మిస్టీరియస్ లొకేషన్స్: పాస్ పోర్ట్, వీసా ఉన్నా ఈ 5 ప్రదేశాలకు వెళ్ళలేరు
పాస్ పోర్ట్, వీసా ఉన్నా ఆ ఐదు ప్రదేశాలకు మాత్రం వెళ్ళలేరు. వీటిని 'నో గో ప్లేసెస్'గా పిలుస్తారు.
మన దేశంలో ఏ ప్రదేశానికైనా హాయిగా వెళ్ళొచ్చు. కానీ విదేశాలకు వెళ్ళాలంటే పాస్ పోర్ట్ , వీసా తప్పనిసరి. అయితే వీసా లేకపోయినా కొన్ని దేశాలకు వెళ్ళొచ్చు. అయితే ప్రపంచంలో ఓ ఐదు మిస్టీరియస్ ప్రదేశాలు ఉన్నాయి.
పాస్ పోర్ట్, వీసా ఉన్నా ఆ ఐదు ప్రదేశాలకు మాత్రం వెళ్ళలేరు. వీటిని 'నో గో ప్లేసెస్'గా పిలుస్తారు. ఈ భూమ్మీదే ఉన్నప్పటికీ ఈ ప్రదేశాలు ఎందుకంత గోప్యంగా ఉన్నాయి? అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామా?

రాయల్ ఎయిర్ ఫోర్స్ మెన్ విత్ హిల్ ( ఇంగ్లాండ్ )
న్యూయార్క్ షైర్ లో ఉన్న దీనిని 1954లో అమెరికా నిర్మించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ మానిటరింగ్ స్టేషన్. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (యూఎస్ఎస్ఆర్) కోల్డ్ వార్ గురించి మాట్లాడే మాటలను రహస్యంగా వినేందుకు అమెరికా దీనిని ప్రారంభించింది.
గ్లోబల్ స్పై నెట్ వర్క్ లో భాగంగా దీనిని గూఢచారి కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. ఇందులో అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ సభ్యదేశాలు. వీటన్నిటినీ కలిపి 'ఎక్లాన్'గా వ్యవహరిస్తారు.

వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్ ( వాటికన్ సిటీ )
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ లైబ్రరీ. ఎనిమిదో శతాబ్దానికి చెందిన 'పోప్'ల వ్యక్తిగత పత్రాలు ఇక్కడ భద్రపరిచారు. ఈ రహస్య పత్రాలను ఇక్కడి లాకర్లలో భద్రంగా ఉంచుతారు. ఇందులో దాదాపు 35,000 పత్రాలు ఉన్నాయి.
క్వాలిఫైడ్ స్కాలర్స్ కు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అదీ వాళ్ళు తప్పనిసరిగా తమ వ్యక్తిగత సమాచారంతో పాటు పరిశోధన ఉద్దేశం తెలిపి, పరిశోధన సంస్థ ఇచ్చిన రికమండేషన్ లెటర్ ఉంటేనే.

ది స్వాల్ బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ ( నార్వే )
ఉత్తర ధ్రువం నుంచి 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రపంచంలోనే హై సెక్యూరిటీ సీడ్ బ్యాంక్ ఇది. నార్వే ద్వీపంలోని స్పిట్స్ బర్గెన్ లో ఉన్న శాండ్ స్టోన్ పర్వతంలో దీనిని 2008 ఫిబ్రవరిలో ప్రారంభించారు.
ఇది విత్తనాలను భద్రపరిచే ప్రదేశం. పర్వతాన్ని తొలిచి 120 మీటర్ల లోతులో ఈ సీడ్ వాల్ట్ ను నిర్మించారు. ప్రకృతి విపత్తుల వల్ల ఏదైనా పంటకు సంబంధించిన విత్తనాలు దొరకకుండా పోయినప్పుడు ఇక్కడి నుంచి వాటిని సేకరించ వచ్చు.
ఇక్కడే ఎందుకు నిర్మించారంటే... ఈ ప్రదేశం సముద్ర ఉపరితలానికి దాదాపు 130 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ భూకంపాలు కూడా సంభవించవు. భూతాప ప్రభావం కూడా ఉండదు. మంచుతో కప్పి ఉన్న భూమి పొర ఉండడం వాళ్ళ విత్తనాలు సురక్షితంగా ఉంటాయి.
భూతాపం వల్ల ధ్రువ ప్రాంతాలు కరిగిపోయినా ఈ బ్యాంకులో ఉన్న విత్తనాలకు ఎటువంటి నష్టం వాటిల్లదు. ప్లాంట్ బ్రీడర్ లేదా విత్తన సంక్షేమం కోసం నియమించిన ప్రత్యేక పరిశోధకుడికి మాత్రమే ఈ విత్తన బ్యాంక్ లోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది.

నిహౌ ( హవాయి ద్వీపం ): లోకల్ ఇన్విటేషన్ ఉంటేనే
హవాయి ద్వీపంలోని ఓ చిన్న ప్రాంతం నిహౌ. 'ఫర్ బిడెన్ ఐలాండ్'గా పిలిచే ఈ ప్రదేశాన్ని హవాయి రాజు 1863లో ఓ కుటుంబానికి అమ్మేశారు. ఇక్కడికి వేరే ప్రాంతాల ప్రజలు (అవుట్ సైడర్స్) రాకూడదని నిహౌ ప్రజలు 1915 నుంచి నిబంధన పెట్టారు.
1944లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ నిహౌను యూఎస్ హెడ్ క్వార్టర్స్ గా ప్రకటించాడు. స్థానికులు ఆహ్వానించిన వారే ఇక్కడ అడుగుపెట్టాలి. ప్రస్తుతం ఇక్కడ 130 మంది మాత్రమే నివసిస్తున్నారు.
ఇక్కడ ఇళ్ళకు ఎలాంటి అద్దె ఉండదు. రోడ్డు, ఫోను సౌకర్యాలు కూడా ఉండవు. చివరికి ప్రవహించే నీరు కూడా ఉండదు. ఇక్కడి పిల్లలు చదువుకోవడానికి సమీపంలోని మరో ద్వీపానికి వెళతారు.

ఏరియా 51 ( అమెరికా ): ఇక్కడంతా రహస్యం
అమెరికాలోని లాస్ వేగాస్ కు 130 కిలోమీటర్ల దూరంలో నెవెడాలో ఉంది ఈ 'ఏరియా 51' ప్రదేశం. ఇతరులెవరినీ ఇందులోకి అనుమతించరు. ఇక్కడేం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. మిలిటరీ, ఎయిర్ ఫీల్డ్ లకు సంబంధిన రహస్య పనులు జరుగుతుంటాయని చెబుతుంటారు.
క్రాష్ అయి పడిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ ల లోపాలను తెలుసుకునేందుకు, కొత్త రకం విమానాలకు పరీక్షలు జరిపేందుకు ఈ ప్రదేశాన్ని ఉపయోగించుకుంటారని సమాచారం. ఇంకా ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయడం, వాటిని ప్రయోగాత్మకంగా పరీక్షించడం వంటివి ఈ రహస్య స్థావరంలో జరుగుతుంటాయని పైకి చేబుతారుగానీ నిజానికి ఇక్కడ గ్రహాంతరవాసులపై ప్రయోగాలు, పరిశోధనలు జరుపుతుంటారని యావత్ ప్రపంచం భావిస్తోంది.












Click it and Unblock the Notifications