మండుతున్న ఇజ్రాయెల్: భీకర యుద్ధం- ప్రతీకార దాడులు
Hezbollah-Israel War: ఊహించినట్టే- ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దండెత్తింది. భీకర యుద్ధానికి తెర తీసింది. డజన్ల కొద్దీ అత్యాధునిక కట్యూషా రాకెట్లను సంధించింది. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. ఎంతమంది మరణించి ఉండొచ్చనేది ఇంకా తెలియరావట్లేదు. ఈ ఘటనతో ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతం అట్టుడికిపోతోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పికొడుతోంది. హెజ్బొల్లా స్థావరాలపై భారీగా రాకెట్లను సంధించింది. లెబనాన్ భూభాగంపై కెఫార్ కిలా, డెర్ సిర్యాన్ ప్రాంతాలపై రాకెట్లను సంధించింది. ప్రతిదాడికి దిగింది. ఇజ్రాయెల్‌తో సరిహద్దులను పంచుకునే ప్రాంతాలు ఈ రెండు కూడా.

హెజ్బొల్లా.. లెబనాన్‌కు చెందిన షియా ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్. అక్కడ రాజకీయ పార్టీగానూ గుర్తింపు ఉంది. 1992లో హసన్ నష్రల్లా, అబ్బాస్-అల్-ముసావి, అలీ అక్బర్ మొహ్తా, సుభి అల్- తుఫాయిల్.. దీన్ని నెలకొల్పారు. మధ్య తూర్పు దేశాల్లో ఇస్లాంను మరింత బలంగా విస్తరించాలనేది దీని లక్ష్యం.
ఇరాన్.. హెజ్బొల్లాకు ముందు నుంచీ అన్నీ రకాలుగా సహాయ సహకారాలను అందిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికీ ఇరాన్ సైనిక, ఆయుధ సామాగ్రిని సమకూర్చిందని చెబుతున్నారు. తేలికపాటి రాకెట్లను మోసుకెళ్లే సామార్థ్యం ఉన్న అత్యాధునిక డ్రోన్లు, ఇతర ఆయుధాలను ఇదివరకే హెజ్బొల్లాకు అందించినట్లు అక్కడి మీడియా అంచనా వేసింది.
ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూమెంట్ హమాస్ రాజకీయ విభాగం అధినేత ఇస్మాయిల్ హనియా ఇటీవలే టెహ్రాన్‌లో దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఇస్మాయిల్‌తో పాటు ఆయన వ్యక్తిగత అంగరక్షకుడొకరు దుర్మరణం పాలయ్యారు. ఇస్మాయిల్ బస చేసిన ఓ భవనంపై గుర్తు తెలియని వ్యక్తులు భీకర దాడికి దిగారు. ఈ దాడి వెనుక ఇజ్రాయిల్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగొచ్చనే ఆందోళన మొదటి నుంచీ ఉంది. మధ్య తూర్పు దేశాల గగనతలాన్ని మూసివేశారు. ఇతర దేశాలకు చెందిన పౌర, సైనిక విమానాలు ఈ మార్గంలో ప్రయాణించకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అప్పట్లో భారత్ సైతం.. ఇజ్రాయెల్‌లో నివసించే తన దేశ ప్రజల కోసం అడ్వైజరీని ఇదివరకే జారీ చేసింది కూడా.
ఇస్మాయిల్ హనియా హత్యకు నిరసనగా హెజ్బొల్లా ఇప్పుడీ దాడులకు దిగింది. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన మెరాన్ క్యాంప్‌తో పాటు ఆక్రమిత గోలన్ హైట్స్‌లోని నాలుగు చోట్ల గల 11 సైనిక శిబిరాలు, బ్యారక్‌లపై 320కి పైగా కట్యూషా రాకెట్లను సంధించినట్లు హెజ్బొల్లా ప్రకటించింది.
ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి 12 కిలోమీర్ల వరకు గల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు సాగినట్లు అల్ జజీరా వెల్లడించింది. నష్టం భారీగా ఉండొచ్చని అంచనా వేసింది. సరిహద్దులను పంచుకుంటోన్న ప్రాంతాలన్నీ ఇఫ్పుడు మిలటరీ జోన్‌గా మారినట్లు తెలిపింది.
హెజ్బొల్లా దాడులతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఎమర్జెన్సీని ప్రకటించింది. 48 గంటల పాటు దేశంలో అత్యయిక పరిస్థితి అమలులో ఉంటుందని రక్షణ మంత్రి తెలిపారు. సరిహద్దుల్లో గల జనావాసాలను ఖాళీ చేయించామని, ఆయా ప్రాంతాల్లో సైన్యాన్ని అదనంగా మోహరింపజేశామని అన్నారు.
అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. వందకు పైగా మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లను బరిలో దింపింది. లెబనాన్ భూభాగంపై గల హెజ్బొల్లా స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపించాయా ఎయిర్ క్రాఫ్ట్స్. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మధ్య తూర్పు దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications