మరో భయంకర ప్రయోగానికి తెరలేపిన కిమ్ జోంగ్ ఉన్
సియోల్/ప్యాంగ్యాంగ్: యుద్ధానికి కాలు దువ్వుతూ, వరుస క్షిపణుల ప్రయోగాలు చేస్తున్న ఉత్తరకొరియా మరో ప్రమాదకర ప్రయోగానికి సిద్ధమైంది. తాజాగా, అందిన సమాచారం ప్రకారం.. ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం)లకు ఆంత్రాక్స్ బ్యాక్టీరియాను అమర్చి శత్రు దేశాల(అమెరికా, దక్షిణకొరియాల)పై ప్రయోగించాలని కిమ్ ప్రణాళికలు వేసుకున్నట్లు తెలిసింది.
Recommended Video

ఈ మేరకు జపాన్ పత్రిక 'అసాహీ' బుధవారం ఓ కథనాన్ని ప్రచురితం చేసింది. అమెరికా ప్రభుత్వానికి కూడా ఈ విషయంపై సమాచారం ఉందని వెల్లడించింది. ఖండాంతర క్షిపణి ప్రయోగం వల్ల వెలువడే ఉష్ణానికి ఆంత్రాక్స్ బ్యాక్టీరియా బతుకుతుందా? లేదా? అనే అంశాన్ని నిర్ధారించుకునేందుకు ఉత్తరకొరియా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

ప్రమాదకర ప్రయోగం
‘బాసిల్లస్ ఆంత్రాసిస్' అనే బ్యాక్టీరియా వల్ల ఆంత్రాక్స్ వ్యాధి సోకుతుంది. ఆంత్రాక్స్‌ను మిలటరీ ఆయుధాల(క్షిపణులు, రాకెట్లు, బాంబుల)కు జోడించి ప్రయోగించడానికి అవకాశం ఉంది. ఆంత్రాక్స్ అణువులను ఎంచుకున్న ప్రాంతంలో విమానాల ద్వారా కూడా వెదజల్లే అవకాశం ఉంది. ఇలా దాడులు చేస్తే దశాబ్దాలపాటు ఆ ప్రాంతంలోని మనుషులతోపాటు ఇతర జీవులకు వ్యాధి సోకుతూనే ఉంటుంది.

మరణం తప్పదు..
ఆంత్రాక్స్ సోకిన తొలి దశలో రెండు నుంచి మూడు రోజులపాటు ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. తీవ్ర జ్వరం, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, షాక్‌కు గురవడం వంటి లక్షణాలు ప్రారంభమవుతాయి. మూడో దశకు చేరుకున్న రెండు రోజుల్లో వ్యాధి సోకిన మనుషులు లేదా ఇతర జీవులు ప్రాణాలు విడాల్సిందే.

అమెరికాను విడిచిపెట్టమంటూ..
అయితే, రసాయన ఆయుధాల తయారీ చేపడుతున్నట్లు వస్తున్న వార్తలను ఉత్తరకొరియా ఖండించింది. ఈ మేరకు ఆ దేశ మీడియాలో ఓ అధికారిక ప్రకటన వెలువడింది. రసాయన ఆయుధాలతో తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న అమెరికాను విడిచిపెట్టబోమని హెచ్చరించింది.

సౌత్ కొరియా హెచ్చరిక
కాగా, వరుసగా ప్రమాదకరమైన ప్రయోగాలు చేయడం పట్ల దక్షిణ కొరియా.. ఉత్తరకొరియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఖరి మార్చుకోవాలంటూ హెచ్చరించింది. ఇది ఇలావుంటే.. 1932 నుంచి 1945 మధ్య కాలంలో చైనా, జపాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. జపాన్‌ను ఆక్రమించేందుకు యత్నించిన చైనా ఈ ‘ఆంత్రాక్స్' ఆయుధాల్లో ఉపయోగించింది.












Click it and Unblock the Notifications