వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మా నాన్న ఒక క్రూర గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మార్గో పెరిన్

తన తల్లిదండ్రులు తన నుంచి ఏదో దాస్తున్నారని మార్గో పెరిన్‌కు తెలుసు. మరీ ముఖ్యంగా కఠినాత్ముడైన తండ్రి గురించి చాలా రహస్యాలున్నాయి. కానీ, వారు ఏం దాస్తున్నారో తెలుసుకోవడానికి ఆమెకు ఏళ్లు పట్టింది.

మార్గో కుటుంబం వెస్టెండ్‌లోని గ్లాస్గోలో నివసిస్తున్నప్పుడు 13 ఏళ్లున్న ఆమెను తండ్రి ఒక రోజు లివింగ్ రూమ్‌లోని పిలిచాడు.. 'నువ్వు అందంగా కనిపించాలని కోరుకుంటున్నావా' అని అడిగాడు.

అప్పటికి ఆయన మార్గో ఎదురుగా కూర్చుని ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నాడు.. చేతిలో ఎర్రగా కాలుతున్న సిగరెట్, పక్కనే యాష్ ట్రే ఉన్నాయి. ''ఈ సర్జరీతో చెప్పుకోదగ్గ మార్పులు వస్తాయి'' అన్నారాయన, మార్గో మాట వినిపించుకోకుండానే.

ఆ తరువాత లండన్‌లోని ఒక కాస్మొటిక్ సర్జన్ అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్లి కలిశారు. ఆ సర్జన్ మార్గో ముక్కుకు శస్త్రచికిత్స చేయడానికి అంగీకరించారు. మార్గో ఇంకా పెరిగి పెద్దవడానికి ముందే ఆమె ముక్కు ఆకృతి మార్చేయాలన్నది తండ్రి ఆలోచన. అందుకే... ఆమెకు కాస్మొటిక్ సర్జరీ చేయించాలని నిర్ణయించారు.

ముక్కు తీరు మార్చి ముఖాకృతి మార్చాలని ఆ తండ్రి ప్రయత్నించడం వెనుక పెద్ద కథే ఉంది.

మార్గోకు ఏడేళ్లు వచ్చేవరకు ఆమె, ఆరుగురు తోబుట్టువులు తల్లిదండ్రులతో కలిసి కుటుంబమంతా న్యూయార్క్‌లో నివసించేవారు. ఒక రోజు హఠాత్తుగా అక్కడి నుంచి మెక్సికోకు మారిపోయారు.

మెక్సికోలో వారు ఉంటున్న ఇంటికి ఒక రోజు కొందరు వ్యక్తులు వచ్చి ఇల్లంతా వెతికి చిందరవందర చేశారు.

''మనం ఇక్కడున్నట్లు వారికి ఎలా తెలిసింది?'' తల్లి ఏడుస్తూ అనడం మార్గో విన్నది.

''మనం ఇక్కడున్నట్లు ఎవరికీ తెలియకూడదు'' అంటూ ఆ కుటుంబం సామానంతా బండిలో సర్దుతూ అక్కడి నుంచి మళ్లీ ప్రయాణమైంది. ఈసారి మజిలీ బహమాస్.

న్యూయార్క్ నుంచి మెక్సికోకు.. మెక్సికో నుంచి ఇప్పుడు బహమాస్‌కు ఆ కుటుంబం మారింది. కానీ.. తల్లిదండ్రులు మాత్రం అలా ఎందుకు ఉన్నఫళంగా ఒకచోటి నుంచి మరో చోటికి మారిపోతున్నామన్నది ఏనాడూ చెప్పలేదు.

తల్లిదండ్రులూ తమ గతం గురించి పెద్దగా మాట్లాడుకోరు కూడా. కానీ, అప్పుడప్పుడు సంభాషణల్లో వినిపించిన మాటలు.. వాదులాటల ద్వారా మార్గో ఓ విషయం మాత్రం గుర్తించింది. వారు ఎఫ్ బీ ఐ గురించి మాట్లాడుకుంటున్నారని అర్థం చేసుకుంది.

మార్గో తల్లిదండ్రులు లిల్యాన్, ఆర్డెన్‌లు చాలా అందంగా ఉంటారు. ఆర్డెన్ ఎప్పుడూ మడత నలగని దుస్తులు వేసుకుని పైజేబులో రుమాలు పెట్టుకునేవారు. కాళ్లకు వేసుకునే షూస్ కూడా మెరుస్తూ ఉండేవి.. గోళ్లు శుభ్రంగా కత్తిరించుకుని, చెక్కుచెదరని తలకట్టుతో ఎప్పుడూ అందంగా కనిపించేవారు.

