Michael Jackson కట్టిన మాయా ప్రపంచం.. ఏకంగా 2,700 ఎకరాలు కొనేశాడు!
పాప్ సామ్రాజ్యానికి తిరుగులేని చక్రవర్తిగా ప్రపంచాన్ని ఊపేసిన మైఖేల్ జాక్సన్ పేరు వినగానే మనకు ఆయన ఐకానిక్ డ్యాన్స్, మైమరిపించే పాటలే గుర్తుకొస్తాయి. అయితే చాలామందికి తెలియని నిజమేమిటంటే.. ఆయన కాలిఫోర్నియాలోని విస్తారమైన కొండల మధ్య ఏకంగా 2,700 ఎకరాల్లో ఒక అద్భుతమైన, ఊహించని ఫాంటసీ ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. ఒక సాధారణ విలాసవంతమైన భవనంగా ప్రారంభమైన ఆ సామ్రాజ్యాన్ని మైఖేల్ జాక్సన్ ఒక పూర్తి స్థాయి థీమ్ పార్క్, ప్రైవేట్ జూ, స్వంత రైల్వే స్టేషన్, సినిమా థియేటర్‌గా మార్చేశారు. అదే ప్రపంచప్రసిద్ధి చెందిన "నెవర్‌ల్యాండ్ రాంచ్".
కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా కౌంటీలో ఉన్న ఈ భారీ ప్రాంగణాన్ని మొదట 1981లో విలియం బోన్ అనే డెవలపర్ కొనుగోలు చేసి, 'సికామోర్ వ్యాలీ రాంచ్'గా నామకరణం చేశారు. కొండల నడుమ సుందరమైన పెద్ద భవనం, చెరువులు, వాటర్‌ఫాల్స్‌తో దీన్ని తీర్చిదిద్దారు. 1983లో తన స్నేహితుడు, ప్రముఖ సంగీతకారుడు పోల్ మెక్కార్ట్నీ పాటల షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు మైఖేల్ జాక్సన్ మొదటిసారిగా ఈ ప్రాంగణాన్ని చూశారు. ఆ దృశ్యం ఆయన మనస్సులో అలా ముద్రపడిపోయింది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత, అంటే 1988లో మైఖేల్ జాక్సన్ ఆ ఆస్తిని పూర్తిగా కొనుగోలు చేశారు. అక్కడి నుంచే ఆ భూమి రూపురేఖలు మారిపోయాయి.

పిల్లల కథల్లోని వింత ప్రపంచం భూమిపై ప్రత్యక్షం!
జాక్సన్ ఆ ప్రాంగణానికి 'పీటర్ పాన్' కథల్లో పిల్లలు ఎప్పటికీ పెద్దవారు కాకుండా ఆడుకునే ఊహాత్మక ద్వీపం పేరు మీద 'నెవర్‌ల్యాండ్ రాంచ్' అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ పెద్ద ఇల్లు ఒక ప్రైవేట్ అమ్యూజ్మెంట్ పార్క్‌గా మారిపోయింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఫ్రెంచ్ శైలిలోని పెద్ద భవనంతో పాటు అక్కడ రకరకాల జెయింట్ వీల్స్, రోలర్ కోస్టర్లు, కార్ రౌండ్స్, ప్రైవేట్ థియేటర్, మినీ బొమ్మల రైలు మార్గాలను ఏర్పాటు చేశారు. అంతేకాక, వివిధ రకాల అరుదైన జంతువులతో ఒక ప్రైవేట్ జూను కూడా ఆయన అక్కడ నిర్వహించారు. తన తల్లి 'కేథరిన్' పేరుమీద అక్కడ ఒక అందమైన పూల గడియారంతో కూడిన రైల్వే స్టేషన్‌ను కూడా మైఖేల్ నిర్మించుకోవడం విశేషం.
ఒక్క వివాదంతో మసకబారిన నెవర్‌ల్యాండ్ వెలుగులు!
ఒకప్పుడు ఆనంద నిలయంగా వెలిగిపోయిన ఈ డ్రీమ్‌ల్యాండ్ కథ 2003లో ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. మైఖేల్ జాక్సన్‌పై వచ్చిన కొన్ని నేరారోపణల విచారణలో భాగంగా పోలీసులు నెవర్‌ల్యాండ్‌ను జల్లెడ పట్టారు. ఆ కేసు విచారణ ముగిసి ఆయన నిర్దోషిగా బయటపడినప్పటికీ, తన మనసుకు తీవ్ర గాయమైందని, ఇకపై నెవర్‌ల్యాండ్‌ను తన ఇల్లుగా భావించలేనని మైఖేల్ ప్రకటించారు. తన సోదరి లా టోయా జాక్సన్ రాసిన పుస్తకంలో తెలిపినట్లుగా.. ఆ విచారణ తర్వాత మైఖేల్ మళ్లీ ఎన్నడూ నెవర్ల్యాండ్లో అడుగుపెట్టలేదు. 2009లో ఆయన తుదిశ్వాస విడిచే వరకు ఆ ప్రదేశం ఖాళీగానే ఉండిపోయింది.
రూ. 800 కోట్ల నుంచి రూ. 180 కోట్లకు పడిపోయిన విలువ!
మైఖేల్ జాక్సన్ వైదొలిగిన తర్వాత ఆ ప్రైవేట్ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడ అమర్చిన విలాసవంతమైన ఆట వస్తువులు, జెయింట్ వీల్స్ అన్నింటినీ విడదీసి అమెరికాలోని వివిధ ప్రాంతాల్లోని అమ్యూజ్మెంట్ పార్కులకు అమ్మేశారు. జంతువులను వేరే చోట్లకు తరలించారు. క్రమంగా నెవర్‌ల్యాండ్ తన అసలు పేరు 'సికామోర్ వ్యాలీ రాంచ్'గా మారింది.
2015లో దీనిని విక్రయించడానికి 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 830 కోట్లు) ధర నిర్ణయించినప్పటికీ కొనేవారు లేక క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. చివరికి డిసెంబర్ 2020లో ప్రముఖ పారిశ్రామికవేత్త రోనాల్డ్ బర్కిల్ దీనిని కేవలం 22 మిలియన్ డాలర్లు అంటే ఆ రోజు రేటు ప్రకారం భారత కరెన్సీలో రూ. 180 కోట్లుకు సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది దృష్టిని ఆకర్షించిన ఆ ఊహాత్మక ఫాంటసీ సామ్రాజ్యం, ఈరోజు మైఖేల్ జాక్సన్ జ్ఞాపకాలను మోస్తూ మళ్లీ ఒక సాధారణ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌గా మిగిలిపోయింది.














Click it and Unblock the Notifications
