షాకింగ్ : 28 ఏళ్లుగా కొడుకును నిర్బంధించిన తల్లి... అత్యంత దయనీయ స్థితిలో.. ఎట్టకేలకు విముక్తి...
స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో దారుణం వెలుగుచూసింది. ఓ తల్లి తన కుమారుడిని 28 ఏళ్లుగా అపార్ట్‌మెంటులోనే బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని చూసి పోలీసులు షాకే తిన్నారు. తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న అతనికి.. పళ్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇటీవల అతని తల్లి అనారోగ్యం బారినపడి ఆస్పత్రిలో చేరడంతో... అపార్ట్‌మెంటులో అతన్ని బంధించిన విషయాన్ని ఆమె బంధువు ఒకరు గుర్తించారు. స్థానిక అధికారుల సహాయంతో ఎట్టకేలకు అతనికి విముక్తి కల్పించారు.

పోలీసులు ఏమన్నారు...
స్థానిక పోలీస్ అధికారి ఒకరు ఈ ఘటనపై మాట్లాడుతూ... సుదీర్ఘ కాలంగా అతన్ని ఆమె నిర్బంధించినట్లు అర్థమవుతోందన్నారు. అయితే 28 ఏళ్ల నుంచి అతను నిర్బంధంలో ఉన్నాడా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. కన్నతల్లే అతని స్వేచ్చను పూర్తిగా హరించివేసిందని... శారీరకంగా అతనికి హాని తలపెట్టిందని చెప్పారు. అతని కాళ్లకు ఇన్ఫెక్షన్ సోకి నడవలేని స్థితిలో ఉన్నాడని... పళ్లు అసలు లేవని చెప్పారు. కష్టంగా ఒకటీ,అరా తప్పితే పెద్దగా మాట్లాడట్లేదన్నారు.ప్రస్తుతం అతన్ని ఆస్పత్రిలో చేర్పించామని... ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్పినట్లు స్పష్టం చేశారు.

12 ఏళ్ల వయసులో స్కూల్ మానిపించి...
12 ఏళ్ల వయసులో కొడుకును స్కూల్ మానిపించిన ఆ తల్లి... అప్పటినుంచి 28 ఏళ్లుగా అతన్ని నిర్బంధించినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. ప్రస్తుతం అతని వయసు 41 ఏళ్లు అని తెలిపింది. 70ఏళ్ల వయసున్న ఆ తల్లి ఇటీవల అనారోగ్యం బారినపడి ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొంది. ఇదే క్రమంలో ఆమె బంధువు ఒకరు ఆమె ఉంటున్న అపార్ట్‌మెంటుకు వెళ్లగా.. అక్కడ దయనీయ స్థితిలో ఆమె కొడుకును గుర్తించినట్లు తెలిపింది.

ఇళ్లంతా తీవ్ర దుర్గంధం...
'ఆ ఇళ్లంతా మలమూత్రాలు,దుమ్ము,ధూళి... భరించలేని దుర్గంధంతో నిండిపోయి ఉంది. కొన్నేళ్లుగా ఆ ఇంటిని అసలు శుభ్రం చేయట్లేదని అర్థమైంది.ఆ ఇంట్లోకి వెళ్లగానే గుండె ఆగినంత పనైంది... ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాను. ఎట్టకేలకు అతనికి విముక్తి కల్పించినందుకు కాస్త ఉపశమనంగా ఉంది. అతని జీవితాన్ని ఆమె సర్వనాశనం చేసింది. చుట్టుపక్కల వాళ్లకు ఏవేవో కథలు చెప్పి.. ఇన్నేళ్లుగా అతన్ని బయటి ప్రపంచానికి దూరం చేసింది.' అని ఆమె బంధువు పేర్కొన్నారు.

చుట్టుపక్కలవాళ్లు ఏమంటున్నారు...
ఆమె కొడుకుని కొన్నేళ్లుగా తామెవరం చూడలేదని చుట్టుపక్కలవాళ్లు చెప్తున్నారు. అసలు ఆమె తన ఇంటి తలుపులు,కిటికీలే తెరిచేదే కాదని... ఎప్పుడూ ఆ తలుపులు మూసే ఉండేవని చెప్తున్నారు. మూసిన తలుపుల వెనుక ఏం జరుగుతుందో తమకు మాత్రం ఎలా తెలుస్తుందన్నారు. అయితే అతని చదువుకున్న స్కూల్ గానీ,బంధువులు గానీ ఇన్నేళ్లుగా అతని గురించి ఎవరూ ఆరా తీయకపోవడం షాకింగ్‌గా ఉందంటున్నారు. కనీసం భవనానికి మరమ్మత్తులు చేసిన సందర్భంలో కూడా అతన్ని ఎవరూ గుర్తించకపోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications