కాబుల్ జంట పేలుళ్లు: ‘దాడి చేసిన వారిని క్షమించం.. వెంటాడి, వేటాడుతాం’ - జో బైడెన్

కాబుల్ ఎయిర్‌పోర్ట్ బాంబు పేలుడులో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

బాంబు పేలుళ్లు జరిగినప్పటికీ కాబుల్‌ నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.

"ఈ మిషన్‌ను తప్పకుండా పూర్తి చేయాలి. మేము చేస్తాం. టెర్రరిస్టులు మమ్మల్ని అడ్డుకోలేరు" అని బైడెన్ అన్నారు.

అలాగే కాబుల్ దాడికి బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, వెంటాడి వేటాడుతామని ప్రతిజ్ఞ చేశారు.

గురువారం నాడు (ఆగస్ట్ 26) స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు దాడి జరిగింది.

ముందుగా ఎయిర్‌పోర్ట్ అబే గేట్ దగ్గర పేలుడు జరిగింది. ఆ తర్వాత కాల్పులు చోటు చేసుకున్నాయి.

అమెరికా, బ్రిటన్ సైనికులు ప్రజలను తనిఖీ చేసి ఈ గేట్ నుంచే విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు.

కొన్ని నిమిషాల తర్వాత బ్రిటన్ అధికారులు ఉన్న ఒక హోటల్ దగ్గర రెండో పేలుడు జరిగింది.

బ్రిటన్‌కు వెళ్లాలనుకుంటున్న అఫ్గాన్ల దరఖాస్తులను ఆ దేశ అధికారులు ఈ హోటల్‌లో పరిశీలిస్తుంటారు.

బాంబు పేలుళ్లలో 13మంది అమెరికన్లు సహా 60 మంది చనిపోయారు.

ఇస్లామిక్ స్టేట్ ప్రాంతీయ శాఖ అయిన ఐసిస్-K దాడి చేసే ప్రమాదం ఉందని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ప్రజలను తరలిస్తున్న విమానంలో తమకు అవకాశం ఇస్తారన్న ఆశతో వేలాది మంది అఫ్గాన్లు ఎయిర్‌పోర్ట్ దగ్గరికి వచ్చారు.

కాబుల్ జంట పేలుళ్లకు తమదే బాధ్యతని ఈ జిహాదీ గ్రూప్ ప్రకటించుకుంది.

బాంబు పేలుడు జరిగిన ప్రాంతం

'మేము మర్చిపోం, వారిని వెంటాడి, వేటాడుతాం'

"మేము క్షమించం. మేము మర్చిపోం. మేం వారిని వదిలిపెట్టం. వెంటాడి వేటాడుతాం. పేలుళ్లకు వాళ్లు మూల్యం చెల్లించుకునేలా చేస్తాం" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

చనిపోయిన వారిలో 11 మంది సైనికులు, ఒక నేవీ వైద్య సిబ్బంది ఉన్నారని అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ ఫ్రాంక్ మెకంజీ చెప్పారు.

ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలు అర్పించిన హీరోలుగా దాడిలో మరణించిన అమెరికన్ సైనికులను అభివర్ణించారు బైడెన్.

ఐసిస్- కే నుంచి ముప్పు ఎక్కువగా ఉందని, మళ్లీ దాడులు జరగకుండా ఎలా ఆపాలనే దానిపై తాలిబాన్లతో కలిసి పనిచేస్తున్నామని జనరల్ ఫ్రాంక్ మెకంజీ చెప్పారు. తాలిబాన్లు ఇప్పటికే చాలా దాడులను నిలువరించారని వెల్లడించారు.

ఆగస్ట్ 15న కాబుల్‌ తాలిబాన్ల వశమైంది. అప్పటి నుంచి లక్ష మందికి పైగా కాబుల్ నుంచి తరలించారు.

ఆగస్ట్ 31లోగా అమెరికా సేనలు అఫ్గాన్ వదిలి వెళ్లిపోవాలని తాలిబాన్లు డెడ్‌లైన్‌ పెట్టారు.

ఆ డెడ్‌లైన్‌లోగా దేశం వదిలి వెళ్లేందుకు చాలామంది అఫ్గాన్లు కాబుల్ ఎయిర్‌పోర్టుకు వస్తున్నారు.

రెండు బాంబు పేలుళ్ల తర్వాత ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో పొగ

అయితే, తరలింపు ప్రక్రియను ఈ పేలుళ్లు మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం ఉంది.

కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రస్తుతం 5800 మంది అమెరికా సైనికులు, మరో వెయ్యి బ్రిటన్ బలగాలు ఉన్నాయి.

ఇప్పటి వరకు 104000 మంది పౌరులను అఫ్గాన్ నుంచి తరలించారు. వీరిలో 66వేల మంది అమెరికన్లు, 37వేల మంది మిత్రపక్షాల సభ్యులు ఉన్నారు.

సుమారు ఐదు వేల మంది ప్రజలు విమానాశ్రయం బయట ఎదురుచూస్తున్నారు. మరెంతో మంది చెక్ పోస్టులను దాటుకుని అక్కడికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కెనడా, బెల్జియం, నెదర్లాండ్స్, డెన్మార్క్ వంటి దేశాలు తమ ఆపరేషన్లను ఇదివరకే నిలిపేశాయి.

గత ఆరేళ్లుగా ఎయిర్‌పోర్ట్ వద్ద భద్రత కల్పిస్తున్న టర్కీ.. తమ బలగాలను అక్కడి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

బాంబు పేలుళ్ల తర్వాత అత్యవసర సమావేశం నిర్వహించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. కాబుల్ నుంచి తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+