కరోనా అనుమానం.. నిర్దాక్షిణ్యంగా భార్యను బాత్‌రూమ్‌లో..
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. బయటకు వెళ్లాలన్నా.. అపరిచితులతో మాట్లాడాలన్నా.. ఎక్కడ కరోనా సోకుతుందేమోనన్న అనుమానం వెంటాడుతోంది. అపరిచితులే కాదు.. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా దగ్గినా.. తుమ్మినా.. కాస్త నలతగా ఉన్నట్టు కనిపించినా.. కరోనా బారినపడ్డారేమోనన్న అనుమానం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా లిథువేనియాలో ఓ వ్యక్తి.. తన భార్యకు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఆమెను బాత్‌రూమ్‌లో నిర్బంధించిన ఘటన వెలుగుచూసింది.
Recommended Video

ఇటీవల విదేశాల నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తితో తాను మాట్లాడానని.. అప్పటినుంచి కరోనా సోకినట్టుగా అనిపిస్తోందని ఆ మహిళ తన భర్తతో వాపోయింది. దీంతో భర్త,ఇద్దరు కొడుకులు కలిసి ఆమెను బాత్‌రూమ్‌లో నిర్బంధించారు. బయటకు వస్తానని ఆమె ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఓ అంబులెన్స్‌లో ఆమెను ఆసుపత్రికి తరలించినట్టు పోలీస్ అధికారి రమునస్ మ్యాటోనిస్ తెలిపారు. ఆమె పట్ల ఎలాంటి దాడి,హింసకు పాల్పడలేదని.. వైరస్ తమకు సోకుతుందేమోనన్న భయంతో ఆమెను నిర్బంధించారని చెప్పారు. ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు.

దాదాపు 30లక్షల జనాభా ఉండే లిథువేనియాలో ఇప్పటివరకు ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అతను(39) ఇటీవలే ఇటలీ నుంచి తిరిగొచ్చినట్టు గుర్తించారు. ప్రస్తుతం అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 100 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 3500 పైచిలుకు మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 80కి పైగా దేశాల్లో కరోనా విస్తరించగా.. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.












Click it and Unblock the Notifications