పాక్‌లో డమ్మీ ప్రధాని.. ఆర్మీ చీఫే సుప్రీం: సైన్యాన్ని ఉతికారేసిన మౌలానా!
పాకిస్తాన్‌లోని జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం(జేయూఐ-ఎఫ్) అధినేత, సీనియర్ పార్లమెంటేరియన్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ పాక్ సైనిక నాయకత్వం, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యునెటైడ్ అపోజిషన్(యునైటెడ్ ఫ్రంట్) సమావేశంలో ప్రసంగించిన ఆయన.. ప్రస్తుత ప్రధాన షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎలాంటి స్వతంత్ర అధికారాలు మిగలలేదని, సమస్త అధికారాలు ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేతిలోకి వెళ్లిపోయాయని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ప్రభుత్వ అధికారాలన్నీ మునీర్‌కే అప్పగింత
మౌలానా డీజిల్‌గా పేరొందిన ఫజ్లుర్ రెహమాన్ మాట్లాడుతూ.. సమాఖ్య ప్రభుత్వానికి సంబంధించిన ప్రాథమిక అధికారాలను సైనిక నాయకత్వానికి ధారపోశారని ఆరోపించారు. పాక్ సైన్యం, నావికాదళం, వైమానిక దళాలలో నియామక నిబంధనలను మార్చడమే కాకుండా గతంలో ప్రభుత్వ పరిధిలో ఉన్న సెలవు మంజూరు చేసే హక్కును కూడా ఫీల్డ్ మార్షల్‌కు బదిలీ చేశారని వెల్లడించారు. ఇదొక రకమైన నిరంకుశ పాలనగా మారిందని ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

సుప్రీంగా ఆర్మీ చీఫ్ హవా
ప్రస్తుతం అసిమ్ మునీర్ కేవలం ఆర్మీ చీఫ్‌గానే కాకుండా ఫీల్డ్ మార్షల్‌గా, సాయుధ దళాల రక్షణ శాఖ అధిపతిగా సర్వాధికారాలు చెలాయిస్తున్నారని మౌలానా డీజిల్ అభిప్రాయపడ్డారు. ఆయన ప్రధానికి సలహాదారుగా వ్యవహరిస్తూ.. నేరుగా కేబినెట్ భేటీల్లోనే కూర్చుంటున్నారని.. దాంతో ప్రభుత్వ నిర్ణయాలన్నీ మునీర్ చెప్పినట్లే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. 1988లో జనరల్ జియా-ఉల్-హక్ మార్ష్ లాకు వ్యతిరేకంగా పోరాడి రాజకీయాల్లోకి వచ్చిన తనకు.. మళ్లీ ఇప్పుడు సైనిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
ఇటీవల 1971 నాటి భారత్-పాక్ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం లొంగిపోవడాన్ని ప్రస్తావిస్తూ.. పాక్ సైన్యానికి అసత్యాలు చెప్పే చరిత్ర ఉందని మౌలానా డీజిల్ విమర్శించారు. 1971లో లొంగిపోవడానికి ఒక్క రోజు ముందు వరకు జనరల్ యాహ్యా ఖాన్ చివరి శ్వాస వరకు పోరాడతామని చెప్పి.. మరుసటి రోజే ఆయుధాలు కింద పడేసారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా దేశంలో అదే తరహా పరిస్థితులు నెలకొన్నాయని అభిప్రాయపడ్డారు.
Maulana Fazlur Rehman to the Pakistani military:
— Durand Watcher (@GlobNow34163) August 31, 2026
“Because of you, the country is divided today. Because of you, the country has fallen to such a low point. For 80 years, you or people with the same mindset have ruled this country. At least give an account of these 80 years.… pic.twitter.com/mQhrwr7FXp
పాకిస్తాన్ లో నాలుగు దశాబ్దాలుగా ప్రతినిధ్యం వహిస్తూ కింగ్ మేకర్ గా పేరొందిన ఫజ్లుర్ రెహమాన్.. ప్రతిపక్షాలన్నింటినీ ఒకే తాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీతో సహా ఇతర వర్గాలను ఏకం చేసి, అపరిమిత అధికారాలు పొందుతున్న సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా పోరాట వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఐక్య పోరాటం సైన్యం, ప్రభుత్వాల మధ్య మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications