఉగ్రవాద జాడలు కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రత్యేకించి- కేరళలో ఐసిస్ పేరు విస్తృతంగా వినిపించింది. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు పలుమార్లు కేరళలోని కాసర్‌గాడ్ జిల్లాలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

అదే ఐసిస్‌కు రైట్ హ్యాండ్‌గా
ఆ ఐసిస్‌కు రైట్ హ్యాండ్‌గా ఆవిర్భవించింది ఈ ఐసిస్-కే. ఇరాన్‌లోని ఖొరాసన్ ప్రావిన్స్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని తన కార్యకలాపాలను సాగిస్తోంది. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్‌లల్లో ఈ ఉగ్రవాద సంస్థ యాక్టివ్‌గా ఉన్నట్లు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యురో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంచనా వేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో యాక్టివ్‌గా ఉన్న అన్ని జిహాదీ గ్రూపుల కంటే అత్యంత భయానకం, ప్రమాదకారిగా దీన్ని పరిగణిస్తోంది.

2015లో ఆవిర్భావం..
2015 జనవరిలో ఐసిస్ ఖొరాసన్ ప్రావిన్స్ ఆవిర్భవించింది. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్‌లకు చెందిన పలువురు యువకులను జిహాదీలుగా మార్చింది. తన ప్రసంగాలతో వారిని ఆకట్టుకుంది. ఆత్మాహూతి దళాలుగా మార్చివేసింది. ఐసిస్ ఖొరాసన్ ప్రావిన్స్ జిహాదీల ప్రధాన లక్ష్యం- తాలిబన్లు. తాలిబన్లతో సమాంతరంగా ఎదగాలనేది ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదుల టార్గెట్. దీన్ని సమర్థవంతంగా అడ్డుకుంటూ వచ్చారు తాలిబన్ నాయకులు. అందుకే- తాలిబన్లు ఆప్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న అతి కొద్దిరోజుల్లోనే నరమేధానికి పాల్పడ్డారనే అంచనాలు ఉన్నాయి.
Recommended Video

నంగర్‌హర్ కేంద్రంగా..
ఆఫ్ఘనిస్తాన్ తూర్పు ప్రాంతంలోని నంగర్‌హర్ ప్రావిన్స్‌లో ఐసీస్-కే ఉగ్రవాదుల ప్రాబల్యం బాగా ఉంది. డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేయడం ఈ నెట్‌వర్క్ ప్రధాన బిజినెస్. తొలుత డ్రగ్స్, ఆ తరువాత మానవుల అక్రమ రవాణాకు పాల్పడుతూ వచ్చింది. పాకిస్తాన్‌కు అక్రమంగా మనుషులను రవాణా చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించేదిగా ఎఫ్‌బీఐ అభిప్రాయపడుతోంది. మొదట్లో మూడువేల మంది ఫైటర్లతో బలంగా ఉన్నప్పటికీ.. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల వల్ల భారీగా నష్టపోయింది. అమెరికా, నాటో బలగాల దాడుల్లో ఐసిస్-కే ఫైటర్లు పెద్దసంఖ్యలో హతమయ్యారు.

హక్కానీ నెట్‌వర్క్‌తో లింక్..
తాలిబన్ల ఉప అధినేత వ్యవహరిస్తోన్నాడు సిరాజుద్దీన్ హక్కానీ. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాడిన జిహాద్ కమాండ్ జలాలుద్దీన్ హక్కానీ కుమారుడే సిరాజుద్దీన్. తాలిబన్ డిప్యూటీ లీడర్‌గా కూడా పని చేస్తోన్నాడు. హక్కానీ నెట్‌వర్క్ చీఫ్ కూడా. ఈ నెట్‌వర్క్‌ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇదివరకు ఆప్ఘనిస్తాన్‌ను పహారా కాసిన అమెరికా సైనిక బలగాలను తన నెట్‌వర్క్ సహాయంతో ముప్పతిప్పలు పెట్టాడని చెబుతుంటారు.

మోస్ట్ డేంజరస్ లీడర్‌తో లింక్..
మోస్ట్ డేంజరస్‌గా అతనికి గుర్తింపు ఉంది. 2014లో అమెరికా సైనికులు బోవె బెర్గ్‌డల్ సహా ఆప్ఘన్ పశ్చిమ ప్రాంతానికి చెందిన పలువురిని కిడ్నాప్ చేయడం వెనుక అతని హస్తం ఉన్నట్లు పాకిస్తాన్‌కు చెందిన డాన్ మీడియా పేర్కొంది. అలాంటి కీలకమైన హక్కానీ నెట్‌వర్క్‌తో ఐసిస్-కే ఉగ్రవాదులకు బలమైన లింక్ ఉన్నట్లు ఎఫ్‌బీఐ అనుమానిస్తోంది. తాలిబన్లు ఆప్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తరువాత కారాగారం నుంచి విడుదల చేసిన ఖైదీల్లో ఐసిస్-కే ఫైటర్లు కూడా ఉన్నారని భావిస్తోంది.

బలం పెంచుకుంటోన్న ఐసిస్-కే
ఫుల్-ఎ-చర్కి కారాగారం నుంచి పెద్ద ఎత్తున ఇస్లామిక్ స్టేట్, అల్-ఖైదా ఉగ్రవాదులను తాలిబన్లు విముక్తి ప్రసాదించిన తరువాత.. కాబుల్ మారణ హోమం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. సంవత్సరాల పాటుగా కారాగారంలో మగ్గిన ఐసిస్- ఖొరాసిన్ ప్రావిన్స్ ఉగ్రవాదులు.. తమ ప్రతీకారాన్ని ఈ రూపంలో తీర్చుకుంటోన్నారనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. తాజాగా- ఆత్మాహూతిదాడికి పాల్పడిన ఉగ్రవాది కూడా కొత్తగా జైలు నుంచి విడుదలైన ఖైదీల్లో ఉండొచ్చని ఎఫ్‌బీఐ అనుమానిస్తోంది.

మరిన్ని దాడులకు ఛాన్స్
ఇదిలావుండగా.. ఐసిస్-కే ఉగ్రవాదులు కాబుల్ సహా ఇతర నగరాలు, జనసమ్మర్థ ప్రాంతాల్లో మరిన్ని దాడులు చోటు చేసుకునే ప్రమాదం ఉందంటూ అమెరికా, బ్రిటన్ హెచ్చరించాయి. ప్రత్యేకించి కాబుల్ విమానాశ్రయం వద్ద వేలాదిమందిగా గుమికూడిన ఆప్ఘనిస్తానీయులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడొచ్చని పేర్కొన్నాయి. సాధారణ పౌరులు ఎవరూ విమానాశ్రయం చుట్టుపక్కలకు వెళ్లకూడదని సూచించాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తమ దేశాల ప్రజలకు ఈ హెచ్చరిక జారీ చేశాయి.












Click it and Unblock the Notifications