లిల్యాన్ కూడా చక్కగా ముస్తాబవుతుంది. చూడముచ్చటైన దుస్తులు ధరిస్తారామె. ఆమె కనుబొమ్మలు తీర్చిదిద్దినట్లు ఉంటాయి.

న్యూయార్క్‌లో వారు నివసించేటప్పుడు దాదాపుగా ప్రతి సాయంత్రం మార్గో తల్లిదండ్రులు సినిమాలు, నాటక ప్రదర్శనలకు వెళ్లేవారు. అలా వెళ్లేటప్పుడు మార్గో పెద్దక్కను పిల్లలకు, ఇంటికి కాపలాగా ఉంచి వెళ్లేవారు.

అయితే., పిల్లలకు ఎప్పుడూ ఒక విషయం చెప్పేవారు. కుటుంబం గురించి ఎవరైనా అడిగితే ఎక్కువ వివరాలు చెప్పొద్దని నిత్యం చెప్పేవారు.

ఒక రోజు మియామీ బీచ్‌లోని తన స్కూలు నుంచి ఇంటికి తిరిగొచ్చింది. ఆమె స్కూలు నుంచి వచ్చేటప్పటికి ఓ వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. ఎవరో ఆయన్ను బాగా కొట్టినట్లుగా కనిపిస్తోంది. తల్లిదండ్రులు గతంలో మాట్లాడుకుంటుండగా విన్న వివరాల ఆధారంగా ఆ వ్యక్తి ఒకప్పుడు తన తండ్రితో పాటు పోలీసులకు దొరికాడన్న సంగతి ఆమెకు తెలుసు.

ఆ తరువాత ఆయన లివింగ్ రూంలో కూర్చునేవాడు. ఆయన్ను ఆ రోజు ఎవరు కొట్టారో ఎందుకు కొట్టారో తల్లిదండ్రులు ఎన్నడూ చెప్పలేదు.

మార్గో, ఆమె తోబుట్టువులకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉన్నప్పటికీ తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షణ మాత్రం కరవయ్యాయి.

పిల్లల పుట్టిన రోజులను కూడా ఆ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకునేవారు కాదు. అంతేకాదు, కఠినంగా వ్యవహరించే తండ్రిని చూసి భయపడేవారు.

తండ్రి బయట పనులు చేసుకుని వచ్చేసరికి పిల్లల్లో ఎవరైనా ఏదైనా నచ్చని పనిచేసినట్లు తెలిస్తే దారుణంగా కొట్టేవాడు. తన మోకాళ్లపై వారిని అడ్డంగా పడుకోబెట్టి టేబుల్ టెన్నిస్ బ్యాట్‌తో తీవ్రంగా కొట్టేవాడు. తల్లి కూడా అలా చూస్తూ ఉండేదే కానీ ఆపేది కాదు.

మార్గోకు తండ్రంటే విపరీతమైన భయం ఉన్నప్పటికీ ముక్కుకు సర్జరీ చేయించుకోమని ఆయన చెప్పినప్పుడు ఆమె సర్జరీ వద్దని స్పష్టం చేసింది.

కానీ, ఆమె సోదరి తన వద్దకు ఏడుస్తూ వచ్చి 'దయచేసి సర్జరీ చేయించుకో.. లేదంటే నాన్న నన్ను ఇంటి నుంచి బయటకు పోనివ్వడు' అని వేడుకుంది.

అక్కచెల్లెళ్లంతా తమ తల్లిదండ్రుల నుంచి తప్పించుకోవాలని, ఎటైనా పారిపోవాలని అనుకున్నారు. అంతేకాదు, మార్గో తన సోదరికి అడ్డం కాకూడదనీ అనుకుంది. ఆమెను ఎలాగైనా సరే ఇబ్బందుల నుంచి రక్షించాలనుకుంది.

దాంతో మార్గో ముక్కు సర్జరీ కోసం డాక్టరు దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమైంది. అక్కడ డాక్టర్ ఆమెకు ఒక పుస్తకం ఇచ్చారు. అందులో ఎన్నో రకాల ముక్కుల బొమ్మలున్నాయి. మార్గోను ఆ ఆసుపత్రిలో ఉంచి తండ్రి అక్కడి నుంచి గ్లాస్గో వెళ్లాడు.

మూడు రోజుల తరువాత మార్గో ముఖమంతా కట్లుతోనే ఒంటరిగా గ్లాస్గోకు బయలుదేరారు.

అంతకు కొద్దిరోజుల ముందే ఆ కుటుంబం లండన్ వచ్చింది. లండన్ వచ్చిన తరువాత మరిన్ని ఇబ్బందులు మొదలయ్యాయి.

