'భారత్ మై క్లోజ్ ఫ్రెండ్'.. పాకిస్థాన్ కు అఫ్గాన్ స్ట్రాంగ్ వార్నింగ్..
భారత్, అఫ్గానిస్థాన్ సంయుక్తంగా పాకిస్థాన్ పై కీలక వ్యాఖ్యలు చేశాయి. అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ పాక్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశ భూభాగంలోకి ఏ దేశాన్ని కూడా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. తమ దేశ భూభూగం ఉపయోగించి.. ఏ దేశంపైనా దాడికి పాల్పడేందుకు అఫ్గానిస్థాన్ సహించేది లేదని తెలిపారు. టీటీపీ లక్ష్యంగా కాబుల్ లో పాకిస్థాన్ ఇటీవల చేపట్టిన దాడుల అనంతరం అఫ్గానిస్థాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
దేశ రాజధాని దిల్లీలో అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ భేటీ అయ్యారు. అనంతరం ముత్తాఖీ ప్రసంగించారు. అఫ్గాన్ లో అమెరికా బలగాలు మోహరించిన సమయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కున్నామని తెలిపారు. కానీ భారత్ కు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదన్నారు. భారత్ తో ఎప్పుడూ సత్సంబంధాలను ఏర్పరచుకున్నామని వివరించారు. తమ భూభాగం నుంచి ఇతర దేశాలపై దాడులు నిర్వహించేందుకు ఏ దేశానికి కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇది ఛాలెంజ్ గా తీసుకున్నామని వివరించారు.
ఇటీవల అఫ్గానిస్థాన్ లో భూకంపం వచ్చినప్పుడు భారత్ అందించిన మానవతాసాయానికి ఆ దేశ విదేశాంగ మంత్రి ముత్తాఖీ కృతజ్ఞతలు తెలిపారు. అఫ్గాన్ ఆపదలో ఉన్నప్పుడు స్పందించిన తొలి దేశం భారత్ అని అన్నారు. భారత్ ను తమ క్లోజ్ ఫ్రెండ్ గా భావిస్తున్నామని.. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని వివరించారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో భారత్- అఫ్గానిస్థాన్ ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.

భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, సరిహద్దులో సమగ్రత లాంటి అంశాల్లో భారత్ సహకారం ఉంటుందని తెలిపారు. ప్రాంతీయ సుస్థిరత కోసం ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు అవసరం అని జై శంకర్ స్పష్టం చేశారు. కాబుల్ లో భారత ఎంబసీని రీ- ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications