లష్కరే చీఫ్ లఖ్వీకి 15 ఏళ్ల జైలు -పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక కోర్టు కీలక తీర్పు
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆపరేషన్స్ చీఫ్, 26/11 ముంబై దాడుల సూత్రధారి జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి సొంత దేశం పాకిస్తాన్ లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్వయంగా ఉగ్రవాద కలాపాలకు పాల్పడుతుండటంతోపాటు ఉగ్ర చర్యలకు ఆర్థిక సహకారం కూడా అందిస్తున్నాడని నిర్ధారణ కావడంతో లఖ్వీని భారీ శిక్ష పడింది.
లష్కరే చీఫ్ జకీఉర్ రహమాన్ లఖ్వీకి పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడినట్లు పాక్ మీడియా పేర్కొంది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై లఖ్వీని పాక్ ఉగ్రవాద వ్యతిరేక పోలీస్ విభాగం (సీటీడీ) గత శనివారం అరెస్టు చేసింది. వారంలోనే కోర్టులో శిక్షలు కూడా ఖరారు కావడం గమనార్హం.

2008లో ముంబై నగరంపై దాడులకు పాల్పడిన తర్వాత లష్కరే చీఫ్ లఖ్వీని.. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అనంతరం లఖ్వీని పాక్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం.. 2015లో రావల్పిండి జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. తర్వాతి కాలంలో..
పేదలకు వైద్య సహాయం ముసుగులో ఒక డిస్పెన్సరీని నడుపుతోన్న లఖ్వీ దాని మాటున ఉగ్రవాద చర్యలకు, ఉగ్రవాదులకు నిధులును అందిస్తున్నట్లు సీటీడీ గుర్తించింది. ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయమై లాహోర్‌లో నమోదైన కేసు ఆధారంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, ఆ సంస్థకు ఆర్థికంగా సాయం చేస్తున్న లఖ్వీని పట్టుకున్నామని పాక్ పోలీసులు వెల్లడించారు.