అక్కడికి వచ్చిన కొద్ది నెలల తరువాత మార్గో తన పెద్దక్కతో ఫోన్లో మాట్లాడుతూ, ''నన్ను చంపేసేలా ఉన్నాడు'' అని మెల్లగా చెప్పింది. మార్గో పెద్దక్క అప్పటికి ఏదోరకంగా ఇంటి నుంచి బయటపడగలిగింది. ఆమె గ్లాస్గోలో తన బాయ్‌ఫ్రెండ్‌తో నివసించేది.

పెద్దక్కతో మాట్లాడుతున్నప్పుడు తండ్రి వెనక నుంచి వచ్చాడు.. 'ఎవరు నిన్ను చంపాలనుకుంటున్నారు' అంటూ కరకుగా ప్రశ్నించి చేతిలోనే ఫోన్ రిసీవర్‌ను లాక్కుని పడేశాడు. మరో చేత్తో మార్గో జుత్తు పట్టుకుని మెడ ఒక వైపు గట్టిగా వంచేస్తూ ఆమె చెప్పేవరకు అలాగే వేధించాడు.

ఆ తరువాత మార్గో గ్లాస్గోలో ఒక పబ్‌కు వెళ్లింది. అక్కడ ఒక స్నేహితుడిని కలవాలనుకుంది. కానీ, ఆయన రాకపోవడంతో అక్కడే కలిసిన ఒక గడ్డం వ్యక్తితో కలిసి మద్యం సేవించింది. ఆ తరువాత ఇద్దరూ అతని ఫ్లాట్‌కు వెళ్లారు. మత్తులో ఉండగానే ఇద్దరూ సెక్స్‌లో పాల్గొన్నారు.

ఆ కలయిక ఫలితంగా ఆమెకు గర్భం వచ్చింది. తండ్రికి ఆ విషయం తెలియగానే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయాడు. 'నీ కడుపులో బిడ్డకు తండ్రెవడు' అంటూ మార్గో పొట్టలో తన్నాడు. గర్భం తొలగించుకోమని బలవంతం చేశాడు.

కానీ, మార్గోకు ఆ గర్భం తొలగించుకోవాలని లేదు. కానీ, ముక్కు మార్పిడి చేయించుకున్నట్లే ఇప్పుడూ ఆమెకు తండ్రి మాట వినడం తప్ప గత్యంతరం లేకపోయింది.

ఒక రోజు తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించింది.

ఆ తరువాత కొన్నాళ్లకు తన 16వ ఏట మార్గో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. తొలుత ఒక బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బతికిన తరువాత మరో బాయ్ ఫ్రెండ్ వద్దకు వెళ్లింది. అలా మూడేళ్లపాటు వేర్వేరు వ్యక్తులతో జీవించాక 19వ ఏట ఆమెకు క్యాన్సర్ సోకిన విషయం బయటపడింది. ఆమె బతకడం కష్టమని వైద్యులు చెప్పేశారు.

''అప్పుడు నేను బతకాలనుకున్నాను.. నిజంగా నాకోసం నేను ఏమైనా చేయాలనుకున్నాను'' అనుకున్నారామె.

క్యాన్సర్‌తో పోరాడి వ్యాధి నుంచి కోలుకున్న తరువాత మార్గో తన జీవితాన్ని మననం చేసుకున్నారు. అప్పటికి ఆమెకు, తల్లిదండ్రుల మధ్య సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి.

కానీ, తల్లిదండ్రులు తనను పెంచినప్పుడు ఏదో దాయాలనుకున్నారు.. వారు ఎందుకలా హఠాత్తుగా ఊళ్లు మారేవారన్న రహస్యం ఆమె తెలుసుకోవాలనుకున్నారు.

అక్కడికి కొన్ని సంవత్సరాల తరువాత మార్గో అక్కచెల్లెళ్లలో ఒకరు 'న్యూయార్క్ టైమ్స్' పత్రికకు లేఖ రాయగా అది ఆ పత్రిక ఎడిటోరియల్ పేజీలో అచ్చయింది.

ఆ లేఖతో తన తల్లిదండ్రుల గురించిన వాస్తవాలు ఆమెకు అర్థంకాసాగాయి. 2007లో ఆమెకు మరింత సమాచారం తెలిసింది. 2004లో తండ్రి గుండెపోటు కారణంగా చనిపోయారని.. విశ్రాంత ఆర్థికవేత్త చనిపోయినట్లుగా ఆయన డెత్ సర్టిఫికేట్లో ఉన్నట్లు తెలుసుకుంది. ఇది మార్గో సోదరుడి భార్య ద్వారా ఆమెకు చేరింది.

