PRC పై ప్రభుత్వం కీలక ఆదేశాలు, తక్షణమే - సీపీఎస్, బకాయిల పై ఇలా...!!
ఉద్యోగుల దీర్ఘకాలిక అంశాల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఆర్సీతో పాటుగా పలు అంశాల పైన కార్యాచరణ ఫిక్స్ చేసింది. బకాయిల చెల్లింపు విషయంలోనూ స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయాలతో ఈ రోజు ఉద్యోగ సంఘాలు నిర్వహించ తల పెట్టిన నిరసనను వాయిదా వేసుకున్నారు. కాగా.. సీపీఎస్ అంశం పైనా ప్రభుత్వం స్పందించింది. దీంతో.. ఉద్యోగుల ఆర్దిక పరమైన అంశాల పైన కీలక అడుగు పడింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికను తక్షణమే తెప్పించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రిపోర్టును త్వరగా అందజేయాలంటూ పీఆర్సీని ఆదేశించింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)పై అధ్యయానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. అదే విధంగా పెండింగ్ లో ఉన్న కరువు భత్యాల(డీఏ)పై ఈ నెల 18న మరోసారి సమావేశాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 10న నిర్వహించతలపెట్టిన 'చలో హైదరాబాద్' నిరసన కార్యక్రమాన్ని విరమించుకుంటున్నామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (టీజీఈజేఏసీ) ప్రకటించింది. ఈ జేఏసీ నేతలతో పాటు లచ్చిరెడ్డి చైర్మన్‌గా గల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (టీజీఈజేఏసీ) నాయకులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

సీఎస్ ఆదేశాలతో.. ముహూర్తం
పలు కీలక అంశాల పైన ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చారు. పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న 6 కరువు భత్యాల(డీఏ) విడుదల, ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన రూ.10 వేల కోట్ల బకాయిల విడుదల, సీపీఎస్ ఉపసంహరణ, నూతన వైద్య బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేయడం, ఇతర పెండింగ్ సమస్యలపై సమావేశంలో చర్చ జరిగింది. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధాన పునరుద్ధరణపై అధ్యయనానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. పీఆర్సీ సభ్యులు, అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పింది.. తర్వాత 3 నెలల్లో దీనిపై నివేదిక ఇచ్చేలా చర్చ జరిగింది. ఒకవేళ 18న డీఏలపై ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రానట్లయితే, 19న జేఏసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తదుపరి కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రకటిస్తామని టీజీఈజేఏసీ ప్రకటించింది. ప్రభుత్వం నుంచి సానుకూలత రావటంతో ఈ రోజు (గురువారం) తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సంఘాల నేతలు ప్రకటించారు.












Click it and Unblock the Notifications
