పాకిస్తాన్ లో నరమేథం- ఎక్స్‌ప్రెస్ రైలుపై ఆత్మాహుతి దాడి
పాకిస్తాన్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. బలూచిస్తాన్‌లోని క్వెట్టాలో కొద్దిసేపటి కిందటే భారీ దాడి చోటుచేసుకుంది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఆత్మాహుతి దాడి జరిగింది. క్వెట్టా క్యాంట్ నుండి సైనిక సిబ్బందిని తరలిస్తున్న ఈ రైలు లక్ష్యంగా జరిగిన ఈ భీకర దాడిలో కనీసం 23 మంది మరణించగా, 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు తామే కారణమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించుకుంది.
బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ఆత్మాహూతి బాంబర్ ఒకరు ఈ దాడికి పాల్పడ్డాడు. చమన్ ఫాటక్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాల అతి సమీపంలో తనను తాను పేల్చుకున్నాడు. ఈ శక్తివంతమైన పేలుడు ధాటికి రైలు దెబ్బతిన్నది. బోగీల్లో ఒకటి పూర్తిగా మంటలకు ఆహుతైంది. ట్రాక్‌కు ఆనుకుని ఉన్న అనేక ఇళ్లు, వాహనాలకు సైతం భారీ నష్టం వాటిల్లింది. స్థానికంగా కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.

ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భద్రతా బలగాలు ప్రభావిత ప్రాంతాన్ని చుట్టుముట్టి, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించాయి. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఫిదాయీన్ దాడికి తామే బాధ్యులమని బీఎల్‌ఏ ప్రతినిధి జీయాంద్ బలూచ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
సమాచారం అందిన వెంటనే అత్యవసర రెస్క్యూ బృందాలు, పోలీసు బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. దర్యాప్తు చేపట్టాయి. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తోన్నాయి. ఆత్మాహుతి బాంబర్ మూలాలను కనుగొనే ప్రయత్నాల్లో నిమగ్నం అయ్యాయి. పేలుడు రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీని తీవ్రతకు సమీపంలో ఉండే ఇళ్ల కిటికీ అద్దాలు సైతం పగిలిపోయాయని పేర్కొన్నాయి.
کوئٹہ ٹرین پر دھماکہ اس وقت جب وہ کوئٹہ - کینٹ سے مسافروں کو ریلوے اسٹیشن لے جارہی تھی۔
— Bàhot باھوٹ (@bahott_baloch) May 24, 2026
دھماکے میں بڑے پیمانے پر جانی نقصانات کی اطلات#Quetta #Balochistan pic.twitter.com/LSC7vpfqNI
సంఘటన స్థలం నుంచి దట్టమైన పొగ వెలువడటం, అగ్నికీలలు వ్యాపించడం కనిపించింది. పట్టాలపై రైలు ఆగివుండగా.. దానికి అతి సమీప ప్రదేశం అగ్నిగుండంలా మారింది. స్థానికులు భయాందోళనలతో ఉరుకులు పరుగులు పెట్టారు. అంబులెన్స్, భద్రత సిబ్బంది వాహనాల సైరన్ మోతలతో సంఘటనస్థలం మార్మోగింది. క్షతగాత్రులందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. చాలినన్ని అంబులెన్స్ లు అందుబాటులో లేకపోవడం వల్ల ఇతర వాహనాలపై వారిని తీసుకెళ్లారు.












Click it and Unblock the Notifications