ఈ వివరాలను ఆమె ఎఫ్‌బీఐకి పంపించి తన తండ్రి ఆర్డెన్ వివరాలు కావాలని కోరింది. ఎఫ్‌బీఐ నుంచి ఆమెకు 100 పేజీల ఫైల్ ఒకటి వచ్చింది. అందులో 1940ల్లో జరిగిన నేరాలు, వాటితో తన తండ్రికి గల సంబంధం వివరాలన్నీ ఉన్నాయి.

ఎఫ్‌బీఐ పంపించిన ఫైల్‌లోని వివరాలు చూసిన మార్గో హతాశురాలైంది. తన తండ్రి ఆర్డెన్‌కు న్యూయార్క్ మాఫియా ప్రపంచంతో సంబంధాలున్నాయని తెలుసుకుంది. 1,40,000 డాలర్ల దివాలా కేసుతో ఆయనకు సంబంధం ఉందని.. ఎఫ్‌బీఐ ఆయన్ను వెతికేదని తెలుసుకుంది.

అంతేకాదు, ఉనికిలో లేని సంస్థల పేరు చెప్పి జనాలను నమ్మించి పెట్టుబడులు పెట్టేలా చేయడంలో ఆర్డెన్ ఆరితేరిపోయారని.. స్కాట్లాండ్‌లో కూడా ఆయన విస్కీ ఒక్క చుక్క కూడా అమ్మకుండానే విస్కీ వ్యాపారం పేరుతో షేర్లు విక్రయించారని తెలిసింది.

అలాంటి వ్యవహారాల కారణంగానే ఆయన దాదాపుగా జీవితకాలమంతా ఎవరికీ దొరక్కుండా వేర్వేరు దేశాల్లో తలదాచుకున్నాడని అర్థమైంది మార్గోకు.

మార్గో చాలా బాధపడింది.. 'నా తండ్రి వృత్తి ప్రజల డబ్బు దోచుకోవడం.. ఆయనో గ్యాంగ్‌స్టర్' అనుకుని బాధపడిందామె.

అయితే, తనను ముక్కు మార్పిడి చేయించుకోమని తండ్రి ఎందుకు బలవంతం చేశాడో ఆమెకు అంతుచిక్కలేదు.

ఆలోచించగా ఆలోచించగా ఆమె తండ్రి ఎందుకలా చేశాడో అంచనా వేయగలిగింది. తాను, తన కుటుంబం ఎక్కడి నుంచి వచ్చారన్నది దాచిపెడుతూ బతికిన ఆయన మార్గో ముక్కు ఆకృతిని బట్టి యూదులన్న విషయం ఎవరికైనా తెలిసిపోతుందన్న భయంతో ఏకంగా సర్జరీ చేయించాడని అర్థం చేసుకుంది.

నిజానికి మార్గోకు ఆమె తోబుట్టువులు, వారి మూలాలే తెలియకుండాపోయాయి. ఆమె స్నేహితులు మాత్రం ఆమెతో నువ్వు యూధురాలిలా ఉన్నావు అనేవారు. వీటన్నిటి ఆధారంగా మార్గో తన అంచనాయే నిజమన్న నిర్ణయానికి వచ్చింది. గుట్టు బయటపడకుండా ఉండేందుకే తండ్రి అలా బలవంతంగా తన ముక్కుకు సర్జరీ చేయించాడని ఆమె నిర్ధారణకు వచ్చింది. తన తండ్రి అంత దారుణంగా వ్యవహరించడాని తెలుసుకుని ఎంతో బాధపడింది.

ముక్కు శస్త్రచికిత్స

అయితే, పరిశోధకులు మాత్రం యూదుల ముక్కు ప్రత్యేకంగా ఉంటుందని.. ముక్కు ఆధారంగా యూదులను గుర్తించవచ్చన్న నమ్మకాలు నిజం కాదని చెబుతున్నారు. 1911లో ఆంత్రపాలజిస్ట్ మారిస్ ఫిష్‌బర్గ్ చేసిన అధ్యయనమూ ఇదే తేల్చిందని చెబుతున్నారు.

కాగా ప్రస్తుతం 64 ఏళ్ల వయసున్న మార్గో తన జీవితంలో అనేక విజయాలు సాధించారు.

సగంలోనే స్కూలు మానేసిన ఆమె రచయితగా పేరుపొందారు. అంతేకాదు.. అమెరికా, బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయాల్లో క్రియేటివ్ రైటింగ్ పాఠాలు చెబుతారు.

మార్గోకు సంతానం లేకున్నా పిల్లలంటే ఆమెకు చాలా ఇష్టం. బహుశా 14 ఏళ్ల వయసులోనే బలవంతంగా అబార్షన్ చేయించుకోవడం వల్ల కలిగిన బాధ వల్లేమో తనకు తల్లిగా ఉండాలనిపించలేదని చెబుతారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
'My father was a cruel gangster...he changed my nose to hide my roots'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X