34మంది ప్రయాణికులతో విమానం అదృశ్యం
మొజాంబిక్: మొజాంబిక్ దేశం నుంచి అంగోలాకు వెళుతున్న మొజాంబిక్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం శుక్రవారం అదృశ్యమైంది. విమానంలో 28 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారని మొజాంబిక్ విమానయాన సంస్థ పేర్కొంది.
విమానం టిఎం 470 శుక్రవారం సాయంత్రం 3గంటల సమయంలో మాపుటోలో టెకాఫ్ అయింది. అనంతరం అక్కడి నుంచి బయల్దేరిన విమానం సాయంత్రం 6.40గంటలకు అంగోలా రాజధాని లువాండకు చేరుకోవాల్సి ఉందని సంస్థ తెలిపింది. అయితే ఆ లోపే విమానం అదృశ్యమైనట్లు వెల్లడించింది.

ఉత్తర నమీబియా ప్రాంతంలో చిట్టచివరగా ఆ విమాన పైలెట్లతో మాట్లాడినట్లు విమానయాన అధికారులు తెలిపారు. ఆ తర్వాత వారితో తమకు సంబంధాలు తెగిపోయాయని తెలిపారు. విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీస్ కమాండర్ ఒలావి ఔంగా తెలిపారు. అయితే రాత్రి కావడంతో గాలింపు చర్యలు ఆపేశామని ఆయన చెప్పారు. శనివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు విస్తృతం చేసినట్లు ఆయన తెలిపారు.
కాగా బొట్సువానా-అంగోలాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఉత్తర నమీబియా రుండు ప్రాంతంలో విమానం లాండ్ అయ్యే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. రుండుకు సమీపంలోని బొట్సువానా జాతీయ పార్క్ కు 200 కిలోమీటర్ల దూరంలో విమానం అదృశ్యమైనట్లు విమానయాన అధికారి ఒకరు తెలిపారు.












Click it and Unblock the Notifications